విజయనగరం, జనవరి 19: రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుంచి విజయనగరంలో ప్రారంభం కానున్నాయి. ఈనెల 27వ తేదీ వరకూ ఎనిమిది రోజుల పాటు ఈ వేడుకలను స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు కళాసంస్థలు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. వీటిలో మొత్తం 43 ప్రదర్శనలు ఏర్పాటు చేయగా వీటిలో 10 పద్య నాటకాలు, తొమ్మిది సాంఘిక నాటకాలు, 12 సాంఘిక నాటికలు, మరో 12 బాలల సాంఘిక నాటికలు ప్రదర్శించనున్నారు. పద్యనాటకాలకు జ్యూరీ సభ్యులుగా ఎ.నారాయణ, బి.నాగిరెడ్డి, మంత్‌జా సాల్వాచారి వ్యవహరిస్తారు. అలాగే సాంఘిక నాటకాలకు జ్యూరీ సభ్యులుగా జి.సుబ్బరామిరెడ్డి, వి.వేణుగోపాల్, కె.విజయలక్ష్మి, సాఘిక నాటికలకు జాన శివయ్య, యు.బుడ్డయ్య చౌదరి, సుదర్శన్, బాలల నాటికలకు ఎం.ఎ.ఖాదర్‌ఖాన్, కె.తిరుమలమ్మ, దాసరి వెంకటరమణ జ్యూరీ సభ్యులుగా వ్యవహరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1100 మంది కళాకారులు ఈ వేడుకల్లో ప్రదర్శనలు ఇచ్చేందుకు రానున్నారు. వీరికోసం క్షత్రియ కల్యాణ మండపంలో వసతి, భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఈనెల 20న ప్రారంభ వేడుకలను ఆనందగజపతి ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. నాటకోత్సవాలను జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభిస్తారు. సభాధ్యక్షులుగా సమాచార, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి డి.కె.అరుణ, ముఖ్యఅతిథులుగా కేంద్ర మంత్రులు వి.కిషోర్‌చంద్ర దేవ్, డి.పురంధ్రీశ్వరి, విశిష్ట అతిథులుగా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పిపిపే విశ్వరూప్ పాల్గొంటారు. వేడుకల కోసం ఆనందగజపతి ఆడిటోరియాన్ని సుమారు 25 లక్షల రూపాయలు వెచ్చింది ఆధునీకరించారు. ఇక్కడే రంగస్థల సంస్థలు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. 27వ తేదీన ముగింపు ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించాలని జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ భావిస్తున్నారు. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి చిరంజీవితో పాటు గవర్నర్, ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని ఏర్పాట్లు చేస్తున్నారు.
పరువు తీసిందని గొంతు కోశాడు
నాగలాపురం, జనవరి 19: దళితుడిని ప్రేమించి ఇంటి నుండి పారిపోయి తమ పరువు తీసిందని ఆవేశంతో అమ్మాయిని మేనమామ కత్తితో గొంతు కోసాడు. ఈ సంఘటన ఆంధ్ర సరిహద్దు తమిళనాడు ఊతుకోట కోర్టు ఆవరణలో శనివారం మధ్యాహ్నం జరిగింది. గుమ్మడిపూడి తాలుకా అయ్యానల్లూరుకి చెందిన ప్రవీణ్(25) దళితుడు. పొనే్నరు తాలుకా నటరాజన్ కుమార్తె నందిని(22) మొదలియార్ కులానికి చెందినది. వీరు ఇరువురు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకొంటున్నారు. వీరు ఇరువురు ఈనెల 17వ తేదీ ఇంటి నుండి పారిపోయారు. వీరికోసం తల్లిదండ్రులు, బంధువులు వెతికినా కనిపించలేదు. బంధువులు పొనే్నరు పోలీసులుకు ఫిర్యాదుచేశారు. దీంతో ఇరుకుటుంబ సభ్యులు ప్రవీణ్, నందినికోసం వెతుకుతుండగా అతని స్నేహితులు శనివారం ఊతుకోట కోర్టు ఆవరణలో తెలిసిన న్యాయవాదుల సహకారంతో ఇరుకుటుంబాల తల్లిదండ్రులు, బంధువులను రప్పించి రాజీప్రయత్నం చేశారు. అమ్మాయి తల్లి వలర్‌మతి కుమార్తెను ఇంటికి రావాలని కోరినా నందిని నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన నందిని మేనమామ రవి తమను అవమానపర్చావంటూ తన చేతిలో ఉన్న చిన్న కత్తితో నందిని గొంతుకోశాడు. నందిని కోర్టు ఆవరణలోనే కుప్పకూలింది. సమాచారం తెలుసుకొన్న ఊతుకోట సిఐ పురుషోత్తం, ఎస్సై నరేష్ వెంటనే నందిని ఆసుపత్రికి తరలించారు. రవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.