దొరవారిసత్రం, ఫిబ్రవరి 6: జాతీయ రహదారిపై అక్రమంగా ఓ సుమోలో 10 లక్షల రూపాయలు విలువచేసే 210 కేజీల గంజాయిని సోమవారం దొరవారిసత్రం ఎస్సై వేణుగోపాలరెడ్డి స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం జాతీయరహదారిపై తల్లంపాడు టోల్‌ప్లాజా సమీపంలో ఎస్సై వేణుగోపాలరెడ్డి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంలో ఓ సుమో అనుమానాస్పదంగా ఆగి ఉండటంతో పోలీసులు దానిని పరిశీలించారు. అయితే సుమో పరిసర ప్రాంతంలో ఎవరూ లేకపోవడం అందులోనుంచి ఓ రకమైన గాటు వాసన రావడంతో అనుమానంతో సుమోను తనిఖీ చేయగా, అందులో గంజాయి ఉన్నట్లు ఎస్సై వేణుగోపాలరెడ్డి గుర్తించి సమాచారాన్ని నాయుడుపేట సిఐ మాణిక్యరావుకు తెలిపారు. సిఐ సూచనల మేరకు సుమోను స్టేషన్‌కు తరలించి గంజాయిని తూకం వేశారు. సుమోలో మొత్తం 210 కేజీలు గంజాయి ఉండగా, దాని విలువ సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. అనంతరం ఎస్సై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది దద్దమ్మ ప్రభుత్వం
చంద్రబాబు స్పష్టం
కలిగిరి, ఫిబ్రవరి 6: అన్ని ధరలూ పెరిగిపోయి రైతాంగం పంటలు నష్టపోయి పెట్టుబడులు తిరిగి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతుండగా ఈ దద్దమ్మ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండలంలో చంద్రబాబు సోమవారం రైతుపోరుబాటలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని 9వమైలు, అయ్యపురెడ్డిపాలెం, పెదకొండూరు, పెదపాడు గ్రామాల్లో రైతులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ విమర్శించారు. తాము సమర్థవంతమైన సుపరిపాలన అందించగా, అన్ని వర్గాలు సజావుగా జీవనం సాగించారన్నారు. ఈ సందర్భంగా మార్గమధ్యంలో ఆయన ఎండిపోయిన పత్తి చేను చూసి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే పోలంపాడువద్ద తెలుగుదేశం కార్యకర్తలు, రైతుల కోరిక మేరకు ఆయన ట్రాక్టర్‌తో దుక్కి దున్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు రైతాంగం ఐకమత్యంతో పోరాడాలని, గతంలో కాంగ్రెస్‌కు ఓట్లేసినందునే ఇప్పుడు అవస్థలు పడ్తున్నారని చెప్పారు. పెదపాడు గ్రామంలో ఒక మహిళ వ్యవసాయం ఎంత భారంగా మారిందో కంట తడిపెట్టుకుంటూ వివరించగా, అందుకు కారణం కాంగ్రెస్ పాలకులేనని, మరో సారి ఆ పార్టీకి ఓట్లేయవద్దని బాబు కోరారు. తాను రైతులను నేరుగా కలిసి సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పోరుబాటు పాదయాత్ర సాగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ నియోజకవర్గంలో రైతుల కోసం పని చేసేందుకు బొల్లినేని రామారావు, వంటేరు వేణుగోపాల్ రెడ్డి సిద్ధంగా ఉన్నారన్నారు. తాను రైతుల కోసం ప్రాణాలర్పిస్తానని, కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టేవరకు తనకు ప్రజలు అండగానిలవాలని కోరారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే మస్తాన్‌రావు, ఉదయగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొల్లినేని రామారావు ఇతర నాయకులు ఉన్నారు.