హైదరాబాద్, జనవరి 21: వరుసగా ప్రజాప్రతినిధుల అరెస్టులతో మజ్లిస్ పార్టీకే గాక, ఆ ప్రభావం కారణంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి కూడా గడ్డుకాలంతో గడుపుతోంది. మంచిరోజులు లేనట్టున్నాయి. మేయర్ పదవీని మజ్లిస్ చేపట్టిన తర్వాత కేవలం రెండుసార్లు మాత్రమే సమావేశమైన కౌన్సిల్ సమావేశాన్ని ఎనిమిది నెలల నుంచి నిర్వహించకపోవటంతో ఇప్పటికే విపక్షాలు భగ్గుమన్న సంగతి తెల్సిందే. గత సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ మాసాల్లో వరుసగా మూడుసార్లు వాయిదాపడ్డ కౌన్సిల్ సమావేశాన్ని వచ్చే నెల 2,6వ తేదీల్లో వేర్వేరుగా నిర్వహించనున్నట్టు కొద్దిరోజుల క్రితం మేయర్ ప్రకటించినా, ఈ సమావేశాల నిర్వహణపై నీలినీడలు నెలకొన్నాయి. మజ్లిస్ పార్టీలో అంతర్గతంగా నెలకొన్న రాజకీయ పరిణామాలు నేపథ్యంలో 2న సర్వసభ్య సమావేశం, ఆరోతేదీన బడ్జెట్‌పై ప్రత్యేక సమావేశాన్ని మేయర్ నిర్వహిస్తారా? లేక మళ్లీ వాయిదా వేస్తారా? అన్న విషయం ప్రస్తుతం గ్రేటర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. మజ్లిస్ శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద ప్రసంగాలు చేసి ఇప్పటికే ఆదిలాబాద్ జైల్‌లో ఉన్న సంగతి తెల్సిందే. ఈక్రమంలో ఓ పాత కేసులో మజ్లిస్ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ కోర్టులో లొంగిపోవటంతో కోర్టు ఆయనకు రిమాండ్ విధించటంతో మజ్లిస్ పార్టేయే గాక, మొత్తం నగరం ఉలిక్కిపడింది. అయితే అసదుద్దీన్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా? ఒక వేళ బెయిల్ మంజూరు చేస్తే నగరంలో ప్రస్తుతం శాంతిభద్రతల పరంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో కౌన్సిల్ నిర్వహించేందుకు ఆయన అంగీకరిస్తారా? అన్న చర్చ జరుగుతోంది.
మరోవైపేమో వచ్చేనెల 2,6 తేదీల్లో కౌన్సిల్ నిర్వహించని పక్షంలో మేయర్‌యేతర కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని అధికార, విపక్షాలు భీష్మించుకున్నాయి. వారు కోరిన విధంగా ఒక వేళ సర్కారు మేయర్ యేతర కౌన్సిల్‌కు ఆమోదం తెలిపితే, మేయర్ పదవికి ముప్పు ఏర్పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. నిర్వహించకపోతే పదవికి ముప్పు, నిర్వహిస్తే అధిష్టానం నుంచి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని మేయర్ భావిస్తున్నారు.
అటు మజ్లిస్ ప్రజాప్రతినిధులు అరెస్టులు, ఇటు ఎనిమిది నెలలుగా కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోవటం వంటి అంశాల మధ్య మేయర్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిందనే చెప్పవచ్చు.
పేదల జీవితాలతో కాంగ్రెస్ నేతల చెలగాటం
తార్నాక, జనవరి 21: ఉద్యోగ్ దళిత బహుజన ఫ్లాట్స్ ఓనర్స్ సొసైటీ ఆధ్వర్యంలో చేస్తున్న న్యాయ పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ప్రకటించి వారి తరఫున పోరాటం చేస్తామని నగర టిడిపి అధికార ప్రతినిధి సి. బద్రీనాధ్‌యాదవ్ పేర్కొన్నారు. కాప్రా మున్సిపల్ సర్కిల్ పరిధిలోని వంపుగూడా ప్రాంతంలో విశ్రాంతి ఉద్యోగ్ దళిత బహుజనులకు 300 మందికి 62 ఎకరాల భూమిని కాంగ్రెస్ నాయకుడు కబ్జాచేసి వారిని దిక్కులేని వారిని చేశారని బద్రీనాథ్ అన్నారు. కాగా వారు తమకు న్యాయం కావాలని కోరుతూ చేస్తున్న ఆందోళనలకు తెలుగుదేశం పార్టీ తరపున బద్రీనాథ్ హాజరయి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న చిన్న ఉద్యోగులు తమ జీవితమంతా కూడబెట్టుకుని నివాసం ఉండడానికి స్థలాలను కొనుగోలు చేస్తే కాంగ్రెస్ నేతలు అలాంటి స్థలాలను సైతం కబ్జాలు చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులపాలు చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇలాంటి వారికి అండగా ఉంటుందన్నారు.