న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: మాల్దీవులలో శాంతి, సుస్థిరతలను కాపాడడానికి జరిపే కృషిలో ఆ దేశానికి భారత దేశం సంపూర్ణ సహకారం గతంలో మాదిరిగానే కొనసాగుతుందని ఆ దేశ కొత్త అధ్యక్షుడు మహమ్మద్ వాహిద్‌కు ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. మాల్దీవులలో పెద్ద ఎత్తున చెలరేగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనల కారణంగా అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ పదవినుంచి తప్పుకోవడంతో మంగళవారం మాజీ ఉపాధ్యక్షుడు వాహిద్ కొత్త అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వాహిద్ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. వాహిద్ ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ప్రధాని ఆయనకు శుభాకాంక్షల సందేశం పంపిస్తూ, భారత్‌తో మాల్దీవులకున్న ప్రత్యేక, సన్నిహిత సంబంధాలు ఇకపై కూడా కొనసాగుతాయని హామీ ఇస్తూ, వీలయినంత త్వరలో మిమ్మల్ని కలుసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు.
బెదిరిస్తేనే తప్పుకొన్నా: నషీద్
తనను బెదిరిస్తేనే అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ స్పష్టం చేశారు. గత మూడు వారాలుగా చేలరేగుతున్న అశాంతి పరిస్థితులు మంగళవారం పోలీసు తిరుగుబాటుకు దారి తీసిన నేపథ్యంలో నషీద్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ స్థానంలో మహమ్మద్ వహీద్ హస్సన్ అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించారు. అయితే బుధవారం తన పార్టీ సమావేశం అనంతరం నషీద్ విలేఖరులతో మాట్లాడుతూ పదవీ నుంచి దిగిపోవాలని కొందరు తనను చుట్టుముట్టి తుపాకులు ఎక్కుపెట్టారని, ఆ సమయంలో తాను ఏమాత్రం సంశయించినా వారు కాల్చేందుకు సైతం వెనుకడుగు వేసేవారు కాదని తెలిపారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నారనే దానిపై తాను చీఫ్ జస్టిస్ వద్దకు వెళ్తానన్నారు. తిరిగి న్యాయబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. కాగా, ప్రపంచంలోని అత్యంత సుందర, ఖరీదైన పర్యటక ప్రాంతాల్లో ఒకటిగా మాల్దీవులు ప్రసిద్ధి.
మాల్దీవుల కొత్త అధ్యక్షుడికి ప్రధాని హామీ
english title:
ma sampoorna
Date:
Thursday, February 9, 2012