న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ మధ్య ఎలాంటి విభేదాలు లేవనీ, ఇరువురు నాయకులు కలిసి పని చేస్తూ, పార్టీని పటిష్టం చేసేందుకు సంయుక్తంగా కృషి చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పార్లమెంటు సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి వివరించారు. బుధవారం ఆయన సోనియా గాంధీని కలిసి రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు, ప్రభుత్వం పని తీరు గురించి వివరించారు. అనంతరం సుబ్బిరామిరెడ్డి తమ భేటీ వివరాలను పత్రికల వారికి వెల్లడించారు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నారని సోనియా గాంధీతో చెప్పానని సుబ్బిరామిరెడ్డి వివరించారు. ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షుడికి మధ్య విభేదాలు ఉన్నాట్లు పత్రికల్లో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం పని తీరు గురించి సోనియా గాంధీకి వివరించినప్పుడు ఆమె ప్రశంసించారని ఆయన తెలిపారు. విశాఖపట్టణాన్ని తాను హరిత నగరంగా మార్చివేశానన్నారు. విశాఖపట్నంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక సహాయంతో పట్టణంలో దాదాపు నలభై లక్షల మొక్కలను నాటించానని పేర్కొన్నారు. వంద సంవత్సరాల చరిత్రగల పాత కెజి ఆసుపత్రిని యాభై కోట్ల వ్యయంతో ఆధునీకరించామని అన్నారు. పబ్లిక్ రంగ సంస్థల సాయంతో ఇది సాధించినట్టు పేర్కొన్నారు.
సిఎం, బొత్స మధ్య విభేదాల్లేవని స్పష్టీకరణ
english title:
sonia
Date:
Thursday, February 9, 2012