నెల్లూరుఅర్బన్, ఫిబ్రవరి 6: ఇటీవల అరెస్ట్ చేసిన మద్యం సిండికేట్ సభ్యులైన బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన శ్రీనివాసులురెడ్డి, నరసింహారావు, ప్రకాశం జిల్లాకు చెందిన ఎ వెంకటరావు, వెంకట్రావులను సోమవారం ఎసిబి అధికారులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ వారికి రిమాండ్ విధించడంతో పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
ఎసిబి కస్టడీకి కోర్టు తిరస్కృతి
మద్యం సిండికేట్ల లావాదేవీల్లో అరెస్ట్ అయిన సింగరాయకొండ ఎక్సైజ్ సిఐ గురవయ్య, కోవూరు ఎస్సై విజయ్‌కుమార్‌లను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో ఎసిబి అధికారులు రిట్ వేయడంతో దానిని కోర్టు తిరస్కరించింది. మంగళవారం మరోసారి ఎసిబి అధికారులను కోర్టులో రిట్ వేయనున్నట్లు సమాచారం.
.....
లభ్యంకాని యువకుడి ఆచూకీ
రెండవ రోజూ కొనసాగిన గాలింపు
ఆత్మకూరు, ఫిబ్రవరి 6: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని చెరువు వద్ద ఆదివారం గల్లంతైన యువకుని ఆచూకీ ఇంతవరకూ ఆచూకీ లభ్యం కాలేదని సోమవారం ఎస్సై ఆంజనేయరెడ్డి తెలిపారు. పోలీసుల కథనం మేరకు ఆదివారం చెరువు వద్ద గల్లంతైనది తమ కుమారుడేనని స్థానిక శివాలయం వీధిలో నివాసం ఉండే వెంకటయ్య అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు పేరు తిరపతయ్య(22) అని, ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఇంటికి రాలేదని, చెరువు వద్ద లభ్యమైన దుస్తులను పరిశీలించగా అవి తమ బిడ్డవేనని అన్నారని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన పోలీస్ సెలక్షన్స్‌కు కూడా వెళ్లాడన్నారు. చెరువు దగ్గర మహిళలు గుడ్డలు ఉతుకుతుండగా బకెట్టు చెరువులోకి కొట్టుకు పోవడంతో ఆ యవకుడు తాను తీసుకొస్తానని చెరువులోకి దిగినట్లు మహిళలు తెలిపారు. కాసేపు చెరువులో ఈతకొట్టి తిరిగి గట్టుకు వచ్చేశాడని అందరం కలిసి నివాసానికి వచ్చేశామని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. తర్వాత ఎవరికీ చెప్పకుండా బకెట్టు కోసం చెరువు దగ్గరికి వెళ్తుండగా మార్గమధ్యంలో తన స్నేహితులకు ఈవిషయం చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఉదయం నుంచి 15మంది గజ ఈతగాళ్లతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టినా చివరకు నిరాశే మిగిలింది. ఏది ఏమైనా చెరువులో గల్లంతైన వ్యక్తి బయట పడితే కాని పూర్తివివరాలు తెలియవని పోలీసులు తెలిపారు.