ఒంటరిగా ఉన్నావంటే వొంటికి మంచిది కాద’నే మాట ముమ్మాటికీ నిజమేనని తాజా అధ్యయనంలో తేలింది. ఒంటరితనం నిజంగా భరించలేనిది, దీనికి అలవాటైతే స్నేహితులు దూరమై జీవితం దుర్భరం కావడం మనం చూస్తుంటాం. ఒంటరితనం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుముఖం పట్టడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఒంటరితనంతో ఆలోచనలు అధికమై చురుకుదనం కోల్పోవడం కారణంగా శరీరంలో వివిధ వ్యవస్థలు సరిగా పనిచేయకపోవడం, ఫలితంగా ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. నలుగురితో కలిసి మెలసి తిరిగే వారికంటే ఒంటరిగా ఉన్న వాళ్లలో అనేక రోగ లక్షణాలు కన్పించాయని వారు విశే్లషిస్తున్నారు. కొన్ని రకాల ప్రోటీన్లు లోపిస్తే గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, అల్జీమర్స్, ఆర్థరైటిస్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి. ఒంటరితనంతో బాధపడే వారిలో ఇలాంటి ప్రోటన్ల లోపం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల శరీర ఆరోగ్య వ్యవస్థ క్రమంగా దెబ్బతింటుంది. వత్తిడి, ఒంటరితనం వల్ల రోగాల నుంచి అంత వేగంగా కోలుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి. మానవ సంబంధాలకు దూరంగా ఉండేవాళ్లు మానసిక సమస్యలతో పాటు అనారోగ్యాన్ని కూడా ఎదుర్కోక తప్పదు. ఇతరులతో తక్కువ స్థాయిలో సంబంధాలు కలిగిన వారు రోగ నిరోధక శక్తిలోనూ వెనుకబడి పోతున్నారని ఓహియో స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. ఊబకాయంతో బాధపడే మధ్య వయస్కులను, రొమ్ము క్యాన్సర్ నుంచి విముక్తి పొందిన వారిని సర్వే చేయగా ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. సామాజిక సంబంధాలు లేకపోవడం, ఒంటరితనంతో బాధ పడడం అనే కోణాల్లో లోతుగా అధ్యయనం చేశాక, పలువురిలో రోగ నిరోధక శక్తి మందగించినట్లు కనుగొన్నారు.
ఒంటరిగా
english title:
b
Date:
Thursday, January 24, 2013