కలిగిరి, ఫిబ్రవరి 6: ప్రజల కోసం ప్రాణాలడ్డుపెట్టి పని చేస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్ అంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. సోమవారం రైతుపోరుబాట కార్యక్రమంలో భాగంగా కలిగిరి మండలంలోని పలు చోట్ల ప్రసంగించిన ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపి రాజమోహన్ రెడ్డిలపై విమర్శనాస్త్రాలు సంధించారు. కేవలం వ్యాపారాలు, డబ్బు కోసమే వారు ఆ పార్టీలోకి వెళ్ళారని, వైఎస్ హయాంలో కోట్ల రూపాయలు ఎలా సంపాదించారన్నారు. మేకపాటి సోదరులకు ఇంత సంపద వైఎస్‌తో కలిసి ప్రజాసొమ్మును స్వాహా చేసారని చెప్పారు. బంధుమిత్రులకు కుమారుడికి వైఎస్ దోచిపెట్టారని, రాష్ట్రానికి పట్టిన శనిగా కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్‌లు దాపురించాయని, ఆ రెండు పార్టీలు ఒక తానులో గుడ్డలేనన్నారు. ఇప్పటిదాకా సంపాదించింది చాలలేదని కొందరు ఇటీవల ఉదయగిరిలోని నరసింహస్వామి దేవస్థానంలో శ్రీకృష్ణదేవరాయలు నిధులు దాచిపెట్టారని తవ్వినట్లు తెలిసిందన్నారు. తమ పార్టీ వాళ్ళ జోలికొస్తే తోకలు కత్తిరిస్తామని, కార్యకర్తలకు తాము అండగా ఉంటామన్నారు.
........
తప్పు చేసిన వాళ్ళను తరిమికొట్టండి
చంద్రబాబునాయుడు పిలుపు
జలదంకి, ఫిబ్రవరి 6: తప్పు చేసిన వాళ్ళు ప్రజల వద్దకు వస్తే తరిమికొట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం కలిగిరి మండలంలో రైతు పోరుబాటకు పయనమైన ఆయనకు మార్గమధ్యంలో జలదంకిలోని ఆ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బస్టాండ్ సెంటర్లో ఆయన స్థానికులద్దేశించి మాట్లాడుతూ ఇటీవల లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తి ఊరూరా తిరుగుతూ గొప్పలు చెప్పుకుంటూ వస్తున్నారన్నారు. ఆయన కోసం ఇప్పుడు కొందరు ఐఎఎస్ అధికారులు కూడా జైలుకెళ్ళాల్సి వస్తోందన్నారు. పేద వాళ్ళకు న్యాయం చేయని ప్రభుత్వాలకు బుద్ధి చెప్పకుంటే మరిన్ని దారుణాలు జరుగుతాయన్నారు. అవినీతి అక్రమాల పుట్టగా తయారైన కాంగ్రెస్ పాలనకు చరమ గీతం పాడాలని, సుపరిపాలన కోసం తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి సారధ్యంలో మండల నాయకులు జయచంద్రారెడ్డి, మస్తాన్‌రెడ్డి తదితరులు ఇక్కడకు పెద్దసంఖ్యలో కార్యకర్తలను తరలించారు.
చంద్రబాబు హెచ్చరిక
english title:
toka kattiristam
Date:
Tuesday, February 7, 2012