చైల్డ్ సైకాలజీ గురించి చదివినంత మాత్రాన శిశువు ప్రవర్తన గురించిన అవగాహన కలుగుతుందనుకోవటం భ్రమ మాత్రమే. దుడ్డుకర్ర అనగానే బుర్రబద్దలయిపోదు కదా! సామాన్యంగా శిశువులందరి ప్రవృత్తులు కొన్ని మాత్రమే ఒకే విధంగా ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ .. ప్రభుత్వ పాఠశాలల్ని గురించి వాటి వసతి గురించి కొత్తగా చెప్పుకోనవసరం లేదు. పలకలు తుడుచుకోటానికి నీళ్ళుండవు. పేద, ధనిక, అక్షరాస్యులు నిరక్షరాస్యులన్న తేడాలేం లేకుండా అందరు పిల్లలు బారెడు ఎంగిలి పలక మీద ఉమ్మి తుడుస్తారు. శుచి శుభ్రత తెలిసిన అయ్యవారికి లేదా అయ్యవారమ్మకు పట్టరాని కోపం వచ్చి చెంపలు వాయగొడ్తారు. ఎందుకు కొట్టారన్నది ఆ పిల్లలకు తెలియదు. మరి అదే పిల్లలు గట్టాలు (జీళ్ళు) ఒకరొకరు పంచుకోవలసి వస్తే పావడా కిందనో చొక్కా కిందనో పెట్టి కొరికి పంచుతారు. ఇక్కడ ఎంగిలి మంచిది కాదన్న సంగతి పిల్లలకు తెలిసినట్లే కదా! మరి పలకమీద ఉమ్మటం తప్పని ఎందుకు తెలియదు? తప్పని తెలిసినా అవసరం గనుక చేసున్నారు. ‘్ధర్మసింధు’లోని శాస్త్రాల్ని మన కనుకూలంగా ఎలా మలచుకుంటున్నామో వారూ అదే పని చేశారు. పిల్లల ప్రతి చర్యను అతిక్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప చైల్డ్ సైకాలజీ తెలియదు. శిక్షణా కాలంలోని సైకాలజీ చదవడం మార్కులు తెచ్చుకోవటానికే పరిమితం. నగర, పట్టణవాసుల పిల్లల్ని గురించి కాక పొట్టకు బట్టకు కూడా మొగం వాచిన పిల్లలను పరిశీలించండి. ఆ పిల్లల్ని బలపమివ్వమని అడగండి కచ్చితంగా నోట్లో నుంచే తీసి యిస్తారు. నోట్లో పెట్టుకుంటే నేను తంతానని టీచరమ్మ అంటే, పోగొట్టుకుంటే వాళ్ళమ్మ తంతుంది. అందుకని గోడ కన్నాలలో చెట్టు తొర్రల్లో దాచుకుందామని పథకం వేసుకుంటూ ముందుకు పోతున్నారు ఇద్దరు బుడుగులు. జాగ్రత్తకోసం నోట్లో దాచుకుంటున్నారన్న సంగతి వారిని నిశితంగా గమనించబట్టి అర్థమైంది.
చైల్డ్ సైకాలజీ అంటే పుస్తకం బట్టీపట్టటం కాదు. అనుక్షణం వారి చర్యలను గమనించి వారి ప్రవర్తనకు గల కారణాన్ని కనుగొనటమే. నానా గడ్డి కరచి అష్టకష్టాలు పడి ప్రభుత్వ కొలువులో కాలుపెడితే ఉద్యోగ విరమణ దాకా పాటు లేకుండా సాపాటు దొరకటం ఒక కారణమైతే, మరో కారణం ఉద్యోగ భద్రత మాత్రమేకాక వైద్య సదుపాయం, గృహ నిర్మాణానికి అవసరమైన సొమ్ము అప్పుగా లభించటం, విరమణానంతరం పెద్ద మొత్తంలో లభ్యమయ్యే ధనం వంటి అనేకానేక సౌకర్యాలున్నాయి. ఆఖరుకు అంత్యేష్టికి కూడా ప్రభుత్వమే సొమ్ము సమకూర్చుతుంది. పదవిలో ఉండగానే ఆయువు తీరితే మరొకరికి ఉద్యోగమూ దొరుకుతుందన్న భరోసా ఉంది. ఒక్క చదువు తప్ప ప్రభుత్వపు అదనపు పనులన్నీ సమర్థవంతంగా నిర్వహిస్తే చాలు. మంచి టీచరన్న పేరు వస్తుంది. ప్రభుత్వ కొలువు సులువుగా దొరకకపోయినా దొరికిన తర్వాత సజావుగా సాగిపోతుంది. భద్రత వలన కొందరు బాధ్యతలను విస్మరిస్తున్నారు.
సర్కారు బడి చదువు మొక్కుబడి చదువు అయితే ప్రైవేటు బడి చదువులు రుబ్బుడు చదువులు. అటు పిల్లలు ఇటు టీచర్లు కూడా నలిగి పిండి అయ్యేదాకా రుబ్బి తీరాల్సిందే. మరి అంతరుబ్బినాక పిండి తయారవదా? మరో చిన్న సవరణ.. ప్రైవేటు స్కూళ్ళలో పి.జి. స్థాయి వాళ్ళు కూడా ఐదు, పదివేల జీతానికే పనిచేసేవారు చాలామంది ఉన్నారు. చదువు రాకపోయినా, దండించినా అటు తల్లిదండ్రులు ఇటు ప్రిన్సిపాలు మధ్య నలిగిపోయే అయ్యవార్లు ఎందరో ఉన్నారు. జీతం రాళ్ళకు తల తాకట్టుపెట్టిన ఆ అయ్యవార్లు గంధం చెక్కల్లే అరిపోతూ ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని భద్రత వలన ఏర్పడ్డ బాధ్యతా రాహిత్యం (అందరూ కాదని మనవి) వలన ఆ పిల్లలకు చదువు రావటం లేదని చెప్పటం బాధాకరమైనా, సత్యమంగీకరించక తప్పదు. చెప్పాలన్న చిత్తశుద్ధి లేకపోవటంవలననే అక్కడ చదువులు రావడంలేదు.
చైల్డ్ సైకాలజీ గురించి చదివినంత మాత్రాన శిశువు
english title:
b
Date:
Monday, January 21, 2013