అయితే ఆవిడ దాన్ని మీ కోసమే తెచ్చిందో, లేక, మిమ్మల్ని అపప్రథ పాల్జేయడానికి సంకల్పించిన వ్యక్తుల కోసం తెచ్చిందో చెప్పడానికి ఆవిడ యిప్పుడు లేదు.
ఆ కాలేజీకి సంబంధించిన పరికరాలు మీ కాలేజీలకి వచ్చాయి. ప్రిన్సిపాల్ రంగారావు గారితో కలిపి ఆ కాలేజీకి చెందిన ముగ్గురు అధ్యాపకులు హతులయ్యరు! లాయరుగారూ, మీరే ఈ నేర పరిశోధనలో ఉంటే ఏమని ఆలోచించేవారు?’’
లాయరు నిర్లిప్తంగా ఉండిపోయాడు. దాసుకేమనాలో తోచలేదు.
‘‘దాసుగారూ! మీరు గతంలోకి వెళ్లిచూస్తే కాని మీ మీద కక్ష ఎవరు సాధించదలచుకొన్నదీ చెప్పలేరు. మీరు యితర కాలేజీల వాళ్ళని- మీరన్న పోటీ తత్వంతోనే ఎవర్నైనా, ఎప్పుడైనా కాని దెబ్బతీస్తే మీ కాలేజీ పరువు ప్రతిష్ఠలు గంగపాలు చెయ్యడానికి ఈ కుట్ర చేసి ఉంటారని అనుకోవచ్చు’’
‘‘మీ ధోరణి మీద కాని అటువంటిదేమీ లేదని చెబ్తే వినిపించుకోరేమిటి? యితర కాలేజీలని మా స్థాయితో అధిగమించామే కాని, కుత్సితతంతోకాదు!’’
‘‘యిప్పటికే మీ సమయం చాలా తీసుకొన్నాను. అది మీకు వృధా అనిపించవచ్చును కాని, నాకు మట్టుకు చాలా సంగతులే తెలిసి వచ్చాయి. రేపు ఉదయం మీరందరూ రావాలి. కూడా నారాయణ మూర్తిగారి టైపిస్ట్‌నీ, నీలవేణినీ, నరసింహంగారి ఆఫీసు గుమాస్తానీ వెంటబెట్టుకొని రండి. వాళ్ళకి మీరు ఏ విధమైన కోచింగ్ యిచ్చినా నాకు అభ్యంతరం లేదు. అందర్నీ విడివిడిగా ప్రశ్నిస్తే, నిజాలు వాటంతట అవే బయటికి వస్తాయి. మీరు యిక్కడికి రాని పక్షంలో నేనే కాలేజీకి రావాల్సి వస్తుంది. మీ యిష్టం!’’ అన్నాడు రఘురాం.
‘‘మేమే యిక్కడకు వస్తాం, ఫర్వాలేదు!’’ అన్నాడు పురుషోత్తమదాసు రుసరుసలాడుతూ.
వాళ్ళు వెళ్ళిన తర్వాత కుమారస్వామి లోపలికి వచ్చాడు. ‘‘సోమవారం సాయంత్రం పార్వతి మన స్టేషన్‌ని వదిలినప్పట్నుంచీ ఆమెను గమనిస్తూనే ఉన్నాం. యిక్కణ్ణుంచి ఆమె తిన్నగా తన తల్లిగారి యింటికి పోయింది. చెల్లిని తీసుకుని శ్రీపతి గారింటికి రాత్రి తొమ్మిది ప్రాంతంలో చేరింది. తర్వాత యిల్లు కదిలి బయటకు రాలేదు. నిన్న మధ్యాహ్నం దాసుగారి కాలేజీకి వెళ్ళింది. కాలేజీ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసుకి వెళ్ళి వెంటనే బయటకు వచ్చేసింది. తర్వాత శ్రీపతిగారి యింటికి తిరిగి వచ్చేసింది. సాయంత్రం చెల్లితో రైతు బజారుకి వెళ్ళి, కూరలు కొనుక్కొని వచ్చింది. అటు తర్వాత మరెక్కడికీ కదలలేదు. యివ్వాళ సాయంత్రం కాస్మాపాలిటన్ క్లబ్‌కి వెళ్ళి, ఓ నాలుగైదు నిముషాల్లో బయటకు వచ్చేసింది’’.
‘‘ఈ రెండు రోజుల్లోనూ శ్రీపతిగారింటికి ఎవరైనా వచ్చారా?’’ రఘురాం ఆలోచిస్తూ అడిగాడు.
‘‘ఎవరూ రాలేదు. అక్కడా మీరు చెప్పినట్టుగా నిఘా ఉంచాం’’
‘‘నిఘా ఉంచినట్టు పార్వతికి కాని, కనకయ్యగారికి కాని అనుమానం రాకుండా ఉంచారా?’’
‘‘రెండిళ్ళ కావతల ఓ టీ బడ్డీ ఉంది. శ్రీపతిగారి యింటి గేటు స్పష్టంగా కనబడుతుంది. మా కాపు అక్కడ పెట్టాం’’.
‘‘రేపు ఉదయమే జైల్‌కి వెళ్ళి అక్కడికి మనం బదిలీ చేసిన అప్పల్రాజునీ, నాగరాజునీ యిక్కడికి తీసుకువచ్చి నాలుగో నెంబరు సెల్‌లో ఉంచండి. పారిపోకుండా, కట్టుదిట్టంగా తీసుకురాండి. నేను జైల్‌గారికి ఫోన్‌చేస్తాను. పనిలో పని పార్వతిని కూడా వేరుగా తీసుకు వచ్చి వేరు గదిలో కూర్చోబెట్టండి’’.
కుమారస్వామి గుడ్‌నైట్‌చెప్పి వెళ్ళిన తర్వాత, రఘురాం కుర్చీలోంచి లేచాడు.
డిసెంబరు పదిహేడు- గురువారం:
పురుషోత్తమదాసు, సర్వోత్తమరావు, నారాయణమూర్తి, నరసింహంలు ఓ పక్కగా ప్లాస్టిక్ కుర్చీలలో కూర్చున్నారు. పురుషోత్తమదాసు కాస్త ఎడంగా కూర్చున్న లాయరు కేసి మధ్యమధ్యలో గుర్రుగా చూస్తున్నాడు. మరో మూలగా నాలుగు కుర్చీలలో విశ్వనాథం, నారాయణమూర్తి టైపిస్ట్ కమల, నీలవేణి, నరసింహం ఆఫీసు గుమాస్తా హరి కూర్చున్నారు. రఘురాం అందరికీ కాఫీలు తెప్పించాడు.
‘‘దాసుగారూ! మీ కాలేజీల పరువు ప్రతిష్ఠల్ని దెబ్బతీయడానికి ఎవరో కుట్ర పన్నారన్నారు. మీరు యాజమాన్యం వహిస్తున్నా, మీకు తెలియని అనేకమైన విషయాలుండొచ్చు. మీ కాలేజీల నిత్య వ్యవహారాలన్నిటినీ ఎవరు చూస్తారు?’’ రఘురాం ప్రశ్నించాడు.
‘‘ప్రతి కాలేజీకి ప్రిన్సిపాళ్ళున్నారు. మొత్తం అన్ని సంస్థల పర్యవేక్షణ కోసం అడ్మినిస్ట్రేటర్‌గా మా అబ్బాయి గోవర్థనదాసు వ్యవహరిస్తున్నాడు’’.
‘‘ప్రతి కాలేజీకి ప్రిన్సిపాళ్ళున్నారు. మొత్తం అన్ని సంస్థల పర్యవేక్షణ కోసం అడ్మినిస్ట్రేటర్‌గా మా అబ్బాయి గోవర్థన్‌దాసు వ్యవహరిస్తున్నాడు’’.
‘‘ఆ పక్షంలో మీకు తెలియని చాలా విషయాలూ, విశేషాలూ ఆయనకి తెలుస్తాయి కదా? ఆయన్ని పిలవండి’’.
‘‘అసలు నిన్న మా సర్వోత్తమరావు బెయిల్ కోసం వచ్చినపుడే మా వాణ్ని తీసుకొద్దామనుకొన్నా. వాడింటికి ఫోన్‌చేస్తే ఏదో పనిమీద ఢిల్లీ వెళ్ళాడని కోడలు చెప్పింది’’.
‘‘ఏ పని మీద వెళ్ళిందీ మీకు తెలియదా?’’
‘‘జేగురుపాడులో మేము నిర్మించదలచుకొన్న యింజనీరింగ్ కాలేజీ క్లియరెన్స్ కోసం వెళ్ళాలని ఈ మధ్యన అన్నాడు. బహుశా ఆ పనిమీదే వెళ్లి ఉంటాడు’’.
‘‘ఎప్పుడు వెళ్ళాడో, ఎప్పుడు తిరిగి వస్తాడో మీ కోడలుకాని చెప్పిందా?’’
‘‘నేనూ అడగలేదు. ఆమే చెప్పలేదు.’’
-ఇంకాఉంది