న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్నదని బిజెపి ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైపోవటానికి దారి తీసిన అంశాలపై ప్రధాని మన్మోహన్ సింగ్ నిజానిజాలను బైటపెట్టాలని డిమాండ్ చేసింది.
ఆర్థిక రంగంలో అత్యంత నిష్ణాతుడిగా గుర్తింపుపొందిన మన్మోహన్ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లోనూ తిరోగమన దిశలో పయనిస్తోందని బిజెపి అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూడీ ధ్వజమెత్తారు. పదకొండవ పంచవర్ష ప్రణాళికాంతానికి తొమ్మిది శాతం వృద్ధిరేటు సాధించి తీరుతామని ప్రధాని అనేక సార్లు ప్రకటించారని అన్నారు. ఈవిషయాన్ని ఆయన ప్రణాళిక ముసాయిదాలో కూడా స్పష్టం చేశారని రూడీ పేర్కొన్నారు. అయితే అనుకున్న లక్ష్యాన్ని సాధించటానికి తీసుకోవలసిన చర్యలను పకడ్బందీగా అమలు చేయడంలో విఫలం కావటంతో అభివృద్ధి గణనీయంగా పడిపోయిందని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ దిగజారిపోవటానికి కారకులెవరో నిగ్గుతేల్చాలని రూడీ డిమాండ్ చేశారు. వ్యవసాయం, పరిశ్రమలు, ప్రాథమిక సదుపాయాల కల్పన తదితర రంగాల్లో తిరోగమనం చోటు చేసుకోవటం దేశానికి శుభ సంకేతం కాదని ఆయన స్పష్టం చేశారు. 11వ పంచవర్ష ప్రణాళికాంతానికి సాధించాలనుకున్న లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైనప్పటికీ, 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో తొమ్మిది నుంచి పదిశాతం వరకూ వృద్ధిరేటు సాధించి తీరుతామని ప్రధాని చెప్పటం విడ్డూరంగా ఉందని ఆయన చెప్పారు. దేశ ఆర్థికాభివృద్ధి మరింత దిగజారకుండాప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కర్నాటక విధానసభలో కూర్చొని సెల్‌ఫోన్‌లో అసభ్యకరమైన దృశ్యాలు చూస్తూ కెమెరాకు దొరికిపోయిన తమ పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు స్వచ్ఛందంగానే రాజీనామాలు చేశారని బిజెపి అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూడీ చెప్పారు. చట్టసభలో ఈ విధమైన సంఘటన చోటు చేసుకోవటం దురదృష్టకరమని ఆయన చెప్పారు. ఈమొత్తం వ్యవహారంపై జరుగుతున్న విచారణ పూర్తి అయిన తరువాత వీరిపై తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఆయన చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అత్యంత సన్నిహితులైనందున వీరిపై చర్య తీసుకునే విషయంలో పార్టీ వెనుకంజ వేస్తుందన్న ఆరోపణలను తోసిపుచ్చారు.
దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతున్నదని బిజెపి ఆందోళన వ్యక్తం చేసింది.
english title:
pradaani
Date:
Thursday, February 9, 2012