వికారాబాద్, జనవరి 21: వికారాబాద్ ఏరియా ఆసుపత్రిని 27 లక్షల రూపాయలతో అభివృద్ధి పర్చామని రాష్ట్ర చేనేత, జౌళి, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంత్రి నవజాత శిశువుఇంటెన్సివ్ కేర్, ఆరోగ్యశ్రీ వార్డులను ప్రారంభించి, ప్రసూతిగదిలోని పరికరాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఐదు లక్షల రూపాయలతో ఆసుపత్రిని ఆధునీకరించగా, 22 లక్షల రూపాయలతో ఆసుపత్రిలో అవసరమైన పరికరాలను ఏర్పాటు చేశామన్నారు. గత నాలుగేళ్ళుగా ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ఆ అభివృద్ధిలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల కృషి ఎంతో ఉందన్నారు. కలెక్టర్ వాణీప్రసాద్ విద్య, ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టిపెట్టారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు 50 పడకల ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రిగా త్వరలో రూపుదిద్దుకోనుందన్నారు. ఆసుపత్రిలో సిబ్బంది తక్కువగా ఉన్నందున అనంతగిరి టిబి శానిటోరియం నుండి సిబ్బందిని డిప్యుటేషన్‌పై తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించిన కేసుల చికిత్సలు ఇక్కడ జరిగే విధంగా ఏర్పాటు జరిగాయన్నారు. ఆసుపత్రి నిర్వహణకు అత్యవసర పరిస్థితుల్లో ఖర్చు చేసేందుకు ప్రతి ఏడాది లక్ష రూపాయలను ఎసిడిపి నిధుల నుండి ఆసుపత్రికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాణీప్రసాద్ మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి మంత్రి ప్రసాద్‌కుమార్ 20 లక్షల రూపాయల నిధులను కేటాయించారని తెలిపారు. రెండు హాళ్ళ నిర్మాణానికి 10 లక్షల రూపాయల జిల్లా పరిషత్ నిధులను కేటాయించనున్నట్టు చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం నుండి 20 లక్షలు అవసరమైతే శాఖతో మాట్లాడి మరిన్ని నిధులను సమకూరుస్తామన్నారు. ఎవరు ముందుకు వచ్చినా డాక్టర్ల ఖాళీలను భర్తీచేస్తామన్నారు. స్పెషలిస్టులు అవసరమున్నారన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి మంత్రి సహకారంతో జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజశేఖర్ కృషి ఎంతగానో ఉందన్నారు. అంతకుముందు ఆరోగ్యశ్రీ గదిని ప్రారంభించిన ఆమె విశ్రాంత సూపరిండెంట్ అనంత్‌రెడ్డిని మరిన్ని సేవలు అందించాలని అభినందించారు.
కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, డిసిహెచ్ హన్మంత్‌రావు, వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, వికారాబాద్, మర్పల్లి మార్కెట్ కమిటీల చైర్మన్‌లు ఎల్.శశాంక్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, ఎస్‌పిహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, పిసిసి ఎస్సీ సెల్ ప్రధానకార్యదర్శి రాఘవన్‌నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు సి.అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.
కృష్ణాజలాలు అందించడంలో ప్రభుత్వం విఫలం
మహేశ్వరం, జనవరి 21: నియోజకవర్గంలో కృష్ణా జలాలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ పార్టీ రాష్ట్ర నేత, నియోజకవర్గం ఇన్‌చార్జి దేప భాస్కర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఇక్కడ తాగునీటి కోసం కృష్ణా జలాలు ఇవ్వాలని భాస్కరరెడ్డి నాయకత్వంలో దీక్ష నిర్వహించారు. జిల్లా కన్వీనర్ జనార్ధన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు తాగునీటికోసం ఆందోళనలు చేస్తున్నారని, మండలంలోని 121 గ్రామాలకు కృష్ణా జలాలు అందిస్తామని శిలాఫలకాలు వేసి రెండేళ్లయినా పనులు జరగడంలేదని అన్నారు. గ్రామాల్లో ఫ్లోరైడ్ నీళ్లు తాగి ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని, ఇద్దరు మంత్రులు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నా తాగునీరు అందించలేదని అన్నారు. 2009 ఎన్నికల్లో మూడు నెలల్లో కృష్ణా నీరు అందిస్తామని హామీ ఇచ్చారని ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పటికైనా సత్వరమే చర్యలు చేపట్టి నీరందించాలని డిమాండ్ చేసారు. కార్పొరేటర్ సురేఖారెడ్డి మాట్లాడుతూ, మన ఎం.పి ఎన్నికలప్పుడు కనిపించాడని, నేటివరకు సమస్యలు పట్టించుకోలేదని అన్నారు. జగన్ జైలునుంచి నిర్దోషిగా విడుదలై ముఖ్యమంత్రి అవుతాడని ఆమె అన్నారు. కార్యక్రమంలో నర్సిరెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, పాండునాయక్, అమృతసాగర్, అనంతయ్య, శ్రీనివాస్, ధన్‌రాజ్‌గౌడ్, కుమార్, ఉపేందర్‌రెడ్డి, చందు, మహిళా నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి
సరూర్‌నగర్, జనవరి 21: రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని ఎల్‌బినగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ గ్రీన్‌పార్క్ కాలనీలో సుమారు పది లక్షల రూపాయలతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనుల విస్తరణకు సోమవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియెజకవర్గంలో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటానన్నారు. గ్రీన్‌పార్క్ కాలనీ వాసులు ఎదుర్కోంటున్న ఎఫ్‌టిఎల్ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. కాలనీలో మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం, వీదిదీపాల ఏర్పాటు తదితరు సౌకర్యాల సాధనకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం పండ్ల మాట్కెట్ కమిటీ చైర్మన్ దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు మహిపాల్‌రెడ్డి, జగన్‌రెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జిఎచ్‌ఎంసి నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభ విషయంలో ఎమ్మెల్యే ప్రొటోకాల్ పాటించలేదని చంపాపేట కార్పొరేటర్ సామ రమణారెడ్డి ఆరోపించారు. ఈ కారణంగానే ఎమ్మెల్యే పనులను ప్రారంభానికి ముందే తాను కూడ శంకుస్థాపన చేశానన్నారు. అభివృద్ది పనుల విషయంలో తనకు కూడ రాజకీయాలు అవసరం లేదని కార్పొరేటర్ స్పష్టం చేశారు.
పెంచిన చార్జీలు తగ్గించాలని టిడిపి ధర్నా
ఉప్పల్, జనవరి 21: పెంచిన విద్యుద్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఉప్పల్ సర్కిల్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రింగ్‌రోడ్డు సమీపంలోని విద్యుత్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సిపిడిసిఎల్ ఏడికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్‌గౌడ్ మాట్లాడుతూ మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అవినీతి మయంలో కూరుకుపోయిందని విమర్శించారు. ఇప్పటికే పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా విద్యుత్ చార్జీలు, సర్‌చార్జీల పేరుతో మళ్లీ మోయలేని భారం మోపడమేమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆయన హెచ్చరించారు. దేవేందర్‌గౌడ్ తనయుడు టి.వీరేందర్‌గౌడ్, టిడిపి నాయకులు అశోక్‌కుమార్‌గౌడ్, భాస్కర్, హన్మంతరావు, శేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌రాజ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
విద్యుత్ చార్జీలు పెంచితే తిరుగుబాటు తప్పదు
మల్కాజిగిరి, జనవరి 21: ఏప్రిల్ నుంచి విధ్యుత్ చార్జిలను పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేయటాన్ని నిరసిస్తూ సోమవారం మల్కాజిగిరిలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు తెలుగుదేశం ఇన్‌చార్జి వికె మహేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెంటనే ప్రభుత్వ ప్రతిపాదనలను విరమించుకోవాని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వికె మహేష్ మాట్లాడుతూ ఇప్పటికే విద్యుత్ చార్జిలు వినియోగదారులకు పెనుభారంగా మారిందని ఇంకా ఏప్రిల్ నుంచి మళ్లీ చార్జిలు పెంచేందుకు ప్రభుత్వం పూనుకోంటే ప్రజలు తిరుగుబాటు చేయక తప్పదని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని ధరలు పెరిగాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రజలపై పగపట్టినట్లుగా కనబడుతోందిని, పేద, బడుగు,బలహీన వర్గాల వారు జీవించటం గగనమవుతోందని అన్నారు. నిత్యం పెరుగుతున్న ధరలు చూస్తుంటే షేర్‌మార్కెట్‌ను తలపిస్తోందిని వికె మహేష్ విమర్శించారు. ఇప్పటికైన విద్యుత్ చార్జిల పెరుగుదలను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ ఆర్.సుమలతారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలపై ధరల భారాన్ని మోపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆగ్రహనికి గురికాక తప్పదని ఆమె హెచ్చరించారు. ధర్నా అనంతరం సంబంధిత శాఖ ఎడిఇకి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఎన్.వీరేశం యాదవ్, కె.గణేశాచారి, నిరుగొండ జగదీష్ గౌడ్, ధనుంజయ్, మురళీధర్, డివిజన్ అధ్యక్షులు రాంచందర్, పిట్టల శ్రీనివాస్, మోహన్‌యాదవ్, ఎం.జగదీష్ గౌడ్, జలంధర్‌రెడ్డి, మేకల రాము యాదవ్, కె.రమేష్, గణేష్ ముదిరాజ్, అనిల్ కిషోర్ పాల్గొన్నారు.
ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం
మోమిన్‌పేట, జనవరి 21: రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ యాదవ్ తెలిపారు. పల్లెపల్లెకు టిడిపిలో భాగంగా సోమవారం మండల పరిధిలోని గోవిందాపూర్, రంగనాథ్‌గూడుపల్లి, మల్‌రెడ్డిగూడ, చీమల్‌దరి, దేవరంపల్లి, చక్రంపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తుందన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి, రైతుల రుణాలు మాఫీ చేస్తుందని, ఎల్‌కెజి నుంచి పిజి వరకు విద్యార్థినిలకు ఉచిత విద్య అందిస్తుందన్నారు. వికారాబాద్ నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి విజయ్‌కుమార్ మాట్లాడుతూ, మహిళలకు వడ్డీలేని రుణాలు, ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, అంజిరెడ్డి, రహీం, ఒగ్గు మల్లయ్య, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తహశీల్ కార్యాలయం దిగ్బంధించిన వ్యవసాయ కార్మికులు
ఇబ్రహీంపట్నం, జనవరి 21: అర్హులైన పేదలందరికి ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం (సిపిఎం) ఆధ్వర్యంలో యాచారం మండల తహశీల్ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. అర్హులైన అందరికి తక్షణమే ఇళ్ల స్థలాలు చూపెట్టాలనిని, పెండింగ్‌లో ఉన్న పట్టాలను పంపిణీ చేయాలని కార్యాలయంలో పౌర సేవలు జరగకుండా ప్రధాన ద్వారం ముందు కూర్చున్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బైఠాయించారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, పి.అంజయ్య, ఎంపి నర్సింహ, శ్రీమన్నారాయణ, భూషణ్ పాల్గొన్నారు. తహశీల్దార్ అనురాధకు వినతిపత్రం సమర్పించారు.
సునిశిత హాస్యానికి ప్రతీకలు
అమెరికామెడీ కథలు
నల్లకుంట, జనవరి 21: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ విజ్ఞాన పీఠం, శ్రీ త్యాగరాయగానసభల సంయుక్త ఆధ్వర్యంలో నెలనెలా తెలుగు వెనె్నల కార్యక్రమంలో భాగంగా డా.వంగూరి చిట్టెన్‌రాజు రచించిన వంగూరి చిట్టెన్‌రాజు చెప్పిన నూటపదహారు అమెరికామెడీ కథలు గ్రంథావిష్కరణ కార్యక్రమం చిక్కడపల్లి గానసభలో ఘనంగా జగింది. ప్రముఖ సినీ రచయిత, నటుడు తనికెళ్ళ భరణి గ్రంథావిష్కరణ చేసిన ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పొట్టిశ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సిలర్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ నాలుగు దశాబ్ధాలుగా తెలుగు సాహిత్యంలో హాస్యానికి పెద్ద పీఠ వేసి రచయినలు కొనసాగిస్తున్న వంగూరి చిట్టెన్ రాజు రాసిన కథల పుస్తకం అందరూ చదవవలసిన గ్రంథం అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, ప్రముఖ సాహితీ వేత్త ద్వానాశాస్ర్తీ, శిరోమణి వంశీరామరాజు, గానసభ అధ్యక్షులు డా.కళావేంకటదీక్షితులు, డా.తెనే్నటి సుధాదేవి, కె.్ధర్మారావు, రాణి శైలత పాల్గొన్నారు. సభకు ముందు శ్రావ్యచే నిర్వహించిన సినీ సంగీత విభావరి ఆహూతులను అలరించింది.
పండుగలకు పాటల తోరణాలు గ్రంథావిష్కరణ
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ విజ్ఞాన పీఠం, శ్రీ త్యాగరాయగానసభల సంయుక్త ఆధ్వర్యంలో నెలనెలా తెలుగు వెనె్నల కార్యక్రమంలో భాగంగా ప్రముఖ రచయితి సుందరవల్లి శ్రీదేవి రచించిన పండుగలకు పాటల తోరణాలు గ్రంథావిష్కరణ కార్యక్రమం చిక్కడపల్లి గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో ఘనంగా జగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పద్మభూషణ్ డా.సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు మన పండుగలు ప్రతీకలని వాటిని పరిరక్షించుకుంటూ వాటి వైశిష్ట్యాన్ని భావి తరాలకు అందించాల్సిన బాద్యత మనందరిపైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా.మంగళగిరి ఆదిత్యప్రసాద్, రచయిత్రి డా.ముక్తేవి భారతి, ప్రముఖ గాయని వేదవతి ప్రభాకర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెకరికా వ్యవస్ధాపక అధ్యక్షులు డా.వంగూరి చిట్టెన్ రాజు, ప్రముఖ కూచిపూడి నర్తకి సుజాతా వింజమూరి పాల్గొన్నారు. సుందరవల్లి శ్రీదేవి బృందంచే నిర్వహించిన సినీ సంగీత విభావరి ఆహూతులను అలరించింది.
భార్యకు కాలేయ దానం చేయనున్న భర్త
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 21: ప్రేమతో ఒక్కటైన వారు జీవితంలోనే ఆన్యోన్య దంపతులుగా కాపురం చేశారు. రక్తపువాంతులు, కామెర్లతో అనారోగ్యం పాలైన భార్యను వైద్యులకు చూపించగా, ఆమెకు కాలేయమార్పిడి అవసరమని వైద్యులు చెప్పినే వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా కాలేయం ఇచ్చేందుకు తానున్నానంటూ ముందుకొచ్చిన ఓ ఆదర్శ భర్త ఉందంతమిది. కానీ అందుకయ్యే వ్యయం వారి ఆర్థిక పరిస్థితికి తట్టుకోలేరు. కాలేయ మార్పిడి కోసం నగరానికొచ్చి గ్లోబల్ ఆస్పత్రిలో చేరిన రాధాకృష్ణ, లక్ష్మీ అనే ఈ దంపతులిద్దరు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల వాసులు. కాలేయం ఇచ్చేందుకు భర్త రాధాకృష్ణ సిద్దంగా ఉన్నా, శస్తచ్రికిత్సకు అయ్యే రూ. 30లక్షల ఖర్చు వారు తట్టుకోలేని భారమే. శస్తచ్రికిత్స అయ్యే ఖర్చు భరించలేక ఎవరైనా ఆదుకుంటారేమోనన్న కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. ఆర్థిక సహాయం చేయాలనుకున్న వారు ఫోన్ 9849823173ను సంప్రదించాలని రాధాకృష్ణ కోరారు.
ఎనిమిది ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం
నార్సింగి, జనవరి 21: హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్ధీన్ ఓవైసీ సంగారెడ్డిలో అరెస్టు కావడంతో నగరంలోని ఎంఐఎం పార్టీకి చెందిన నాయకులు బంద్ నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం సంగారెడ్డిలో ఎంపి అసదుద్దీన్ ఓవైసీని పోలీసులు అరెస్టు సమాచారం తెలుసుకున్న
కంటోనె్మంట్ సిఇఓ అవమానించారు
* బైఠాయించిన నర్మద
* మారేడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు
కంటోనె్మంట్, జనవరి 21: కంటోనె్మంట్ బోర్డు పాలక మండలి వైస్‌చైర్మన్ భానుక నర్మదను కంటోనె్మంట్ ఎగ్జిక్యూటివ్ అధికారి సూర బాలకృష్ణ అగౌరవపరిచాడని నిరసిస్తూ కంటోనె్మంట్ బోర్డు కార్యాలయంలో ధర్నా చేయడంతోపాటు, ఆమె మారేడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం భానుకనర్మద కంటోనె్మంట్‌లో అభివృద్ధి విషయాలపై చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి సూర బాలకృష్ణను కలిసి ఆ విషయంపై చర్చించారు. కాని, బాలకృష్ణ అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఇంగ్లీషు భాషలో ఉంటాయి, అవి మీకు అర్థంకాదు అంటూ హేళన చేశారు. దీంతో అధికారిగా వివరాలను తెలయజేయాల్సిన బాధ్యత మీపై ఉందని ఆమె చెప్పినా కూడా ఆయన స్పందించలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె తన భర్త భానుక మల్లికార్జున్‌కు జరిగిన సంఘటన వివరించారు. వెంటనే వారు బోర్డు పిఇఓను కలిసి వివరాలు అడిగి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యతగల కంటోనె్మంట్ బోర్డు సభ్యురాలు, వైస్‌చైర్మన్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్న నర్మదకు అభివృద్ధి, ఇతర అంశాలపై చర్చించే అధికారం, హక్కు ఉందని, బోర్డు సభ్యులకు సామరస్యంగా పై విషయాలను తెలియజేసే బాధ్యతకూడా సిఇఓపై ఉందని, అవహేళన చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దానికి సిఇఓ నిరాకరించడంతో భానుక నర్మద అనుచరులు కంటోనె్మంట్ బోర్డు కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. అనంతరం మారేడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒక్కసారికి కంటోనె్మంట్‌లో రాజకీయంగా వేడి ప్రారంభమైంది.గత సంవత్సర కాలంగా కంటోనె్మంట్ బోర్డు సభ్యులు సాదా కేశవరెడ్డి, ఎం.అనురాధ, వైస్‌చైర్మన్‌కు భానుకనర్మద, బోర్డు సభ్యులు జయప్రకాష్‌లకు సంబంధించిన అంశాలపైన వీరి మధ్యలో విభేదాలు ఉన్నాయి. గతంలో 8వ వార్డు బోర్డు సభ్యుడు జయప్రకాష్ తనను కులం పేరుమీద నిందించాడని మారేడ్‌పల్లి పోలీసులకు సిఇఓపై జయప్రకాష్ ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సాదా కేశవరెడ్డి తన అనుచరులతో సిఇఓ నివాసంపైన దాడి చేసాడని సాదా కేశవరెడ్డి ఐదవ వార్డు బోర్డు సభ్యురాలు ఎం.అనురాధ భర్త రామకృష్ణలపై సిఇఓ కేసు నమోదు చేశారు. మరో సంఘటనలో సిఇఓను తక్షణమే బదిలీ చేయించుకుని వెళ్ళిపోవాలని బోర్డు సభ్యుడు సాదా కేశవరెడ్డి పేరుమీద గుర్తు తెలియని వ్యక్తులు బోర్డు కార్యాలయానికి లేఖ పంపారు.
దీనిపై విచారణ చేయించాల్సిందిగా కంటోనె్మంట్ సిఇఓ బాలకృష్ణ మారేడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోర్డు ఎగ్జిక్యూటివ్ అధికారి బాలకృష్ణ, బోర్డు సభ్యుల మధ్యన ఉన్నవిభేదాల కారణంగా రకరకాల పరిణామాలు కంటోనె్మంట్ బోర్డులో చోటుచేసుకుంటున్నాయి.
సోమవారంనాడు జరిగిన సంఘటనపై సిఇఓ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆందోళన చేపడతామని భానుక మల్లికార్జున్ తెలిపారు.