విశాఖపట్నం, జనవరి 21: రాష్ట్రంలో విద్యుత్ కొరత మరింత పెరగనుంది. ఇప్పటికే పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించిన విద్యుత్ పంపిణీ సంస్థలు, త్వరలోనే వాటిపై మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు ఎలాగూ విద్యుత్‌ను కొనుగోలు చేసి పరిశ్రమలకు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో పరిశ్రమలు మూతపడే పరిస్థితి దాపురించింది. జనరేటర్‌తో పరిశ్రమలను నడిపిద్దామంటే, ఒక్కో యూనిట్‌కు కనీసం 16 రూపాయలు ఖర్చవుతోంది. దీనికన్నా గ్యాస్ ఆధారిత విద్యుత్‌ను కొనుగోలు చేసి, తమకు సరఫరా చేయాలని పరిశ్రమల యాజమాన్యాలు మొరపెట్టుకోవడంతో ఎపి విద్యుత్ రెగ్యులేటరీ కమిటీ ఎక్స్‌పెన్సివ్ పవర్ కొనుగోలు చేయడానికి నిర్ణయించింది. ఒక్కో యూనిట్ 9.75 రూపాయలుగా నిర్ణయించింది. అయితే ఈ విద్యుత్‌ను సరఫరా చేయడానికి కూడా ఈపిడిసిఎల్ అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా ప్రతి పరిశ్రమకు డెడికేటెడ్ ఫీడర్ ఉండాలని పేర్కొంది. ఈ ఎక్స్‌పెన్సివ్ విద్యుత్‌ను ఉదయం 50 శాతం వినియోగించుకోవాలి. ప్రస్తుతం ప్రతి పరిశ్రమకు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల లోపు 10 శాతం విద్యుత్‌ను మాత్రమే సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయాల్లో ఎక్స్‌పెన్సివ్ పవర్‌ను 40 శాతం మాత్రమే వినియోగించుకోవాలన్న నిబంధన విధించింది. దీనికితోడు నెలకు ఎన్ని యూనిట్లు ఖర్చవుతాయో ముందుగానే ఆయా పరిశ్రమల యాజమాన్యాలు లెక్కకట్టి ఆ మొత్తాన్ని ఈ సోమవారం నాటికి చెల్లించాలంటూ డెడ్‌లైన్ విధించింది. ఈ నిబంధనలతో ఎక్స్‌పెన్సివ్ పవర్ పొందడం సాధ్యం కాదని యాజమాన్యాలు చేతులెత్తేశాయి.
ఈపిడిసిఎల్ పరిధిలోని వివిధ పరిశ్రమలకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేయాలంటే, రోజుకు 400 మెగా వాట్ల విద్యుత్ అదనంగా అవసరం అవుతుంది. దీన్ని కొనుగోలు చేసి పరిశ్రమలకు సరఫరా చేయడం ఈపిడిసిఎల్‌కు అసాధ్యమైన పనిగా తయారైంది. అందుకే ఎక్స్‌పెన్సివ్ పవర్‌ను పరిశ్రమల ముందుంచింది. భారీ నిబంధనలతో ఏ పరిశ్రమ యజమాని కూడా ఎక్స్‌పెన్సివ్ పవర్ వినియోగించుకోడానికి ముందుకు రాలేకపోతున్నారు. ఎక్స్‌పెన్సివ్ పవర్‌పై విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన ఆదేశాలనే తాము పాటిస్తున్నాం అని చెపుతున్నారు ఈపిడిసిఎల్ అధికారులు. ఎక్స్‌పెన్సివ్ పవర్ కావాలంటే, విధిగా డెడికేటెడ్ ఫీడర్ ఉండాలని అన్నారు. ఎన్ని పరిశ్రమలకు డెడికేటెడ్ ఫీడర్ ఉంటుంది? విశాఖ ఆటోనగర్‌లో సుమారు 600 పరిశ్రమలు ఉన్నాయి. అలాగే సినిమా థియేటర్లు, ఐటి పరిశ్రమలు ఇలా ఈపిడిసిఎల్ పరిధిలో 3000కు పైగా సంస్థలు పనిచేస్తున్నాయి. వీటిలో 90 శాతం వాటికి డెడికేటెడ్ ఫీడర్లు లేవు. అలాగే ఫిబ్రవరి నెలకు కావల్సిన యూనిట్లను ముందుగానే నిర్ణయించుకుని, దానికి సంబంధించిన మొత్తాన్ని ముందుగానే చెల్లించమంటే ఎన్ని పరిశ్రమలు ఇందుకు సాహసించగలవు? అయినప్పటికీ కొన్ని కంపెనీల యాజమాన్యాలు దరఖాస్తులు ఇవ్వడానికి సోమవారం ఈపిడిసిఎల్ కార్యాలయానికి వెళ్లాయి. అయితే డెడికెటెడ్ ఫీడర్ లేదని వారిని తప్పి పంపించారు. కొంతమంది తమ దరఖాస్తులు తీసుకోవాలని వత్తిడి తేవడంతో వాటిని స్వీకరించారు తప్ప, ఫిబ్రవరి నెలకు సంబంధించిన మొత్తానికి సంబంధించిన డిడిని తీసుకునేందుకు అంగీకరించలేదు. ఎట్టకేలకు కొంతమంది దరఖాస్తులను ఈపిడిసిఎల్‌లో ఇచ్చి వచ్చారు.
ఈపిడిసిఎల్ పనితీరుపై పరిశ్రమల యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. రెండు రోజుల్లో మెరుపు సమ్మెకు దిగాలని ఆలోచిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఐటి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన జిల్లాస్థాయి కమిటీ తొలి సమావేశం సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రుషికొండ ఐటి పరిశ్రమల సంఘం అధ్యక్షుడు పివి విష్ణుకుమార్ రాజు, ఉపాధ్యక్షుడు నరేష్ కుమార్, ఐటి అసోసియేషన్ అధ్యక్షుడు పీటర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. డెడికేటెడ్ ఫీడర్లకే ఎక్స్‌పెన్సివ్ పవర్ ఇస్తామన్న నిబంధనను తొలగించాలని, నాన్ డెడికెటెడ్ ఫీడర్లు ఉన్న పరిశ్రమలకు కూడా ఈ సదుపాయం కల్పించాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. ఐటి పార్క్‌లకు ఎస్‌ఇజెడ్ హోదా కల్పించడం వలన ఎదురయ్యే సమస్యలను వారు కలెక్టర్‌కు వివరించారు. ఎస్‌ఇజెడ్‌ను డీ నోటిఫై చేయాలని వారు కోరారు. అలాగే ఐటి పార్క్‌లలో వౌలిక సదుపాయాలు కూడా లేవని వారు తెలియచేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ శేషాద్రి తక్షణం వౌలిక సదుపాయాలకల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
మోగిన సహకార ఎన్నికల నగరా
* 31వ విశాఖ, 4న యలమంచిలి డివిజన్లలో ఎన్నికలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 21: జిల్లాలో సహకార ఎన్నికలకు సంబంధించి సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు నోటిఫికేషన్ సాయంత్రమే జారీ కాగా, ఈ జిల్లాలో మాత్రం రాత్రి 10 గంటల వరకూ నోటిఫికేషన్‌ను జారీ చేయలేకపోయారు అధికారులు. ఎట్టకేలకు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం జిల్లాలోని మొత్తం 97 సహకార సంఘాలకు రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. విశాఖ, యలమంచిలి డివిజన్లలో ఈ ఎన్నికలు జరుగుతాయి.
విశాఖ డివిజన్‌లోని 43 సహకార సంఘాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను 22వ తేదీన జారీ చేస్తారు. ఓటర్ల జాబితాను కూడా అదేరోజు ప్రకటిస్తారు. 24న ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ నామినేషన్లను స్వీకరించనున్నారు. 25న నామినేషన్లను పరిశీలించనున్నారు. 26వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈనెల 31వ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ మగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు, ఆ వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు.
ఇక యలమంచిలి డివిజన్‌కు సంధించి ఈనెల 24వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 28వ తేదీ ఉదయం పది గంటల నుంచి నాలుగు గంటల వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. 29న నామినేషన్ల పరిశీలన. 30వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోగా నామినేషన్ల ఉపసంహరించుకునేందుకు వీలుంది. ఫిబ్రవరి నాలుగో తేదీన ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు, వెనువెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. యలమంచిలి డివిజన్‌లో 54 ప్రాథమిక పరపతి సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఏజెన్సీలోని 11 సంఘాలు ఉన్నాయి.
ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ చేసినట్టు అధికారులు తెలియచేశారు. 97 మంది ఎన్నికల అధికారులను నియమించారు. పోలింగ్ నిర్వహణకు సుమారు 5,600 మంది సిబ్బందిని నియమించారు.
మే 29న చోడవరం సుగర్ ఫ్యాక్టరీ ఎన్నికలు
ఇదిలా ఉండగా చోడవరం సుగర్ కో-ఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేశారు. ఏప్రిల్ 15వ తేదీన ఎన్నికల అధికారిని నియమించనున్నారు. 18వ తేదీన రికార్డులను పరిశీలిస్తారు. ఏప్రిల్ 19 నుంచి 25వ తేదీ వరకూ ఫ్యాక్టరీ ఎండి సభ్యుల జాబితాను తయారు చేస్తారు. ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే రెండో తేదీ వరకూ ఈ జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఐదవ తేదీన ఎన్నికల అధికారికి ఈ జాబితాలను అందచేస్తారు. ఆరవ తేదీన ఉంచి 10వ తేదీ వరకూ జాబితాను ఎన్నికల అధికారి పరిశీలిస్తారు. మే 13వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. 15వ తేదీన ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. 21 ఉదయం 10 గంటల నుంచి ఐదు గంటల వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. 22వ తేదీన నామినేషన్ల పరిశీలన. 23 సాయంత్రం ఐదు గంటల లోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. 29న ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఆ తరువాత ఓట్ల లెక్కింపు, తదుపరి ఫలితాలను వెల్లడిస్తారు.
1 నుంచి పెరగనున్న ఎయిర్‌పోర్ట్ ఎంట్రీ చార్జీలు
* సందర్శకుల ప్రవేశంపై కొనసాగుతున్న నిషేధం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 21: ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో ప్రవేశానికి చెల్లిస్తున్న టిక్కెట్ ధరను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెంచనున్నట్టు ఎయిర్‌పోర్టు డైరక్టర్ శ్రీనివాస్ సోమవారం ‘ఆంధ్రభూమి’ తెలియచేశారు. ప్రస్తుతం ఈ టిక్కెట్ 30 రూపాయలు. ఒకటో తేదీ నుంచి దీన్ని 45 రూపాయలకు పెంచారు. అలాగే ఎయిర్‌పోర్టులో కార్ పార్కింగ్‌కు ప్రస్తుతం 25 రూపాయలు చెల్లిస్తున్నారు. దాన్ని 40 రూపాయలకు పెంచారు. ఇదిలా ఉండగా రిపబ్లిక్ డేని పురస్కరించుకుని ఎయిర్‌పోర్టులో సందర్శకులపై నిషేధం కొనసాగుతోంది. ఈనెల 15వ తేదీ నుంచి సందర్శకులను నిలిపివేశారు. కాగా, ఎయిర్‌పోర్టుకు వచ్చిపోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిందిగా పోలీసులను కోరామని శ్రీనివాస్ తెలియచేశారు. ఈమేరకు పోలీసులు సోమవారం నుంచి వాహనాల తనిఖీని ముమ్మరం చేశారు.
24 గంటలు ఎయిర్‌పోర్టును
తెరిచి ఉంచండి
* అనిల్ చోప్రాకు గంటా లేఖ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 21: ఎయిర్‌పోర్టు 24 గంటలూ పనిచేసేందుకు వీలుగా సిబ్బందిని నియమించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు తూర్పు నౌకాదళ అధికారి అనిల్ చోప్రాకు లేఖ రాశారు. విశాఖ ఎయిర్ ట్రావలర్స్ అసోసియేషన్ సభ్యులు సోమవారం గంటాను కలిసి విశాఖ ఎయిర్‌పోర్టును 24 గంటలూ తెరిచి ఉంచాలని కోరిన మీదట ఆయన ఈ లేఖ రాశారు. ఎయిర్‌పోర్టు 24 గంటలు పనిచేసేందుకు కావల్సిన సిబ్బందిని ఇప్పటికే సిద్ధం చేశారని ఆయన అన్నారు. గతంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తను, జిల్లాకు చెందిన ఎంపిలు చేసిన కృషి మీదట విశాఖ విమానాశ్రయాన్ని రాత్రి 12 గంటల వరకూ తెరిచి ఉంచుతున్నారని గంటా ఆ లేఖలో పేర్కొన్నారు. విశాఖ విమానాశ్రయ పరిధిలో సుమారు మూడు కోట్ల మంది జనాభా ఉన్నారని, వీరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయాన్ని 24 గంటలూ తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
జోనల్ కార్యాలయాల్లో సమాచార బోర్డులు తప్పనిసరి
విశాఖపట్నం (జగదాంబ), జనవరి 21: నగర పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను ఎవరైనా ఆక్రమణలు చేపడితే చర్యలు తప్పవని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరిమానా విధిస్తామని జివిఎంసి కమిషనర్ ఎం.వి. సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం తన చాంబర్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌డే కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆక్రమణలకు సంబంధించి ఫిర్యాదులు రావడంతో చర్యలుచేపట్టాలంటూ అధికార్లను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జివిఎంసి పరిధిలోని అన్ని జోనల్ కార్యాలయాల్లోసమాచార బోర్డులు తప్పనిసరిగా పెట్టాలని, కట్టడాలకు అనుమతులు ఇస్తే వాటిని కూడా ప్రదర్శించాలని అన్నారు. అలాగే ఇటీవల నగరంలో 96 కల్యాణ మండపాలను గుర్తించామని వాటికి ఎక్కడ ఎలాంటి ఫైర్ పరికరాలు లేవని, వారంరోజుల లోపు ఆయా సంస్థల వార పార్కింగ్, ఫైర్ పరికరాలు అమర్చుకోవాలని లేకుంటే 462ఎ బిల్డింగ్ చట్టం ప్రకారం సీజ్ చేస్తామని అన్నారు. ఇప్పటికే 25 కల్యాణ మండపాల యజమానులకు నోటీసులు ఇచ్చామన్నారు. త్వరలోనే అన్ని పాఠశాలలు, ఆస్పత్రులు, మాల్స్, సినిమా హాళ్ళపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. జీవో 154 ప్రకారం అమలు కాకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. అలాగే జోన్‌లో కమిషనర్ల ఆయా జోన్ పరిధిలో ఉన్న అతిథి గృహాలు, పాఠశాలలపై దృష్టి సారించాలన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23 జివిఎంసి పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో కల్యాణ మండపాలు, పాఠశాలలు, ఆస్పత్రలు, తదితర వాటికి అగ్నిమాపక పరికరాలు వినియోగం, వాడకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తే ఎంతటివారిపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులు సకాలంలో స్పందించి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఈ బి.జయరామిరెడ్డి, సిపిపి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అన్ని పార్టీ నేతలు డిక్లరేషన్‌నివ్వాలి
సమైక్యాంధ్ర యువజన జెఏసి డిమాండ్
విశాఖపట్నం, జనవరి 21: సమైక్యాంధ్రప్రదేశ్‌పై అన్ని పార్టీలు రాజకీయ నాయకులు డిక్లరేషన్ ప్రకటించాలని సమైక్యాంధ్ర యువజన జెఏసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఆడారి కిషోర్‌కుమార్ డిమాండ్ చేశారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23న విశాఖలో ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో సమావేశం, 25న రాజమండ్రిలో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. సమైక్యాంధ్రప్రదేశ్‌పై అన్ని రాజకీయ పార్టీలు డిక్లరేషన్ ప్రకటించాలని విశాఖలో రౌండ్‌టేబుల్ సమావేశంలో సమైక్యంధ్ర యువజన జెఏసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఆడారి కిషోర్‌కుమార్ పార్టీలను హెచ్చరించారు. సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజీనామాను సిద్ధంగా ఉండాలని అన్నారు. విశాఖలో 23న ఉత్తరాంధ్ర జిల్లాలు అన్ని పార్టీలు ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి సమైక్య రాష్ట్ర ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వానికి వినిపిస్తామన్నారు. అలాగే రాజమండ్రిలో 25న సాయంత్రం ఐదు గంటలకు ఉండవల్లి అరుణకుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని జెఏసి ప్రతినిధులను, తెలంగాణాలో ఉన్న సమైక్యవాదులను పిలిచి సమైక్యవాణిని వినిపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవిరావు, కె.సతీష్, కాళ్ళ శ్రీనివాస్, రాపేటి రామకృష్ణ, జగన్నాధరావులు పాల్గొన్నారు.
పెరిగిన రైలు చార్జీలు
* నేటి అర్ధరాత్రి నుంచి అమలు
విశాఖపట్నం, జనవరి 21: రైలు చార్జీలు పెరిగాయి. మంగళవారం అమల్లోకి వస్తాయి. సెకండ్ క్లాస్ ఆర్డనరీ (సబర్బన్) రైలులో ప్రతి కిలోమీటర్‌కు రెండు పైసులు చార్జీ పెరిగింది. పది కిలోమీటర్ల వరకు చార్జీల్లో ఎటువంటి మార్పు ఉండదు. అలాగే సెకండ్ క్లాస్ ఆర్డనరీ (నాన్-సబర్బన్) రైలులో ప్రతి కిలోమీటరుకు మూడు పైసలు రైలు చార్జీ చెల్లించాలి. ఇది కూడా పది కిలోమీటర్ల వరకు ఎటువంటి మార్పు ఉండదు. సెకండ్ క్లాస్‌కు నాలుగు పైసలు చార్జీ పెరిగింది. 50 కిలోమీటర్ల వరకు ఎటువంటి మార్పు ఉండదు. ఇది దాటిన తరువాత ఈ చార్జీలు వర్తిస్తాయి. ఇక స్లీపర్ క్లాస్ ఆరు పైసలు పెరగగా, 200 కిలోమీటర్ల వరకు ఎటువంటి మార్పు ఉండదు. ఏసి చైర్‌కార్‌కు సంబంధించి ప్రతి కిలోమీటర్‌కు ఆరు పైసలు పెరగగా, 150 కిలోమీటర్ల వరకు ఈ చార్జీలు వర్తించవు. ఏసి 3-టైర్‌కు సంబంధించి ప్రతి కిలోమీటరుకు 300 కిలోమీటర్ వరకు ఇది వర్తించదు. ఫస్ట్ క్లాస్‌కు ప్రతి కిలోమీటర్‌కు మూడు పైసలు చార్జీ పెరిగింది. అయితే వంద కిలోమీటర్ల వరకు ఇది వర్తించదు. అలాగే ఏసి 2 టైర్ ఆరు పైసలు పెరగగా, 300కిలోమీటర్ల దాటిన నుంచి ఈ చార్జీలు వర్తిస్తాయి. ఇకపోతే ఏసి ఫస్ట్‌క్లాస్‌కు సంబంధించి ప్రతి కిలోమీటర్‌కు పది పైసలు పెరగగా 300 కిలోమీటర్‌కు వరకు ఇది వర్తించదు. కనీస చార్జీగా ఐదు రూపాయలు నిర్దేశించింది. డెవలెప్‌మెంట్ చార్జీలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. రిజర్వేషన్ ఫీజులో ఎటువంటి మార్పు లేదు. సెకండ్ క్లాస్ సూపర్‌పాస్ట్ సర్‌చార్జీ పది రూపాయలుగా నిర్ణయించారు.
విద్యుత్ చార్జీల పెంపును ప్రజలు ప్రతిఘటించాలి
* సంతకాల సేకరణలో సిపిఐ పిలుపు
విశాఖపట్నం, జనవరి 21: సిపిఐ జగదాంబ, జాలారిపేట శాఖల ఆధ్వర్యంలో సోమవారం పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజల నుండి సంతకాల సేకరణ ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 683 మంది సంతకాలు చేస్తూ ప్రభుత్వం విధానాలను విమర్శించడం గర్హనీయం. సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ నగర కార్యవర్గ సభ్యులు జి.వామనమూర్తి మాట్లాడుతూ పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గే వరకు ప్రజలు ప్రతిఘటన ఉద్యమానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. జగదాంబ సిపిఐ కార్యదర్శి తిరుపతిరావు, జాలారిపేట శాఖా కార్యదర్శి తెడ్డు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
పెంచిన విద్యుత్ సర్‌చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంవిపి కాలనీశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఎంవిపి కాలనీ క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ప్రజల నుంచి సంతకాలను సేకరించారు. ఈ శాఖ కార్యదర్శి మర్రివేముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇది జరిగింది.
నేడు కలెక్టరేట్ ముట్టడి
విద్యుత్ చార్జీలు రద్దు చేయాలని మంగళవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు సిపిఎం కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్ సోమవారం ప్రకటనలో తెలిపారు.
పిఎఫ్ కార్యాలయ ఉద్యోగికి నాలుగేళ్ళు జైలుశిక్ష
* సిబిఐ కోర్టు తీర్పు
విశాఖపట్నం, జనవరి 21: విశాఖ నగరంలో రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కార్యాలయంలో సోషల్ సెక్యురిటీ అసిస్టెంట్‌గా పనిచేసే బుదరాయవలస చంద్రధర పాత్రోకు నాలుగు ఏళ్ళ జైలుశిక్ష విధిస్తూ శుక్రవారం సిబిఐ కోర్టు ప్రిన్సిపాల్ స్పెషల్ జడ్జి జి.అనుపమ చక్రవర్తి తీర్పు చెప్పారు. నాలుగేళ్ళ జైలుశిక్షతోపాటు పది వేలు రూపాయల జరిమానా విధించారు. ఈ జరిమానాను చెల్లించలేని పక్షంలో మరో నెల అదనంగా జైలుశిక్షను అనుభవించాల్సి ఉంటుందని ఈ తీర్పులో జడ్జి పేర్కొన్నారు. పెన్షన్ డిస్‌బర్స్‌మెంట్ సెక్షన్‌లో పనిచేస్తున్న పాత్రో పెన్షన్ విడుదల కోసం లంచం ఆశించాడు. చిట్టివలస జూట్‌మిల్లులో పనిచేస్తున్న ఉద్యోగి తన నెల పెన్షన్ ఏర్పాటు కోసం రెండు వేల రూపాయలు డిమాండ్ చేశాడు. దీంతో ఉద్యోగి కుమారుడు సిబిఐకి పిర్యాదు చేయడంతో 2007 మేలో నేరుగా లంచం తీసుకుంటుండగా పాత్రో సిబిఐ అధికారులకు పట్టుబడ్డాడు. ఆ తరువాత పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తరువాత ఈ ఉద్యోగిపై సిబిఐ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. దీనిలోభాగంగా సోమవారం జడ్జి అనుపమ చక్రవర్తి తీర్పును వెలువరించారు.
మెట్టు దిగని అయ్యన్న
* నిగ్గు తేల్చాలని పట్టు
నర్సీపట్నం, జనవరి 21: పార్టీ పదవులకు రాజీనామా చేసిన అయ్యన్నపాత్రుడు మెట్టుదిగడం లేదు. పీలా శ్రీనివాసరావు విషయంలో జరిగిన తప్పు నిగ్గు తేల్చాలనే పట్టుదలతో ఉన్నారు. నిజానిజాలు తేలిన తరువాతే ఉపసంహరణ అంశం పరిశీలిస్తానని చెబుతున్నారు. పార్టీ పదవులకు చేసిన రాజీనామాలను ఉపసంహరించుకోవాలని అడుగుతున్న పార్టీ నేతలకు అయ్యన్న ఇదే సమాధానం చెబుతున్నారు. అయ్యన్న రాజీనామాను ఉపసంహరించుకున్నారని దాడి వీరభద్రరావు చేసిన ప్రకటనను సోమవారం విలేఖరుల వద్ద అయ్యన్న ఖండించారు. పెందుర్తిలో జరిగిన వివాదానికి విచారణ కోసం అధిష్ఠానవర్గం ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. వివాదానికి కారణమైన నాయకులకు కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తుంది. అనంతరం వారిపై వచ్చిన అభియోగాలకు సమగ్ర సమాచారంతో హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో అయ్యన్న కూడా కమిటీ ముందు ఇదేవిధంగా హాజరయ్యారు. మూడుసార్లు మంత్రి గా కొనసాగిన తనకే అధిష్ఠానవర్గం షోకాజ్ నోటీసు జారీ చేయగా పీలా శ్రీనివాసరావుకు కనీసం షోకాజ్ నోటీసు కూడా జారీ చేయకుండా ఏకంగా సస్పెండ్ చేయడాన్ని తప్పు పడుతున్నారు. పెందుర్తి వివాదంలో ఎవరి ప్రమేయం ఎంత ఉంది, ఎవరు తప్పు చేశారు అనే విషయాలు నిగ్గు తేల్చాలని అయ్యన్న డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యర్ధి వర్గీయులు తప్పు చేసినట్లు రుజువైనా వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని, తప్పు అనేది తేల్చాలని అయ్యన్న పట్టుపడుతున్నారు. చంద్రబాబు, బాలకృష్ణలకు ఇక్కడి నుండి కొంతమంది వ్యక్తులు తప్పుడు సమాచారం ఇచ్చారని, ఇదే విషయాన్ని బాలకృష్ణకు, జిల్లా ఇన్‌చార్జ్జి సుజనాచౌదరి దృష్టికి తీసుకువెళ్ళినట్లు అయ్యన్న తెలిపారు. పదవులకు రాజీనామా చేసినా కొన ఊపిరి ఉన్నంత వరకు పార్టీలోనే కొనసాగుతానని చెబుతున్న అయ్యన్న పీలా శ్రీనివాసరావుకు జరిగిన అన్యాయంపై తీవ్రంగా మదన పడుతున్నారు. వాస్తవాలు తేలే వరకు తాను రాజీనామాను ఉపసంహరించుకునేది లేదని సోమవారం విలేఖరులకు తేల్చిచెప్పారు.
మంత్రి గంటా సమైక్యాంధ్ర ఉద్యమమా!
* అయ్యన్న ఎద్దేవా
నర్సీపట్నం, జనవరి 21: ప్రచారం కోసమే సమైక్యాంధ్ర పేరుతో మంత్రి గంటా శ్రీనివాసరావు హడావుడి చేస్తున్నారని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశా రు. సమైక్యాంధ్ర కోసం తాను గతంలో ఉద్యమాలు చేశానని, అప్పుడు కనీసం ప ట్టించుకోని గంటా ఇప్పుడు ఉద్యమం చేస్తానని ముందుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. సోమవారం తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ తె లంగాణాకు 2008లో చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇచ్చినప్పుడు అడ్డుకోని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటామంటున్నారో అర్ధం కావడం లేదన్నా రు. చంద్రబాబు కాళ్ళకు బదులు, సోనియాగాంధీ కాళ్ళు పట్టుకోవాలని ఎం.పి. లగడపాటికి సూచించారు. చంద్రబాబు చెబితే సమైక్యాంధ్రాగా ఉంటే ఆయనతో ప్రకటన ఇప్పిస్తామని అయ్యన్న అన్నారు. కాంగ్రెస్ అధిష్టానవర్గం ప్రత్యేక తెలంగాణాను ఇష్టపూర్వకంగా ఇవ్వడంలేదని, రాజకీయ కుట్రతోనే ఇస్తున్నారన్నారు. రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రిని చేయడం కోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి సాహసిస్తున్నారన్నారు. తాను మొదటి నుండి సమైక్యాంధ్రాకే కట్టుబడిన వ్యక్తినని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో మార్చి మొదటి వారంలో చంద్రబాబు పాదయాత్ర ఉండవచ్చని చెప్పారు. మారుమూల గ్రామాల్లో పాదయాత్ర కొనసాగేలా రూట్‌మ్యాప్‌ను తయారు చేస్తామని అయ్యన్నపాత్రుడు తెలిపారు.
సీలేరు దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
* 52 తులాలు బంగారం,
అర కిలో వెండి స్వాధీనం
* ముగ్గురు నిందితుల అరెస్ట్
నర్సీపట్నం, జనవరి 21: జిల్లాలో సంచలనం కలిగించిన సీలేరు దోపిడీ కేసును పోలీసులు చేధించారు. చాకచక్యంగా వలపన్ని దోపిడీ దొంగలను పట్టుకున్నారు. వీరి నుండి 20 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నర్సీపట్నంలోని ఎఎస్పీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో చింతపల్లి ఎఎస్పీ గోపీనాథ్ జెట్టీ కేసు వివరాలను వెల్లడించారు. సీలేరు మెయిన్‌బజార్‌లో నివాసం ఉంటున్న నున్నా పద్మావతి(70) కుమారులు, కోడళ్ళు సంక్రాంతి పండుగకు అత్తవారింటికి వెళ్ళారు. దీంతో పద్మావతి ఆమె మనుమడు మాత్రమే ఇంటి వద్ద ఉన్నారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేరని, పద్మావతి వద్ద భారీస్థాయిలో బంగారు ఆభరణాలు ఉన్నట్లు తెలిసిన అదే గ్రామంలో నివాసం ఉంటున్న వాచీల మెకానిక్ అజార్ ఆలీఖాన్(35) గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కనగల గ్రామానికి చెందిన మేనల్లుడైన జియావుల్ హుక్(24), వి.రాజారమేష్(22)లను సీలేరు రప్పించి దోపిడికి పథకం రూపొందించినట్లు ఎఎస్పీ తెలిపారు. ఈనెల 16వతేదీ సాయంత్రం పట్టపగలు జియావుల్ హుక్, రాజారమేష్ పద్మావతి ఇంట్లో ప్రవేశించి కత్తులతో బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న 58 తులాల బంగారు అభరణాలు, ఫ్రిజ్‌లో దాచిన అరకిలో వెండి వస్తువులు దోచుకుపోయారు. దోపిడి చేసిన బంగారు, వెండి ఆభరణాలతో ముగ్గురు నిందితులు గుంటూరుకు వెళ్ళిపోయారు. అక్కడ బంగారు అభరణాలు అమ్మేందుకు ప్రయత్నించగా భారీస్థాయిలో వస్తువులు అమ్మకానికి పెడితే అనుమానం వస్తుందని భావించారు. ఆరు తులాల వస్తువులను ఓ ఫైనాన్స్‌లో తనఖా పెట్టి లక్ష రూపాయలు తీసుకున్నారు. బంగారం వస్తువులను విక్రయించడం కోసం ఈనెల 20వ తేదీన ముగ్గురు నిందితులు నర్సీపట్నం వచ్చి ఫణిచంద్ర లాడ్జిలో దిగారు. ఈ సమాచారం తెలుసుకున్న జి.కె.వీధి సి.ఐ. రామకృష్ణ, సీలేరు ఎస్సై బాలకృష్ణ, సిబ్బంది పట్టణంలోని లాడ్జిలు తనిఖీ చేయగా ఫణిచంద్ర లాడ్జిలో ముగ్గురు నిందితులు పట్టుబడినట్లు ఎఎస్పీ వివరించారు. వీరివద్ద నుండి 52 తులాల బంగారు అభరణాలు, అరకిలో వెండి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు గోపీనాథ్ జెట్టీ తెలిపారు.
* ప్రొఫెషనల్స్ కాక పట్టుబడ్డారు
భారీస్థాయిలో జరగని దోపిడీ సంఘటనలో పాల్గొన్న వ్యక్తులు వృత్తిరీత్యా దొంగలు కాకపోవడమే వారు పట్టుబడ్డట్లు పోలీసులు చెబుతున్నారు. సుమారు 20 లక్షల రూపాయలు బంగారం, వెండి ఆభరణాలను దోచుకునే సందర్భంలో దొంగలు వినియోగించిన సెల్‌ఫోన్ కాల్స్ ద్వారా నిందితులను పోలీసులు గుర్తించగలిగారు. 20 ఏళ్ళ క్రితం గుంటూరు జిల్లా నుండి సీలేరు వచ్చి వాచీల మెకానిక్‌గా స్ధిరపడ్డాడు. ఇతను నివాసం ఉంటున్న సమీపంలోనే నున్నా పద్మావతి ఇల్లు ఉంది. స్వతహాగా ఆస్థిపరురాలైన పద్మావతి బంగారం గొలుసులు, గాజులు నిత్యం ఒంటిపై వేసుకుంటుంది. ఈ విషయం తెలిసిన ఆలీఖాన్ గుంటూరులో ఉన్న మేనల్లుడు, మరో వ్యక్తిని రప్పించి దోపిడికి పాల్పడ్డారు. జియావుల్ హుక్, రాజారమేష్ పద్మావతి ఇంట్లో ఉండగా బయట ఉన్న ఆజార్ ఆలీఖాన్ పలుమార్లు సెల్‌ఫోన్‌లో మాట్లాడారు. చోరీ జరిగిన సమయంలో సుమారు 16 సార్లు మాట్లాడినట్లు నమోదు కావడంతో పోలీసులు అనుమానించి వారిపై నిఘా వేశారు. గుంటూరు నుండి తిరిగి నర్సీపట్నం వచ్చారనే సమాచారం తెలుసుకున్న పోలీసులు నర్సీపట్నంలోని లాడ్జిలను తనిఖీ చేయగా ముగ్గురు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వృత్తిరీత్యా దొంగలు కాకపోవడం వలనే దోపిడీ చేసిన బంగారాన్ని విక్రయించుకోలేక పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది.
కేసు ఛేదించిన పోలీసులకు రివార్డులు
దోపిడి సంఘటన కేసును ఛేదించిన జి.కె.వీధి సి.ఐ. రామకృష్ణ, సీలేరు ఎస్సై బాలకృష్ణ, సి.సి.ఎస్. ఎస్సై సూర్యనారాయ ణ, సి.సి.ఎస్.సిబ్బంది సుబ్బరాజు, విశే్వశ్వరరావు,కుమార్‌లకు రివార్డులు అందజేయనున్నట్లు ఎఎస్పీ గోపీనాథ్ తెలిపారు. ఇందుకోసం రూరల్‌ఎస్పీకి ప్రతిపాదన పంపించామని చెప్పా రు. ఈకేసును విచారించిన పోలీసు అధికారులను, సిబ్బందిని, సహకరించిన ప్రజలకు ఎఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.
బస్సు ఢీకొని మోటార్ సైక్లిస్టు మృతి
అనకాపల్లి టౌన్, జనవరి 21: మండలంలోని తుమ్మపాల గ్రామంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మోటార్‌సైక్లిస్టు మృతి చెందాడు.. బవులవాడ గ్రామానికి చెందిన ముమ్మిన శ్రీను తన బంధువుల ఇంటికి మునగపాక వెళ్లి తిరిగి బవులవాడ మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా తుమ్మపాల పెట్రోల్‌బంకు సమీపంలో వెనుక నుండి అచ్యుతాపురం బ్రాండిక్స్ కంపెనీకి చెందిన ప్రైవేటు బస్సు వచ్చి బలంగా ఢీకొంది. సుమారు ఐదు పర్లాంగుల దూరం వరకు మోటార్ సైకిల్‌తోపాటు అతడిని ఈడ్చుకుపోయింది. ఆ పక్కనే నిలిపి ఉన్న ఆటోను కూడా ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటార్ సైక్లిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్లు స్థానికులు తెలియజేశారు. మృతుడు శ్రీను క్వారీలో కార్మికునిగా పనిచేస్తున్నాడు. రోడ్డుపై చనిపోయిన ఉన్న శ్రీను మృతదేహాన్ని తీయడానికి అక్కడి స్థానికులు, కుటుంబ సభ్యులు ఒక పరిస్థితిలో తీసేందుకు అంగీకరించలేదు. నష్టపరిహారం ప్రకటించే వరకు తీసేది లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో సుమారు గంటసేపు వరకు రోడ్డుపై ట్రాఫిక్, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను మళ్లించారు. మృతుని కుటుంబానికి 50 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వడానికి బ్రాండిక్స్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అరకులోయ ఘాట్‌లో దొంగల భయం
అరకులోయ, జనవరి 21: అరకులోయ ఘాట్‌రోడ్డులో ప్రయాణించే వ్యాపారులు, పర్యాటకులు, ఉద్యోగులకు దొంగల భయం పట్టుకుంది. దోపిడీదొంగల భయంతో ఘాట్‌రోడ్డులో ప్రయాణించేందుకు ప్రతీ ఒక్కరూ హడలిపోతున్నారు. చీకటి పడితే చాలు ఈ మార్గంలో ప్రయాణించాలంటే ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గుర్తుతెలియని కొందరు వ్యక్తులు దారికాచి దోచుకుంటున్నారని తెలుసుకున్న వారంతా ఈ రోడ్డులో ప్రయాణించడానికి భయపడుతున్నారు. ఘాట్‌రోడ్డు మలుపుల వద్ద బండరాళ్లను అడ్డంగా పెట్టి వచ్చిపోయే వాహనాలను ఆపి భయపెట్టి దోచుకుంటున్నారని తెలిసింది. ముఖ్యంగా కార్లు, జీపులు, ద్విచక్ర వాహనాలతో ప్రయాణించే పర్యాటకులు, వ్యాపారులు, ఉద్యోగుల నుంచి నగదు, బంగారు ఆభరణాలు, కెమెరాలు, సెల్‌ఫోన్లు విలువైనవి బలవంతంగా లాక్కొంటున్నట్టు తెలిసింది. ఘాట్‌రోడ్డు ప్రారంభమయ్యే శివలింగపురం మలుపువద్ద, కొండిబ, డముకు, మర్ధగుడ, బీసుపురం, గాలికొండ మలుపులలో ముసుగు వేసుకుని దారిదోపిడికి పాల్పడుతున్నట్టు పర్యాటకులు విలేఖరుల వద్ద వాపోయారు. దీంతో రాత్రుళ్లు ఘాట్‌రోడ్డులో ప్రయాణమంటేనే హడలిపోతున్నారు. సొంత పనుల మీద శృంగవరపుకోట, విజయనగరం, విశాఖపట్నం వంటి పట్టణాలకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు దొంగలభయంతో సాయంకాలంలోపే స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఘాట్‌రోడ్డులో చీకటివేళల్లో ప్రయాణించి ఆస్తులను పరులపాలు చేసుకునే బదులు పట్టణాల్లో బ చేసి ఉండడం మేలని పలువురు భావిస్తున్నారు. ఈ విషయం తెలియని పర్యాటకులు మాత్రం సరదా సంతోషాలతో చీకటి వేళల్లో ఘాట్‌రోడ్డులో ప్రయాణించి ఆస్తులు పొగొట్టుకుని లబోదిబోమంటున్నారు. ఈ మేరకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమై ఘాట్ రోడ్డులో దోపిడి దొంగల బెడదను నివారించేందుకు చర్యలు చేపట్టాలని ఉద్యోగులు వ్యాపారులు, పర్యాటకులు కోరుతున్నారు.
దళితుల పాక తొలగింపుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
* ఇరువర్గాలకు ఎస్‌ఐ కౌనె్సలింగ్
సబ్బవరం, జనవరి 21: మండలంలోని బోదువలస గ్రామంలోని ఎస్సీలబ్ధిదారుల ఆక్రమిత భూముల్లో ఎల్లపు గంగమ్మ(60) అనే వృద్ధురాలు నిర్మించుకుంటున్న కమ్మల పాకను తొలగించి ఆమెను తీవ్రమైన చలిగాలులకు గురిచేశారనే ఆరోపణపై సబ్బవరం పోలీసులకు ఎస్సీ,ఎస్టీఅట్రాసిటీ కేసు నమోదుకు జిల్లాదళిత చైతన్యసేవా సంఘం అధ్యక్షుడు గొల్లపల్లిప్రభాకర్ ఫిర్యాదు చేశారు. సోమవారం ఎస్‌ఐ పల్లాపైడియ్య తెలిపిన వివరాల ప్రకారం బోదువలస సర్వేనెంబర్-29లో కొన్ని దళిత కుటుంబాలు ప్రభుత్వ బంజరుభూమిని ఆక్రమించుకుని పశువుల పాకలు, నివాసం ఉండేందుకు కమ్మల పాకలు నిర్మించుకుంటుండగా ఆర్‌ఐ, ఆరిపాక విఆర్‌వో అగ్రకులాల ప్రలోభాలకు లొంగి దళితుల పాకలను కూల్చారని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. ఈ గ్రామానికి విఆర్‌వో, ఆర్‌ఐ మరొకరు ఉండగా, సంబంధం లేని ఆర్‌ఐ, విఆర్‌ఒ ఉద్ధేశ్యపూర్వకం దళితుల ఇళ్లపై దాడిచేసి దూషించారని పేర్కొంటూ ఎస్సీ,ఎస్టీఅట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎస్‌ఐ పల్లాపైడియ్య దళితుల తరపున సంఘం జిల్లాఅధ్యక్షుడు ప్రభాకర్‌తో, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్‌ఐ,విఆర్‌ఓతో సోమవారం కౌనె్సలింగ్ నిర్వహించారు. తాము పాకలు కూలగొట్టిన మాట వాస్తవమని ఆర్డీవో,ఎంఆర్‌ఒ ఆదేశాల మేరకు వెళ్లామని ఆర్‌ఐ సుధీర్, విఆర్‌ఒ కామరాజు అంగీకరించారు.
నిజానికి తాము ఆ గ్రామ పరిధిలో ఆర్‌ఐ,విఆర్‌వోలం కాదని ఒప్పుకున్నారు. దీంతో ప్రభాకర్ స్పందిస్తూ సంబంధం లేని అధికారులు అక్కడికి వెళ్లినప్పటికీ ఆక్రమణల్లో ఉన్న అందరివి తొలగించకుండా దళితుల పాకలు తొలగించటమేమిటని? ప్రభుత్వమే నిరుపేద దళితుల కోసం ప్రైవేటు భూములను కొని పంపిణీ చేస్తున్న సంగతి తెలియదా? అని ప్రశ్నించాడు. తాను ఈ విషయంలో అధికారుల కంటే ముందు డిఆర్‌ఒ వద్దఉత్తర్వులు తీసుకువచ్చి పత్రికల్లో ప్రకటించినప్పటికీ రెవెన్యూ అధికారులు కక్ష సాధింపుచర్యలకు పాల్పడటం అన్యాయమన్నారు.
దళితులకు చట్టాలే రక్ష అంటూ మీరు ఈవిషయంపై కేసు నమోదు చేయకపోతే ఎస్పీని ఆశ్రయిస్తామన్నారు. ఎస్‌ఐ మాట్లాడుతూ అనకాపల్లిడిఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని, ఈలోగా రెవెన్యూ అధికారుల తరపున కౌంటర్ ఇవ్వాలని అన్నారు.
‘కాఫీ’ నిధుల స్వాహాపై చర్యకు రాస్తారోకో
* ఉన్నత స్థాయి విచారణకు గిరిజన సంఘం డిమాండ్
పాడేరు, జనవరి 21: విశాఖ మన్యంలో జరిగిన కాఫీ నిధుల స్వాహా వ్యవ హారంపై ఉన్నత స్థాయి విచారణ