నెల్లూరు టౌన్, ఫిబ్రవరి 6: కోవూరు నియోజకవర్గ ఉప ఎన్నికకు వచ్చే నెలలో షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిలు ముమ్మరంగా ప్రచారం చేస్తుంటే అధికార కాంగ్రెస్‌పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థిత్వంపై స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. దీంతో టిక్కెట్ కోసం ఆశావహులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి పట్ట్భారామిరెడ్డిలు ఇద్దరూ అడపాదడపా ప్రచారం చేసుకుంటున్నారు. ఇద్దరూ తమదంటే తమకే టిక్కెట్ అంటూ పోటాపోటీగా వ్యవహరిస్తున్నారు. ప్రజా సమస్యల్ని తెలుసుకుని అధికారపార్టీ కావడం వల్ల పరిష్కార దిశగా యుద్ధప్రాతిపదికన వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో మరింత సానుకూలత పొందేందుకు హడావుడి పడుతున్నారు. ప్రజారోగ్యం కాంక్షిస్తూ వైద్య శిబిరాలు చేపడుతున్నారు. నెల్లూరు నారాయణ విద్యా, వైద్య సంస్థలకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తుండటం వల్ల వేమిరెడ్డి ఈ రాజకీయ వైద్య శిబిరాలను నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ముందెన్నడూ లేనిది ఇప్పటికప్పుడు ఇలా వైద్య శిబిరాలను నిర్వహించడంపై ఎన్నికల కోసమేనని స్పష్టంగానే తెలుస్తోంది. తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సిలు ప్రచారపర్వంలో చాలా ముందంజలో ఉన్నాయని, ఇప్పటికైనా అభ్యర్థిత్వం తేల్చండి అంటూ కోవూరు నియోజకవర్గ శ్రేణుల స్వరాన్ని జిల్లా కాంగ్రెస్ పెద్దలంతా ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడి సమక్షంలో వినిపించి నెలరోజులైపోతోంది. ఇదిగో, అదిగో అంటూ వాయిదా వేయడమే తప్ప అభ్యర్థిత్వం ఖరారు కాలేదు. రాజధాని సమీక్షలో ఎక్కువ అభిప్రాయాలు తనకు అనుగుణంగా రావడంతో పోలంరెడ్డి తొలుత హుషారుగా కనిపించారు. అయితే అదంతా ఉత్తదే...ఇంకా ఖరారే కాలేదు...ఏదేమైనా తనకే టిక్కెట్ దక్కుతుందని పట్ట్భా నియోజకవర్గమంతా ప్రదక్షణాలు చేస్తూనే ఉన్నారు. ఇదిలాఉంటే వర్గపోరును ఒక కొలిక్కి తీసుకురావడానికే పార్టీ పెద్దలు ఉద్దేశ్యపూర్వకంగా అభ్యర్థిత్వ ప్రకటనపై జాప్యం చేస్తున్నారనే విశే్లషణ కూడా ఉంది. ఎన్నికల్లో విజయావకాశాలు చిగురించేలా ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో నిధులు భారీగా కుమ్మరించారు. ఒక్కసారిగా మంజూరవుతున్న నిధులకు సంబంధించిన పనులన్నీ నామినేటెడ్ పద్ధతిలోనే చేపట్టేలా అవకాశం కల్పించి కేడర్ పార్టీకి కట్టుబడి ఉండేలా నూతనోత్తేజం రగిలిస్తున్నారు. అలాగే పలువురు గ్రామస్థాయి నేతల్ని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పలు దఫాలుగా ఫోన్లు చేస్తూ అభ్యర్థి ఎవరైనా పార్టీ విజయానికి కృషి చేయాలంటూ సూచిస్తున్నారు.
కోవూరు కాంగ్రెస్‌లో ఇదీ సంగతి
english title:
iddaroo potaa poteegane
Date:
Tuesday, February 7, 2012