ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, జనవరి 21: మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీని మెదక్ జిల్లాలోని సంగారెడ్డి కోర్టు రిమాండ్‌కు తరలించటంతో మరోసారి పాతబస్తీ ఉలిక్కిపడింది. ఇప్పటికే ఆయన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారన్న అభియోగంపై పోలీసులు ఆదిలాబాద్ జైలుకు తరలించిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా పాతబస్తీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. అంతేగాక, ఈనెల 28,29 తేదీల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ఓ ప్రకటన చేసే అవకాశం కూడా ఉండటంతో పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి భారీగా కేంద్రబలగాలు మోహరించాయి. ఎనిమిదేళ్ల క్రితం రోడ్డు విస్తరణ పనికి సంబంధించి కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారులను దూషించిన కేసులో సంగారెడ్డి కోర్టులో హాజరైన అసదుద్దీన్ ఓవైసీకి కోర్టు రిమాండ్ విధించిందన్న సమాచారం తెలవటంతో పాతబస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా మజ్లిస్ కార్యకర్తలు సంగారెడ్డికి పయనమయ్యారు. అయితే వీరిలో కొందర్నీ మార్గమధ్యంలోనే పోలీసులు అరెస్టు చేయగా, మరికొందర్ని సంగారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెల్సింది. అసద్‌ను రిమాండ్‌కు తరలించారన్న సమాచారం తెలవటంతో పాతబస్తీలోని చార్మినార్, శాలిబండ, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, మదీనా, హుస్సేనీ ఆలం, తలాబ్‌చంచలం, బార్కాస్ తదితర ప్రాంతాలతో పాటు న్యూ సిటీలోని బంజారాహిల్స్, పంజాగుట్ట, ముషీరాబాద్, కార్వాన్, ఫస్ట్‌లాన్సర్ తదితర ప్రాంతాల్లో మజ్లిస్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బలవంతంగా దుకాణాలను మూసివేయించారు. అంబర్‌పేటలో ఓ షాపుపై, రెండు ఆర్టీసీ బస్సులపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి అల్లరిమూకలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తల ఆందోళన కవరేజీకి వచ్చిన మూడు పత్రికలకు చెందిన ఫొటోగ్రాఫర్లను తొలుత బెదిరించిన మజ్లిస్ కార్యకర్తలు ఆ తర్వాత దాడి చేయటంతో ఓ ఫొటోకెమెరా ధ్వంసమైంది. దీంతో రమేష్ అనే వ్యక్తి చార్మినార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను కూడా మజ్లిస్ కార్యకర్తలు మూసివేయించటంతో మధ్యాహ్నం మూడు గంటల తర్వాత సిబ్బంది ఇంటికెళ్లిపోయారు. పలుచోట్ల సర్కారు దిష్టిబొమ్మలను దగ్ధం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మదీనావద్ద బలవంతంగా దుకాణాలు మూసివేయిస్తున్న అయిదుగురు కార్యకర్తలను చార్మినార్ పోలీసులు, అలాగే లాడ్‌బజార్‌లో ఆందోళన చేపట్టిన ముగ్గురు మజ్లిస్ కార్యకర్తలను హుస్సేనీ ఆలం పోలీసులు అరెస్టు చేసినట్టు తెల్సింది. అంతేగాక, పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో రాకపోకలు సాగిస్తున్న ఆర్టీసీ బస్సుల అద్దాలను కూడా ధ్వంసం చేసినట్లు తెల్సింది. మెహిదీపట్నం డిపోకు చెందిన 6, ఫలక్‌నుమాకు చెందిన 2, రాజేంద్రనగర్‌కు చెందిన 2, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన 3, ఉప్పల్ డిపోకు చెందిన 1, మిధానీ డిపోకు చెందిన మరో రెండు బస్సుల అద్దాలను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చార్మినార్ మీదుగా ఫలక్‌నుమా, బార్కాస్ వరకు బస్సులను నడిపిన ఆర్టీసి మధ్యాహ్నం తర్వాత నుంచి బస్సులను కేవలం అఫ్జల్‌గంజ్ వరకే పరిమితం చేసింది. అయితే ఆందోళన చేపట్టిన పలువురు మజ్లిస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో ఇరువర్గాల మధ్య తరుచూ పరస్పరదాడులు జరిగిన ఆస్రా హాస్పిటల్, పిస్తాహౌజ్, ఖిల్వత్ రోడ్డు, శాలిబండ, లాడ్‌బజార్, చౌక్ వంటి ప్రాంతాల్లో ఎలాంటి బందోబస్తును ఏర్పాటు చేయకపోవటంతో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు.
ఎంపి అసదుద్దీన్ అరెస్టు నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం చార్మినార్ వద్ద మజ్లిస్ కార్యకర్తలు చేపట్టిన ఆందోళన కారణంగా దాదాపు గంట సేపు చార్మినార్ సందర్శనను అధికారులు నిలిపివేశారు. ఒకటిన్నర గంటల నుంచి దాదాపు రెండున్నర గంటల వరకు నిల్చిపోయిన సందర్శన ఆ తర్వాత యధావిధిగా కొనసాగింది.
* ఎంపి అసదుద్దీన్ రిమాండ్‌తో పాతబస్తీలో టెన్షన్ * పలుచోట్ల మజ్లిస్ కార్యకర్తల ఆందోళన * 15 ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం * భారీగా మోహరించిన అదనపు బలగాలు * మీడియాపై దాడి, ఎనిమిది మంది అరెస్టు
english title:
m
Date:
Tuesday, January 22, 2013