కలిగిరి, ఫిబ్రవరి 6: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండలంలో నిర్వహించిన రైతు పోరుబాట కార్యక్రమం విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. 14వ మైలు వద్ద పచ్చ జెండాలతో అలంకరించిన ఎద్దుల బండిపైకి ఎక్కి మధ్యాహ్నం 12-30 గంటలకు చంద్రబాబు ఈ కార్యక్రమం ప్రారంభించారు. కొంతదూరం వచ్చిన తరువాత రైతులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్ర సాగించగా, మార్గమధ్యంలో పెదపాడు, పోలంపాడు గ్రామాల్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. భోజనానంతరం పెదపాడులో నూతనంగా నిర్మించిన ఆలయంలో మహంకాళి, జ్వాలాముఖి అమ్మవార్లను దర్శనం చేసుకుని పోలంపాడులో పసుపు రైతులను పరామర్శించారు. రేషన్ బియ్యం, విద్యుత్ సరఫరా తదితర సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. వీరారెడ్డి పాలెం మీదుగా మార్గమధ్యంలో వివిధ పంటలను పరిశీలిస్తూ రైతులను పరామర్శిస్తూ కలిగిరి బహిరంగ సభకు ఆయన పాదయాత్ర సాగించారు. ఆయనతోపాటు ఆద్యంతం తెలుగుయువత, రైతులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఉదయగిరి నియోజకవర్గ టిడిపి నేత బొల్లినేని రామారావు, మాజీ ఎమ్మెల్యే వంటేరువేణుగోపాల్ రెడ్డిల సారధ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయగా, పచ్చదనం పులుముకున్న 72 ఎద్దుల బండ్లు ఈ పోరుబాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేపినాపి వద్ద వేళ్ళ నరేంద్ర వరికంకులతో స్వాగతం పలికి హారతులివ్వగా నెల్లూరుకు చెందిన నూనె మల్లికార్జున పూలకిరీటం పెట్టి విల్లునంద చేసారు. పార్టీ అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కావలి ఉదయగిరి గూడూరు ఎమ్మెల్యేలు మస్తాన్‌రావు, కురుగొండ్ల రామకృష్ణ, బల్లి దుర్గాప్రసాద్, సీనియర్ నాయకులు కరణం బలరామ్, వర్ల రామయ్య, రమేష్‌రెడ్డి, లాల్‌జాన్‌బాషా, పరసా రత్నం, నువ్వుల మంజుల, తెలుగు మహిళ అధ్యక్షురాలు అంచల వాణి తదితరులు చంద్రబాబు వెంట పాల్గొన్నారు.
మీ ఊళ్లో దొంగ ఉంటే మీరు మాట్లాడతారా!
జగన్ పార్టీని ఆదరిస్తారా ?
పోరుబాటలో గ్రామగ్రామాన చంద్రబాబు విసుర్లు
నెల్లూరు టౌన్, ఫిబ్రవరి 6: మీ ఊళ్లో దొంగతనాలు, చెడ్డపనులు చేసే వ్యక్తులు ఉంటే అతడితో మీరు మాట్లాడతారా...అలాగే జగన్‌వంటి అవినీతిపరుడు పార్టీ పెడితే ఆదరిస్తారా అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఊరూరా ప్రశ్నించారు. ఆయన సోమవారం కలిగిరి మండలంలో రైతుపోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌నుద్దేశించి మన పిల్లోడు రాష్ట్రాన్ని నిలువునా దోచుకుతిన్నాడని వ్యాఖ్యానించారు. అవినీతి క్యాన్సర్‌లాంటిదన్నారు. మనిషి ఒంట్లో క్యాన్సర్ వస్తే సోకిన అవయాన్ని తొలగించడం ద్వారా జీవితాన్ని కాపాడుకుంటారన్నారు. అలా చేయకుంటే ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. అదే అవినీతి క్యాన్సర్ సమాజంలో సోకితే అందరికీ ప్రమాదమేనన్నారు. తెలుగుదేశం రాష్ట్రంలో 17 ఏళ్లపాటు స్వచ్ఛమైన పాలన అందించిందని గుర్తు చేశారు. జవాబుదారీతనంగా పరిపాలించామన్నారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకే పాలన వంటి కార్యక్రమాలతో ప్రజలకు మేలైన ప్రయోజనాలు చేకూరాయని పేర్కొన్నారు. అయితే ఎవడబ్బ సొమ్మని ఇటు జగన్, అటు గాలి జనార్ధనరెడ్డి ప్రజాధనం దోచుకుతిన్నారని దుయ్యబట్టారు. భావితరాలకు అక్కరకొచ్చే ఆస్తుల్ని అప్పనంగా దిగమింగారన్నారు. ఇదిలాఉంటే ఉదయగిరి నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలుగా వ్యవహరిస్తున్న మేకపాటి సోదరుల ఆగడాలు అధికమయ్యాయన్నారు. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరిక చేశారు. తాము నామకరణం చేసిన గొట్టిపాటి కొండపనాయుడు (సోమశిల ఉత్తర) కాలువ అలైన్‌మెంట్ మార్చడంపైనా చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే కలిగిరి, కొండాపురం మండలాలకు కూడా సాగునీరు విస్తృతంగా సమకూరేలా తిరిగి అలైన్‌మెంట్ మారుస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉదయగిరి నియోజకవర్గం వంటి మెట్ట ప్రాంతాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం అధికారంలోకి రాగానే ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తామని వెల్లడించారు. తమ పోరాట ఫలితంగానే రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్‌లు మనుగడ కోల్పోయన్నారు. 2004లో తమ పరిపాలన ముగిసే సమయానికి మిగులు బడ్జెట్, మిగులు కరెంట్ వంటివి అందించి వెళ్లామన్నారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి పని జరిగినా అది తెలుగుదేశం హయాంలోనేనని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయల వరకు ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపుతుండటం బాధాకరమన్నారు. వ్యవసాయం భారమై గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందని వ్యాఖ్యానించారు. రైతు అజెండానే దేశ అజెండాగా పాలకులు కొనసాగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్రంలోని ఎంపీలు దద్దమ్మలుగా ఉన్నారన్నారు. తమ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఢిల్లీ నేతల్ని గజగజలాడించారన్నారు. ఫోన్‌కాల్స్‌తోనే ఢిల్లీలో ఎన్నో కీలకమైన పనులు కూడా నిర్వహించుకున్న ఘనత తాను ముఖ్యమంత్రిగా ఉండేదన్నారు. ఆదరణ పథకంతో బలహీనవర్గాల సంక్షేమానికి బాటలు వేశామన్నారు. ముస్లీమ్ మైనారిటీల కోసం షాదీమంజిళ్లు నిర్మించామని గుర్తు చేశారు. అదేవిధంగా యానాదుల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించామన్నారు. పిసిసి అధినేత నేరుగా మద్యం వ్యాపారం అవతారం ఎత్తడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఆయన ఆధీనంలో ఉండే గాంధీభవన్‌కు బ్రాందీభవన్‌గా నామకరణం చేస్తే బాగుంటుందన్నారు.