హైదరాబాద్, చాంద్రాయణగుట్ట, జనవరి 21: మజ్లిస్ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి సంగారెడ్డి కోర్టు రిమాండ్ విధించిందన్న విషయం తెలవటంతో పాతబస్తీలో నెలకొన్న పరిస్థితులపై ఆ పార్టీ ఎమ్మెల్యే పాషాఖాద్రి స్పందించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసద్ అరెస్టు నేపథ్యంలో మంగళవారం తాము ఎలాంటి బంద్‌కు పిలుపునివ్వటం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్ పాటిస్తే తమకేమీ అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. అసద్‌పై ఎనిమిదేళ్ల క్రితం 2005 ఏప్రిల్ 16న రుద్రారం సమీపంలోని ముత్తంగి ప్రాంతంలో జాతీయ రహదారిపై స్థల సేకరణ విషయంలో అధికారులతో అసదుద్దీన్ వాగ్వాదానికి దిగిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఆ సంఘటనకు సంబంధించి అదే రోజు నమోదైన కేసును వాపసు తీసుకోవాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అదే నెల 24వ తేదీన అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అపుడే రాజీ కుదిరినప్పటికీ ప్రస్తుతం కాంగ్రెస్‌కు తాము మద్దతును ఉపసంహరించుకున్నందున కాంగ్రెస్ పార్టీ తమపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఖాద్రి ఆరోపించారు.
* మజ్లిస్ ఎమ్మెల్యే పాషాఖాద్రీ స్పష్టీకరణ
english title:
m
Date:
Tuesday, January 22, 2013