విశాఖపట్నం/కాకినాడ, జనవరి 19: కోస్తాలో తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో చిక్కుకుంది. ఇద్దరు సీనియర్ నేతలు పార్టీ అధినేతపై ధిక్కార స్వరం వినిపించారు. విశాఖ జిల్లాలో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏకంగా రాజీనామా చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్‌నేత, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావూ పార్టీ నుంచి వైదొలుగుతానని సంచలన ప్రకటన చేశారు. అధిష్ఠానం ఏకపక్ష నిర్ణయానికి నిరసనగా పార్టీ పొలిట్‌బ్యూరో పదవికి, పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు అయ్యన్న శనివారం ప్రకటించారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని అయ్యన్న స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ, కేవలం జెండా మోసే సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. మరికొందరు సీనియర్లు రాజీనామా చేయడంతో పార్టీ ఈ జిల్లాలో ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది. జిల్లా తెలుగుదేశం పార్టీని, అర్బన్, రూరల్ జిల్లాలుగా విభజిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అర్బన్‌కు అయ్యన్నపాత్రుడిని అధ్యక్షునిగా ఉండమన్నారు. తాను జిల్లా అంతా ఒకే కమిటీగా ఉంటే, దానికి అధ్యక్షునిగా ఉంటానని, లేకుంటే ఉండనని చంద్రబాబుకు స్పష్టం చేశారు. అయితే, పార్టీ నిర్ణయం మేరకు రెండు కమిటీలను ఏర్పాటు చేసి, అర్బన్ జిల్లా అధ్యక్షునిగా విశాఖ దక్షిణ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ వాసుపల్లి గణేష్‌కుమార్‌ను అధ్యక్షునిగా నియమించింది. రూరల్ జిల్లాకు దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్‌ను నియమించింది. అప్పటి వరకూ టిడిపి నగర అధ్యక్షునిగా ఉన్న పీలా శ్రీనివాసరావును రాష్ట్ర పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు.
అయ్యన్నపాత్రుడిని పాలిట్‌బ్యూరో సభ్యునిగా నియమించారు. ఈ నిర్ణయం అయ్యన్నపాత్రుడు, అతని వర్గీయులెవ్వరికీ ఇష్టపడలేదు. అప్పటి నుంచే వీరంతా అసంతృప్తితో ఉన్నారు. సమయం చూసి చంద్రబాబుని కలవాలని నిర్ణయించుకున్నారు. ఈలోగా శుక్రవారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను నగరంలో నిర్వహించారు. గురువారమే పీలా శ్రీనివాసరావు నేతృత్వంలో టిడిపి కార్యకర్తలు సమావేశమై పెందుర్తిలో జరిగే ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు బండారు సత్యనారాయణ మూర్తిని హాజరుకాకుండా చేయాలని నిర్ణయించారు. ఇది తెలిసినప్పటికీ బండారు పెందుర్తిలో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. పీలా శ్రీనివాసరావు వచ్చేంత వరకూ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించవద్దని పార్టీ కార్యకర్తలు చెబుతున్నా బండారు వినకుండా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. దీంతో కార్యకర్తలు రెచ్చిపోయారు. బండారు, పీలా వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ వ్యవహారం పార్టీ అధిష్ఠాన వరకూ వెళ్ళింది. దీంతో పీలా శ్రీనివాసరావును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధిష్ఠానం శనివారం నిర్ణయం తీసుకుంది. పీలాకు ముందస్తు నోటీసులు జారీ చేయకుండా, అసలేం జరిగిందో స్థానిక నాయకుల నుంచి తెలుసుకోకుండా పీలా శ్రీనును సస్పెండ్ చేయడం పట్ల అయ్యన్నపాత్రుడు, అతని అనుచురులు, పార్టీలోని సీనియర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీలాపై చర్యను నిరసిస్తూ అయ్యన్నపాత్రుడు రాజీనామా చేశారు.
మరోపక్క తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు అధినేత చంద్రబాబుపై ధిక్కార స్వరం వినిపించారు. చంద్రబాబు తక్షణం సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ పార్టీకి, పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు స్వయంగా ప్రకటించారు. కాకినాడలో శనివారం విలేఖరులతో బొడ్డు మాట్లాడుతూ చంద్రబాబు లేఖ ఫలితంగానే కేంద్రానికి రాష్ట్ర విభజన యోచన వచ్చిందని భావించాల్సి వస్తోందన్నారు. సమైక్యాంధ్ర సాధన సంఘాలతో కలసి పోరాటం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. చంద్రబాబు వైఖరి సక్రమంగా లేదంటూ బొడ్డు ధ్వజమెత్తారు. పార్టీలో కీలకనేతగా ఉన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఇటు రాష్ట్రానికి అటు కేంద్రానికి మధ్య పోస్ట్‌మేన్‌గా వ్యవహరించారంటూ ఆయన విమర్శించారు. సమైక్యాంధ్రే కావాలంటూ తాము చేసిన తీర్మానంతో కూడిన లేఖను యనమల ఢిల్లీ వెళ్ళి కేంద్రానికి సమర్పించుకుని, చేతులు దులుపుకున్నారని చెప్పారు.
...........................
పత్రికా ఫొటోగ్రాఫర్‌పై దాడి కేసులో
దెందులూరు ఎమ్మెల్యే అరెస్టు
పెదవేగి, జనవరి 19 : పత్రికా ఫోటోగ్రాఫర్‌పై దాడి చేసిన అభియోగంపై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆయన్ని కోర్టులో హాజరుపర్చగా ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. పెదవేగి ఎస్సై బి మోహనరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.... సంక్రాంతిని పురస్కరించుకుని పెదవేగి మండలం కొప్పాకలో కోడిపందాలు జరుగుతుండగా ఎమ్మెల్యే చింతమనేని అక్కడ ఉన్న సందర్భంలో ఒక పత్రికా ఫోటోగ్రాఫర్, రిపోర్టర్‌తోపాటు అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో ఫోటోలు తీసేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే చింతమనేని దీనికి అభ్యంతరం తెలిపారు. అంతేకాకుండా దుర్భాషలాడుతూ ఫోటోగ్రాఫర్ సత్యనారాయణపై దాడికి దిగారని అభియోగం. అయనతోపాటు మరికొందరు కూడా తనపై దాడి చేసి గాయపర్చారని సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెదవేగి పోలీసులు ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 341, 323, 324, 92 కింద కేసు నమోదు అయింది. శనివారం మధ్యాహ్నం చింతమనేని ప్రభాకర్‌ను కలపర్రు చెక్‌పోస్టు వద్ద అరెస్టు చేశారు. అనంతరం ఆయనను ఏలూరులోని స్పెషల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ (ఎక్సైజ్) ఎన్ జేసురత్నకుమార్ ఎదుట హాజరుపర్చారు. ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై ఎమ్మెల్యే చింతమనేనికి న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. కేసు విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేశారు.
అదే బాటలో ఎమ్మెల్సీ బొడ్డు
english title:
a
Date:
Sunday, January 20, 2013