హైదరాబాద్, జనవరి 20: వచ్చే ఏడాది లోక్‌సభకు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని, బిజెపి తరఫున అభ్యర్ధి ప్రధాన మంత్రి పదవీ బాధ్యతలు చేపట్టడం తథ్యమని, వారసత్వ రాజకీయాలకు కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు పరాభవం ఎదురవుతుందని బిజెపి జాతీయ కార్యదర్శి డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్‌లో రాజకీయ పరివర్తన ముసుగులో వారసత్వ రాజకీయాలపై చర్చ సాగిందని ఆదివారం విలేఖరుల సమావేశంలో ధ్వజమెత్తారు. కీలకమైన ఈ సమావేశాల్లో జాతిని పీడించే సమస్యలతో పాటు, ప్రజాందోళనలతో దద్దరిల్లుతున్న తెలంగాణ అంశంపై ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవని ఆయన అన్నారు. దేశంలో పారిశ్రామిక, ఆర్ధిక, వ్యవసాయ అభివృద్ధిరేటు తగ్గిందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పోల్చితే బిజెపి పాలిత రాష్ట్రాల్లో వృద్ధిరేటు ఎక్కువగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా బీటలు వారిన కూటమి యుపిఏ అని, దీనికి మరమ్మత్తులు చేసినా బాగుపడదన్నారు. నిత్యావసరవస్తువుల నియంత్రణ, గ్యాస్ ధరలు తదితర అంశాలపై చర్చ లేదన్నారు. ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కొత్త ఎత్తుగడలే తప్ప, ప్రజా సంక్షేమం ఏ మాత్రం కాంగ్రెస్ పార్టీకి పట్టదని చింతన్ బైఠక్ నిరూపించిందన్నారు. యుపిఏ ప్రభుత్వం కళంకిత మంత్రుల గురించి చర్చించలేదన్నారు. అవినీతిని నిర్మూలించాలని చేసిన ప్రకటనల వల్ల ప్రయోజనం లేదన్నారు. 9 సంవత్సరాల యుపిఏ పాలనలో దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం పెచ్చుమీరాయన్నారు. దేశంలో 35 శాతం వరకు ఉన్న 25 సంవత్సరాల లోపు యువత భవితపై ఎక్కడా సమర్ధమైన రీతిలో చర్చ జరగలేదన్నారు. ఎంతసేపు రాహుల్ గాంధీని ఏదో విధంగా ప్రధానమంత్రిని చేయాలన్న తపన తప్ప ఇంకేమీ కనపడలేదన్నారు. రాహుల్ గాంధీని రెండో స్ధానంలో లేదా మొదటి స్ధానంలో పార్టీలో నిలబెట్టినా, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదన్నారు. కాంగ్రెస్‌లో పార్టీ నాయకత్వంలో జరుగుతున్న మార్పుల ప్రభావం దేశంపైన ఉండవని, ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.
వారసత్వ రాజకీయాలకు రాహుల్ ప్రతినిధి జాతీయ కార్యదర్శి లక్ష్మణ్
english title:
l
Date:
Monday, January 21, 2013