న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: కర్నాటకలో ముగ్గురు బిజెపి మంత్రులు శాసన సభలో అశ్లీల చిత్రాలు వీక్షించిన సంఘటనపై తీవ్రంగా స్పందిస్తూ, ఆ పార్టీ నిజ స్వరూపం అదేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రషీద్ ఆల్వీ ధ్వజమెత్తారు. అయితే, బిజెపిని విమర్శలతో ముంచెత్తుతున్న అల్వీ ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా రాజ్‌భవన్‌లో నారాయణదత్ తివారీ అడిన రాసక్రీడల గురించి ప్రస్తావించిన మరుక్షణమే మాట మార్చారు. గవర్నర్‌గా పని చేసే వారు ఏ పార్టీకి చెందరంటూ కొత్త సిద్ధాంతాన్ని విలేఖరులకు వినిపించారు. రాజ్‌భవన్‌లో రాసక్రీడలాడిన తివారీ సేవలను ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఉపయోగించుకుంటున్నారనే ప్రశ్నకు కూడా ఆయన సమాధానం ఇవ్వలేకపోయారు. ముగ్గురు మంత్రులు అసెంబ్లీలో కూర్చొని, తమ సెల్ ఫోన్లలో అశ్లీల చిత్రాలు చూడటం అత్యంత అభ్యంతరకరమని అన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామమని ఆయన విమర్శించారు. రాజకీయ నాయకుల పరువుప్రతిష్ఠలు ఇప్పటికే బాగా దెబ్బతిన్నాయని వ్యాఖ్యానించారు. ముగ్గురు కర్నాటక మంత్రుల వైఖరితో ప్రజల దృష్టిలో నాయకుల ప్రతిష్ఠ మరింత దిగజారుతుందని ఆల్వీ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కరించవలసిన మంత్రులు ఇలా అశ్లీల చిత్రాలు కూడటం ఘోరమన్నారు. బిజెపి అవినీతికి మారుపేరుగా మారిందన్నారు. మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, రమేష్ పొక్రియాల్, సీనియర్ నాయకుడు జుదేవ్, మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ తదితరులు అవినీతికి నిదర్శనమైతే, ఈ ముగ్గురు కర్నాటక మంత్రులు బిజెపి అశ్లీలతకు ప్రతీకలని అల్వీ ఎద్దేవా చేశారు. అవినీతికి ప్రతిబింబంగా మారిన బిజెపి అశ్లీలంలో ఎందుకు వెనకబడాలనే ఆలోచనతోనే ముగ్గురు మంత్రులు అసెంబ్లీలో కూర్చోని సెల్ ఫోన్‌లో బూతు బొమ్మలు చూస్తూ కూర్చున్నట్లుందని ఆయన వ్యంగ్య బాణాలు విసిరారు. కాగా, కర్నాటక మంత్రుల వైఖరిని ఖండిస్తున్న మీరు ఆంధ్ర ప్రదేశ్ రాజ్‌భవన్‌లో రాసక్రీడలాడిన తివారీని ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఉపయోగించుకున్నారని ఒక విలేఖరి అడుగగా అది పార్టీ నిర్ణయం కాదని అన్నారు. తివారీనే స్వచ్ఛందంగా పార్టీకి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారంటూ ఆల్వీ డొంక తిరుగుడు సమాధానం ఇచ్చి తప్పించుకున్నారు.
మోపిదేవి విషయం
నాకు తెలియదు
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి మొపిదేవి వెంకటరమణ ఆబ్కారీ కాంట్రాక్టర్ల నుండి పది లక్షల రూపాయలు తీసుకున్న విషయం తనకు తెలియదని ఆల్వీ చెప్పారు. వివరాలు తెలియకుండా పార్టీ అభిప్రాయాన్ని వెల్లడించటం సాధ్యం కాదంటూ ఆయన తప్పించుకున్నారు.
కర్నాటక మంత్రుల తీరుపై అల్వీ ధ్వజం
english title:
nija swaroopam
Date:
Thursday, February 9, 2012