శ్రీకాకుళం, జనవరి 21: ఉద్యమాల పురిటిగెడ్డగా భాసిల్లిన సిక్కోలు నేతలు సారధ్యంలో ఉత్తరాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమైక్యాంధ్ర ఆవశ్యకతను కాంగ్రెస్ పెద్దలకు తెలియజేసేందుకు హస్తినకు సోమవారం చేరుకున్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో తెలంగాణ వాదానికి ధీటుగా సమైక్యాంధ్ర ఆవశ్యకతను పార్టీ అధిష్టానానికి తెలియజేసినట్లు తెలిసింది. అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దని మోతిల్లాల్ వారా, వావిలార్వ్రి, దిగ్విజయ్‌సింగ్ వంటి ముఖ్యనేతలను కలిసి సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించారు. మంత్రి ధర్మానతోపాటు జిల్లాకు చెందిన మరో మంత్రి కోండ్రు మురళీమోహన్, విశాఖ జిల్లా నుంచి గంటా శ్రీనివాస్, ఉభయగోదావరి జిల్లాల నుంచి మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీ పెద్దలతో భేటి అయినవారిలో ఉన్నారు. ఈ నెల 28వ తేదీ తరువాత తెలంగాణ అనుకూల ప్రకటన వస్తుందన్న పుకార్లు షికార్లు చేయడంతో సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించేందుకు ఇక్కడ నేతలంతా నిర్ణయించుకున్నారు. రాజకీయాలకతీతంగా వివిధ కార్యక్రమాలను చేపట్టేందుకు ఐక్య కార్యాచరణ రాజకీయపక్షాలతో కలిసి రాజకీయ ఐకాసను ఏర్పాటు చేయడం సమైక్యాంధ్ర జాగృతి పేరుతో ఒక సంస్థను స్థాపించి వివిధ కార్యక్రమాలు చేపట్టనున్న అంశాలపై ఇప్పటికే మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ఢిల్లీకి పరుగులు తీయడంతో ఉద్యోగ, విద్యార్థి సంఘాలు కూడా పూర్తిస్థాయిలో ఉద్యమంలోకి అడుగులు వేసేందుకు మరింత ఉత్సాహం కనబరుస్తున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాల్సిన ఆవశ్యకత, విభజిస్తే సీమాంధ్ర ప్రజలకు ఎదురయ్యే సమస్యల గూర్చి కోర్‌కమిటీ పెద్దలకు ఉదాహరణలతో వీరు వివరించినట్లు తెలిసింది. నీటిజలాలు విషయంలో ఎదురయ్యే ఇబ్బందులు, ప్రాంతాలవారీగా వాటిల్లే నష్టాలు, తదితర అంశాలను వివరించగా వారు కూడా సానుకూలంగా స్పందించినట్టు మంత్రి కోండ్రు మురళీమోహన్ ఆంధ్రభూమికి స్పష్టం చేశారు.
మేము సైతమన్న ఎన్జీవోలు
ఉద్యోగాల్లో సమైక్యభావన బాగా ఉందన్న విషయం చాటిచెప్పేందుకు వీలుగా రాష్ట్ర ఎన్జీవోల సంఘం ఉపాధ్యక్షులు చౌదరి పురుషోత్తంనాయుడు, జిల్లా అధ్యక్షులు హనుమంతు సాయిరాంలు సీమాంధ్రమంత్రుల బృందంతో కోర్‌కమిటీ ప్రతినిధులను కలిసి సమైక్య గళం వినిపించారు. ఇప్పటికే ఎపి ఎన్జీవో సంఘం నేతలు ఓ కార్యాచరణ సిద్ధం చేసి ఉద్యోగుల్లో సమైక్యభావన ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని వినిపించేందుకు సమాయత్తమయ్యారు. ఇక విద్యార్థులు కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న సంకల్పంతో సీమాంధ్ర జిల్లాల నుంచి పెద్దఎత్తున తెలంగాణ వాదానికి ధీటుగా సమైక్యాంధ్ర నినాదాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నారు.
2014 ఎన్నికల్లో రాహుల్ రోల్‌మోడల్
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జనవరి 21: దేశమంతటా మహిళా సాధికారత దిశగా కాంగ్రెస్ పార్టీ కృషిచేస్తున్నట్లు కేంద్ర ఐటి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి తెలిపారు. సోమవారం ఢిల్లీ నుండి వీడియోకాన్ఫరెన్సు ద్వారా ఇక్కడ రాజీవ్ ప్రజాసదన్‌లో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. మహిళా చట్టాలు పటిష్టంగానే ఉన్నప్పటికీ ప్రజలకు తెలియజేయడంలో విఫలమవుతున్నామన్నారు. మహిళా చట్టాలను కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ప్రచారం నిర్వహించే దిశగా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. దేశంలో మహిళపట్ల జరుగుతున్న హింస ఏపాటిదంటే 1,82,000 కేసుల ద్వారా తెలుస్తోందన్నారు. మహిళా సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచన చేసేందుకు ఏఐసిసి అధినేత్రి సోనియాగాంధికి ఈవిషయంపై జైపూర్‌లోని చింతన్ సదస్సులో తెలియజేసినట్లు ఆమె పేర్కొన్నారు. వీటిపై చట్టాలు పటిష్టం కావాల్సి ఉందని, పోలీస్ వ్యవస్థలో 20 లక్షల మంది పోలీసులు విధుల్లో ఉంటే వారిలో మహిళా పోలీసులు 70 వేల మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. మహిళల రక్షణకు ఈ సంఖ్య చాలదని, పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 50వేల పోలీసు స్టేషన్లు ఉండగా మహిళా పోలీస్‌స్టేషన్లు 240 ఉన్నాయని, అందులో 150 పోలీస్‌స్టేషన్లు తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్న విషయాన్ని గుర్తించాలన్నారు. అన్ని స్థాయిల్లో మహిళలకు రిజర్వేషన్లు వర్తింపజేసినట్లే దేశ వ్యాప్తంగా ఉన్న ఏఐసిసి, పిసిసి, డిసిసి వాటి అనుబంధసంఘాల్లో కూడా 30 శాతం మహిళలకు కేటాయించడం ద్వారా ఇతర జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుచేసినట్లే మహిళలకు వారికి కేటాయించిన నిధులు వారికే చెందేవిదంగా చట్టం చేయాల్సి ఉందని, తద్వారా నిధులు పక్కదారి పట్టకుండా మహిళలకు ఉపయోగపడటంతో సాధికారత దిశగా పయనించడానికి అవకాశముంటుందని తెలిపారు. మహిళల్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉందని, ఉన్నత విద్యలో 14 శాతం మంది మాత్రమే అక్షరాస్యులుగా మిగులుతున్నారని పేర్కొన్నారు. మొత్తం జనాబాలో చూసుకుంటే ఇది పది శాతం మాత్రమే ఉందని, ఆడపిల్లను చదివించి ఏం చేద్దాం అనే మీమాంసను వీడేందుకు ప్రాథమిక విద్య స్థాయినుండే మహిళలకు మరిన్ని స్కాలర్‌షిప్పులు ఇవ్వడం ద్వారా వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి అవకాశముంటుందన్నారు. రిజర్వేషన్ ఎక్కువ శాతం అమలు ద్వారా వారికి ప్రొఫెషనల్ కోర్సులు కల్పించినవారిమవుతామని తెలియజేశారు. ఈ దిశగా మహిళా సాధికారత సాధించేందుకు అడుగులు వేసే ప్రక్రియ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించుటకు అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నా తన నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజాసమస్యలను నేరుగా వీడియోకాన్ఫరెన్సు ద్వారా తెలుసుకుంటామని తెలిపారు. ఈ కాన్ఫరెన్సు జరిగేరోజు, సమయం ముందుగానే ప్రజలకు తెలియజేస్తామని ఆమె తెలిపారు. రానున్న ఎన్నికల్లో రాహుల్‌గాంధీ రోల్‌మోడల్‌గా నిలువనున్నారని చింతన్ సదస్సులో అతని ఆలోచనా విధానం యువతకు భరోసాగా నిలిచిందనడంలో సందేహం లేదని అన్నారు. రాహుల్‌గాంధీ శిక్షణలో ఎన్‌ఎస్‌యుఐ ఎలా పటిష్టం అయిందీ తెలిసిందేనని, అలానే పార్టీ బలోపేతానికి అతని కృషిని కొనియాడారు. సుస్థిర విధానంతో పాటు సుస్థిరమైన అభ్యుదయ పాలన తీసుకురాగల సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఒక ప్రశ్నకు సమాధానంగా తాను ఎప్పుడూ సమైక్యవాదినే అన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణకు
ప్రజలు ముందుకు రావాలి
శ్రీకాకుళం (టౌన్), జనవరి 21: గ్రామాల్లో ప్రజలు పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య నిర్వహణకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో డయ ల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సోంపేట నుండి జోగి కృష్ణారావు ఫోన్ చేసి గ్రామ పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యత తమకు అప్పగించాలని కోరగా వెంటనే స్పందించిన కలెక్టర్ సంతోషం వ్యక్తం చేస్తూ ఇలా గ్రామ ప్రజలు స్వచ్ఛందగా ముందుకు వచ్చిననాడు గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయని హర్షం వ్యక్తం చేశారు. వెంటనే వారికి గ్రామ పంచాయతీ నిధులు సమకూర్చుటకు అధికారిక ఒప్పందాన్ని కుదుర్చుకొనుటకు జిల్లా పంచాయతీ అధికారిని పంపిస్తానని అన్నారు. వీరఘట్టాం మండలం వండువ నుండి సత్యంనాయుడు మా ట్లాడుతూ పాఠశాల భవనాన్ని నిర్మించామని ఏడాదిగా బిల్లు మంజూరు చేయతేదని ఫిర్యాదు చేశారు. వంగర మండలం సీతంపేట నుండి జే.శ్రీనివాసరావు ఫోన్ చేసి జమ్ము అప్పలమ్మకు అభయ హస్తం పింఛను నిలిచిపోయిందని తెలియజేయగా పునరుద్ధరణకు పంపించామని చెప్పారు. పలాస లక్ష్మిపురం నుండి ఆర్. ఈశ్వరమ్మ ఫోన్ చేసి ఇళ్ల స్థలం కావాలని కోరగా ఇళ్లు మంజూరు అయితేనే ఇళ్ల స్థలం ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డిఆర్‌డిఏ పిడి పి.రజనీకాంతారావు, హౌసింగ్ పిడి వై.ఎస్.ప్రసాద్, డిఎస్‌వో నిర్మలాభాయి, జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.
నిష్పక్షపాతంగా వ్యవహరించండి
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జనవరి 21: సహకార ఎన్నికల నిబంధనలను పాటిస్తూ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఎన్నికల అధికారులను జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో సహకార ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులు, పోలీసు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార ఎన్నికలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల విషయంలో ఎటువంటి వివాదాలకు తావివ్వకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో 49 పిఎసిఎస్, ఒక రైతు సేవాసహకార సంఘానికి వెరసి 50 సహకార సంఘాలకు ఎన్నికలు జరుగనున్నట్లు తెలిపారు. 1,54,234 మంది ఓటర్లు నమోదయ్యారని, 644 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నట్లు వివరించారు. షెడ్యూల్డ్ కులాల వారికి 50, షెడ్యూల్ కులాల మహిళలకు 50, షెడ్యూల్ తెగల వారికి 44, వెనుకబడిన తరగతుల వారికి 100, ఇతరులకు 230, ఇతరులలో మహిళలకు 170 రిజర్వేషన్ స్థానాలను కేటాయించినట్టు తెలిపారు. ఎన్నికలు నిర్వహించే పోలింగ్ కేంద్రాలను అధికారులు ముందుగా పరిశీలించుకోవాలని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా సరిచేసుకోవాలని సూచించారు. ఎక్కడైన సమస్య ఉన్నట్లయితే సంబంధిత డివిజనల్ సహకార అధికారితో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌తో పాటు ఓటర్ల జాబితాను కూడా సంబంధిత కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తుగా ఒక్కో కేంద్రానికి 20 వేల రూపాయల నిధులను మంజూరు చేయాలని జిల్లా సహకార అధికారి డా.బి.శ్రీహరిరావును ఆదేశించారు. ఎన్నికల సామాగ్రిని ముందుగా ఎన్నికల అధికారులకు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో జెసీ పోలా భాస్కర్ మాట్లాడుతూ ఎన్నికల అధికారులు ఎన్నికల ప్రక్రియపై అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు జెసీ ఆర్.ఎస్.రాజ్‌కుమార్, అడిషినల్ ఎస్పీ బి.డి.వి.సాగర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి కైలాస్‌గిరీశ్వర్, డిఆర్‌డిఏ పి.డి రజనీకాంతరావు, జిల్లా నీటియాజమాన్య సంస్థ పథకసంచాలకులు కల్యాణ్‌చక్రవర్తి, ఆర్డీఒ గణేష్‌కుమార్, దయానిధి, ఎన్నికల అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవంపై కలెక్టర్ సమీక్ష
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జనవరి 21: జిల్లాలో ఈ నెల 26న జరుగనున్న గణతంత్ర దినోత్సవ ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలపై కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజానీకానికి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. వేదిక ఏర్పాటు, మాక్ డ్రిల్, సాంస్క్రతిక కార్యక్రమాలు, శకటాల ఏర్పాటు, స్టాల్స్ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులకు సూచనలు ఇస్తూ ఆదేశాలు జారీచేశారు. కోడిరామ్మూర్తి స్టేడియం వద్ద విద్యార్ధులకు తాగునీటి సౌకర్యం, శానిటేషన్ మున్సిపల్ అధికారులు చూడాల్సి ఉంటుందన్నారు. సాయంత్రం బాపూజీ కళామందిర్‌లో నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులతో నిర్వహించాలన్నారు. స్టేడియంలో కార్యక్రమం ముగిసిన అనంతరం పట్టణంలో శకటాలను ప్రదర్శించాలని తెలిపారు. జనవరి 25న జరిగే జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని చెప్పారు.
అదే రోజు ఉదయం ఎన్టీ ఆర్ మున్సిపల్ హైస్కూల్ వద్ద మానవ హారం ఉంటుందన్నారు. అక్కడ నుండి అంబేద్కర్ ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించాలని సూచించారు. ఏజెసి ఆర్ ఎస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ జాతీయ ఓటరు దినోత్సవంలో బాగంగా ఓటుహక్కు ఆవశ్యకతపై మండల స్థాయిలో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. సమావేశంలో డీఆర్వో నూర్ భాషాఖాసిం, జడ్‌పి సీఈవో కైలాస్‌గిరీశ్వర్, డిఆర్‌డిఎ పిడి పి.రజనీకాంతారావు, ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
దొంగ సంతకాలతో రూ. 5.20 లక్షల స్వాహా
శ్రీకాకుళం (టౌన్), జనవరి 21: జిల్లాలో నిర్వహించిన ఉపాధి హామీ పథకం కింద వజ్రపు కొత్తూరు మండలం కొండవూరు పంచాయతీలో టేకుమొక్కల నిర్వహణకు రైతులకు చెందాల్సిన 5,20,000 రూపాయలు దొంగ సంతకాలతో అధికారులు కైంకర్యం చేశారని, వారిపై చర్యలు తీసుకొని తమకు డబ్బు ఇప్పించాలని మాజీ ఎంపిపి మద్దిల చిన్నయ్య ఆధ్వర్యంలో రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం వారు జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. వివరాల్లోకి వెళ్తే...కొండవూరు పంచాయతీకి చెం దిన రైతులు కొరగాన వాసు, డొక్కరి ఆమోజి, దట్టి సూర్యనారాయణ తదితర రైతులు సుమారు 52 మందికి 2011 సంవత్సరంలో పదివేల టేకు మొక్కలు ప్రభుత్వం అందజేసింది. వీటిని అటవీ శాఖ ఉత్పత్తి చేసినప్పటికీ పంచాయతీల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో వీరికి ఇవి మంజూరుచేసి మొక్క ఒక్కంటికి ఆరు రూపాయలు చెల్లించారు. ఇదిలా ఉండగా మొక్కల నిర్వహణకు గాను ఒక్కో మొక్కకు 55రూపాయలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ సొమ్మును రైతు ల సంతకాలను దొంగసంతకాలు చేసి అధికారులు కాజేసినట్లు వారు ఆరోపిస్తున్నారు.
ఇదెలా తెలిసిందంటే ఇటీవల అధికారులు రైతులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో బయటపడిందని, వెంటనే ఎంపిడివోను కలిసి ఫిర్యాదు చేశామని రైతులు పేర్కొంటున్నారు. ఎంపిడివో ఫిర్యాదుపై స్పందిం చి గ్రామంలో సభనిర్వహించి రైతుల వద్ద అభిప్రాయాలు సేకరించారని, అందులో కూడా తాము డబ్బు ముట్టనట్లు తెలిపినట్లు వారు చెబుతున్నారు. కలెక్టర్‌ను కలియగా డుమా పిడి రావాలని చెప్పారని, ఆయన వచ్చేంతవరకు వేచిచూస్తామన్నారు. తమకు రావాల్సిన సొమ్ము ఇప్పించడమే కాకుండా దీనికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని లేదంటే తాము ఆందోళన చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు.
* డబ్బులు వారికి అందని మాట నిజమే
టేకు మొక్కల నిర్వహణ సొమ్ము కొండవూరు రైతులకు అందని విషయం వాస్తవమేనని, ఇందులో ఎవరూ తప్పు చేయలేదని వజ్రపు కొత్తూరు మండలం మండల అభివృద్ధి అధికారి బంగారునాయుడు ఆంధ్రభూమికి తెలిపారు. డబ్బులు వారికి ఇస్తామని, ఇంకా బడ్జెట్ రిలీజ్ కాలేదని తెలిపారు.
గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ
శ్రీకాకుళం (టౌన్), జనవరి 21: జిల్లా కలెక్టర్ ఫిర్యాదుల విభాగానికి వినతులు వెల్లువెత్తాయి. సోమవారం కలెక్టర్ సౌరభ్‌గౌర్, డీఆర్వో నూర్‌భాషా ఖాసింలు నిర్వహించే గ్రీవెన్స్‌కు 330 వినతులు అందాయి. నెల్లిమర్ల యంఐయంయస్ నర్సు ట్రైనింగు కేంద్రంలో శిక్షణ పొందుతున్న శ్రీకాకుళంనకు చెందిన యం.లలితకు సిక్కోలు చిరుదివ్వెలు నుండి పదివేలు రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు. మొండేటి వీధికి చెందిన పార్వతి తన భర్త అప్పుల బాధభరించలేక మరణించారని ఉపాధి కల్పించాలని వేడుకోగా ఆయాగా నియమిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సంతబొమ్మాలి మండలం గంటపేట గ్రామానికి చెందిన జీరు రామారావు మస్కట్‌లో పనిచేస్తూ కారుప్రమాదంలో మరణించిన జీరు లక్ష్మి కుటుంబ సభ్యులకు ఏడు లక్షల రూపాయల చెక్కును కలెక్టర్ అందజేశారు. జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామానికి చెందిన కొమనాపల్లి సూరమ్మ ఇందిరమ్మ ఇంటి బిల్లు చెల్లించలేదని ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ ఫిర్యాదును వెంటనే పరిష్కరించాలని పిడిని ఆదేశించారు. పొందూరు మండలానికి చెందిన నలుగురు ఎస్సీ కులస్తులకు మంజూరైన నిర్మాణపనులు పూరె్తై ఏడాదిన్నర కావస్తున్నా బిల్లు మంజూరుచేయలేదని, సమస్య పరిష్కరించాలని కోరుతూ వైకాపా నాయకులు పద్మజ వినతి పత్రం అందజేశారు.
సాంఘిక సంక్షేమ శాఖలో, బిసి సంక్షేమ శాఖలో పదోన్నతులు జాప్యం చేస్తున్నారని వసతి గృహ అధికారులు వినతిపత్రం సమర్పించగా సంబంధిత ఫైలు వెంటనే తీసుకురావాలని డిడిని కలెక్టర్ ఆదేశించారు. గ్రీవెన్స్ విభాగంలో జడ్‌పి సి ఈవో కైలాస్ గిరీశ్వర్, ఐసిడియస్ పిడి, హౌసింగ్ పిడి, సాంఘిక సంక్షేమ, బి.సి. సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
అత్యాచారం ఫిర్యాదుపై ఒకరి అరెస్టు
రాజాం, జనవరి 21: రాజాం పోలీసు సర్కిల్ పరిధిలోని వంగర మండలం కోదులగుమడ గ్రామంలో పదేళ్ళ బాలికపై అత్యాచార ఆరోపణపై 60 ఏళ్ళ వృద్ధుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రాజాం సిఐ శ్రీనివాసచక్రవర్తి వివరాలు వెల్లడించారు. తండ్రి చనిపోవడంతో తల్లి కూలీగా చెన్నైకు వలస వెళ్ళింది. దీంతో బాలిక మేనత్త పర్యవేక్షణలో రాజాం ఆర్‌సిఎం పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది. కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు డిసెంబర్ 31న వంగర మండలం కోదులగుమడ గ్రామంలోని మేనత్త ఇంటికి వచ్చింది. వారి ఇంటి పక్కనే ఉన్న చిలక సంగమేసు(60), బాలికకు మాయమాటలు చెప్పి ఇంటిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. దీనిపై బాలిక మేనత్త, ఇరుగుపొరుగు వారు గ్రామ పెద్దల సమక్షంలో నిలదీయగా అత్యాచారం చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. సమాచారం తెలియడంతో తల్లి గ్రామానికి చేరుకుని బంధువుల సాయంతో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు విచారణ చేసి నిందితుడిని అరెస్టు చేసి రాజాం కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరు పరిచారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం రిమ్స్‌కు తరలించామని సిఐ తెలిపారు. ఈ సమావేశంలో సిఐతో పాటు వంగర ఎస్‌ఐ సూర్యనారాయణ ఉన్నారు.
ప్రతీ పౌరుడు ఓటరుగా నమోదు కావాలి
ఇచ్ఛాపురం, జనవరి 21: 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్క పౌరుడు ఓటరుగా నమోదుకావాలని డిప్యూటీ కలెక్టర్ కె.వి.రమణమూర్తి తెలియజేశారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి విచ్చేసిన ఆయన కళాశాలల ప్రిన్సిపాళ్లు, రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల జాబితా ఉంచాలని, దానిలో చేర్పులు, మార్పులతో పాటు కొత్తవారిని కూడా చేర్పించాలన్నారు. చర్యలు తీసుకోవాలని ఎన్నికల డి.డి. సింహాద్రికి ఆదేశించారు. పాఠశాల విద్యార్థులకు పోటీపరీక్షలు నిర్వహించాలని, సీనియర్ నాయకులకు సన్మాన కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు.
సమైక్యవాదంపై చర్చకు హాజరుకావాలి
ఇచ్ఛాపురం, జనవరి 21: ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలా, విడిపోవాలా అనే విషయంపై చర్చించేందుకు ఈ నెల 25న రాజమండ్రి వద్ద జరుగనున్న విస్తృతస్థాయి సమావేశానికి నాయకులు, మేధావులు హాజరుకావాలని జిల్లా కాం గ్రెస్ అధ్యక్షుడు నర్తు నరేంద్రయాదవ్ కోరారు. సోమవారం ఇచ్ఛాపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పార్టీలకతీతంగా ఉండవల్లి అరుణకుమార్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రం విడిపోయినట్లయితే ఫలితంగా ఏం చేయాలో అనే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్ర చరిత్ర, కళలు, సాహిత్యం మొదలగు విషయాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఐదువేల సంవత్సరాల కిందట తెలుగుభాష వరంగల్‌లోనే ఉద్భవించిందని, ప్రస్తుతం వేర్పాటువాదం కూడా అదే ప్రాంతంలో ప్రారంభంకావడంపై మేధావుల సూచనలు, సలహాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. దీనిని రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరూ పార్టీలకతీతంగా తమ భావాలను వ్యక్తపరచాలన్నారు.
‘పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానివే’
మందస, జనవరి 21: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు వై.ఎస్.రాజశేఖరరెడ్డివి కాదని, కాంగ్రెస్ ప్రభుత్వానివేనని ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు స్పష్టంచేశారు. సోమవారం మండల పరిషత్ సమావేశమందిరంలో అర్హులైన 1235 మందికి తెల్లరేషన్‌కార్డులు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన పేదప్రజలకు ఇందిరమ్మ సంక్షేమ పథకాలు రాజకీయాలకతీతంగా అమలుచేసిన ఘనత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిదేనన్నారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్, అభయహస్తం, వడ్డీలేని రుణాలు, 108, 104 సేవలు, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి పథకాలు ప్రతీ కుటుంబానికి వినియోగపడే విధంగా అందజేశామని తెలిపారు. దేశం పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అధోగతి చేశారని విమర్శించారు. పాదయాత్రలను ప్రజలు నమ్మరన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త నుండి నాయకుని వరకు స్వేచ్ఛాసమానత్వాలు ఉన్నాయన్నారు. కార్యకర్తలు సంక్షేమ పథకాల గూర్చి విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. రానున్న స్థానిక, సహకార ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని విజయానికి చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వరభూషణరావు, ఎంపిడిఒ మోహన్‌పట్నాయిక్, ఎం.ఇ.ఒ. శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మెట్ట కుమారస్వామి, కాంగ్రెస్ నేతలు హరిశ్చంద్రపాణిగ్రహి, బోరగణపతి, పురుషోత్తం, దానయ్య, దుర్యోదన, చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘బాల్య వివాహాలను నివారించాలి’
శ్రీకాకుళం(రూరల్), జనవరి 21: బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, దానిని నివారించాలని ఐసిడిఎస్ సి.డి.పి.ఒ. పి.చంద్రకళ పేర్కొన్నారు. జాతీయ బాలికాదినోత్సవాన్ని ఈ నెల 18 నుండి 24వ తేదీవరకు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం మండలంలో వాకలవలస గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ బ్రూణహత్యలు నేరమని, మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను కూడా చదివించాలని సూచించారు. బాలికల చదువుకు ప్రభుత్వం ప్రోత్సాహాలు అందిస్తోందన్నారు. బాలల రక్షణ కమిటీలు ఏర్పాటు చేసి వారికి రక్షణగా నిలుస్తున్నారన్నారు. బాల్య వివాహాల పట్ల ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలపై అపోహలను తొలగించారు. ఆడపిల్లకు 21, మగవారికి 25 ఏళ్లు వచ్చిన వరకు వివాహం చేసుకోరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీసర్పంచు బగాది వెంకటరమణ, సూపర్‌వైజర్ మంగమ్మ, కార్యకర్త కె.రాజులమ్మ, గ్రామస్థులు పాల్గొన్నారు.
సహకార ఎన్నికలకు చురుగ్గా ఏర్పాట్లు
పొందూరు, జనవరి 21: మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఈ నెల 31న జరుగనున్న పాలకవర్గ ఎన్నిక ప్రశాంతవాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల అధికారి, మండల తహశీల్దార్ ఎస్.దిలీప్‌చక్రవర్తి తెలిపారు. సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ తాజాగా ఎన్నికల నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేశారని స్పష్టంచేశారు. పొందూరు సహకార సంఘంలోని 13 ప్రాదేశిక నియోజకవర్గాల్లో 8,005 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. 1, 2, 3, 4 ప్రాదేశికాలు ఒ.సి. జనరల్‌కు, ఐదవ ప్రాదేశికం బి.సి. జనరల్‌కు, ఆరు ఒసి జనరల్‌కు, ఏడు ఒసి మహిళలకు, ఎనిమిది బి.సి జనరల్‌కు, తొమ్మిది, పది ఒ.సి. జనరల్‌కు, 11 ఎస్సీ జనరల్‌కు, 12 ఎస్సీ మహిళలకు, 13 ఎస్సీలకు రిజర్వేషన్ ప్రకారం కేటాయించినట్లు వివరించారు. 24 నామినేషన్ల స్వీకరణ, 25న పరిశీలన, 26న ఉపసంహరణ, 31న ఎన్నిక జరుగుతుందన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగే ఈ ఎన్నిక ఉదయం ఏడు గంటల నుండి రెండు గంటల వరకు జరుగుతుందని, రెండవ పూట ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.
మండలానికి అగ్నిమాపక కేంద్రం మంజూరు
పాతపట్నం, జనవరి 21: మండలానికి అగ్నిమాపక కేంద్రం మంజూరు కోసం ఎంతోకాలంగా పోరాటం చేయడంపై రాష్ట్ర అటవీ శాఖామంత్రి శతృచర్ల విజయరామరాజు కృషి మేరకు కేంద్ర మంజూరైంది. 40 లక్షల రూపాయల నిధులతో ఈ కేంద్ర నిర్మాణానికి వెచ్చించినట్లు తహశీల్దార్ సుధాసాగర్ తెలిపారు. ఈ మేరకు 252 సర్వేనంబర్‌లో సోమవారం స్థలపరిశీలన చేశామన్నారు. దీని ద్వారా మండలంతోపాటు పరిసర ప్రాం తాలకు అత్యవసర సమయంలో ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
విద్యార్థులకు నేత్ర పరీక్షలు
పొందూరు, జనవరి 21: ప్రాథమిక స్థాయి బాలబాలికల్లో దృష్టి కార్యక్రమం ద్వారా వారికి నేత్రపరీక్షలు నిర్వహించి దృష్టిలోపాలను సరిదిద్దే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఎం.ఇ.ఒ. విజయానందరావు అన్నారు. మండల వనరులకేంద్రంలో సోమవారం రాజీవ్ విద్యామిషన్, జిల్లా అంధత్వ నివారణ సంఘంలు ఏర్పాటు చేసిన దృష్టినేత్రవైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. దృష్టిలోపాల స్థాయిని గుర్తించి దాని నివారణకు మందులు, కళ్లద్దాలు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. శస్తచ్రికిత్స అవసరమైతే శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి పంపిస్తున్నారని తెలిపారు. మండలానికి సంబంధించి సోమ, మంగళవారాల్లో రోజుకు 350 మందికి పరీక్షలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఆప్తమాలజిస్టులు పద్మజ, మల్లిఖార్జున్, చంద్రశేఖర్, రామచంద్రరావులు ఈ నేత్ర పరీక్షను నిర్వహించారు. ఆర్వీఎం స్కూల్‌హెల్త్ ఆఫీసర్ గోవిందరావు, జిల్లా అంధత్వ నివారణ సంఘం కోఆర్డినేటర్ విజయనిర్మలలు పాల్గొన్నారు.