మీరు ఏకాకులైపోవ తగదు. ఇకపైన ఋశ్యమూక పర్వతానికి అరుగు. సునిశిత బుద్ధిమంతుడు సూర్యసుతుడు సుగ్రీవుడు అను వానరాధిపుడు ఆ గిరిమీద వుంటాడు. అతడు తన పత్నిని, తన రాజ్యమును తన అన్న వాలిచే కోల్పోయాడు. అతడు శోకాతురుడు. కపిసేనలు అసంఖ్యాకముగా కలవాడు. అతనికి విశ్వాసము పుట్టించు.
ఉపకారము చెయ్యి. ఆ పయిని నీవు, అతడు లంకపై దండు వెడుతుంది. అతిసత్త్వుడు రావణుడిని ఆజిలో హతుడిని కావించు. నీ దేవిని సీతను కైకొను’’ అని సముచితంగా కార్యములు తెలియపలికి తన గురువు వాక్యం తలచుకొని ఆ క్షణమె అనలము దరికొల్పి తన శరీరాన్ని ఆ అగ్నికి ఆహుతి చేయ సంకల్పించుకొంది.
ఆ సమయంలో అంతరిక్షమందు ఇంద్రాది ప్రముఖ గీర్వాణులు మణిమయ దేదీప్యమాన విమానారూఢులై వీక్షిస్తూ వుండగా సనక సనందన నారద ముఖ్య మునీంద్రులు సంతోషపడుతూ వుండగా పరంధాముడు, పరమాత్ముడు, అవ్యయుడు, ఆద్యంత రహితుడు, రఘుకులాంబుధి చంద్రుడు రఘురామ చంద్రుని తన మదిని ధ్యానిస్తూ శబరి ప్రదక్షిణము చేసి అనలునిలో తన శరీరాన్ని వేల్చి దేవతలు కొనితెచ్చిన దివ్య విమానము అధిరోహించి దేవలోకానికి అరిగింది. దేవదుందుభులు ధిందిమి మ్రోగాయి.
అంత రమణీయ మూర్తులు రామలక్ష్మణులు అక్కడనుంచి వెడలి అనవరతా వాసమునిలోకము అయిన ఋశ్యమాకము కనుగొనిరి.
శ్రీరామాదులు ఋశ్యమూకమును చూచుట
త్రిజగములకు విభులైన రామలక్ష్మణుల రాక కాంచి చంచలమతితో ఉప్పొంగి ఆనందం పొంది నిరంతరమూ అలరారే అశ్రుపూరములా అనేరీతిగా సెలయేరులతో ఆ ఋక్యమూకల విలసిల్లుతూ వుంది. మేరు మందర హిమాలయ పతులను పరిహసించే నవ్వులా అనునట్లు సాంద్రముగా సానువుల ప్రకాశించే చంద్రకాంత శిలల ఛాయలతో విరాజిల్లుతున్నది. భూమండలంపయిన అరవిందాసనుడు పర్వతరాజ పట్టముకట్టి శిరస్సున చల్లిన సేసబ్రాలా అను రీతిని ఉన్నత శృంగాల తారలు ఒప్పుతూ వున్నాయి. తన్ను శరణుచొచ్చిన సుగ్రీవుడిని పరాభవించిన వాలి మీద మండుతున్న గతి సూర్యకాంతోపలములు ప్రకాశింపగా అతుల ప్రతాపోగ్రమయి వరలుతున్నది.
మెరుగులు కొమ్ములై ప్రకాశింపగా ఏతెంచి సానుతటాల నీలమేఘములు మందగజములుగా తలచి మలయు గజములతో శోభాయమానంగా తోస్తున్నది. మన్మథుడిని ఆనంగుని కావించిన పరమ శివుడు వౌళిని అలరే ఆకాశ గంగ అయి చక్కందనముల ఒప్పారి అక్కడ క్రీడించు హంసపంక్తులు చంద్రుడి శిరోమాలికలుగా శోభిస్తున్నవి. బహుశృంగముల భూరుహపల్లవములు తన జటాజూట సంపదయై అలరారు సిద్ధులు సాధ్యులు సేవించే సదా శివమూర్తి అని ఒప్పుతున్నది.
బలారి మున్నుగా కల అమరులు పాలకడలిని త్రెచ్చి పొందిన వస్తువులు అమృతపానోన్మత్తులై అక్కడ వుంచారా, చక్కని తావు కనుక మరచినారో లేక ఈగిరిమీద దాచి పెట్టినారా అన కల్పవృక్షములతో కామధేనువులతో దేవతాంగనలతో, వివిధౌషదములతో, చింతామణులతో, సంతాన తరువులతో ప్రకాశిస్తున్నది. అటువంటి మనోజ్ఞమయిన దానిని కనుకొని ఇనవంశవల్లభుడు చోద్యము పొందాడు. దానిని ఎంతగానో కొనియాడాడు. తమ్ముడు సౌమిత్రి తన్ను కొలిచిరాగా ఆ ఋశ్యమూకపర్వత సమీపంలో దట్టముగా పెరిగినిచ్చిన తోవల పువ్వులతో, నెత్తములతో కనుల విందు చేయు పంపా సరోవరానికి అరిగి, నియమ నిష్ఠలతో ఆ సరస్సున స్నానమాడి రామ విభుడు అంతటా పారచూచి విలసిల్లే ఒక మావితరువు ఛాయను అలసట తీర్చుకోసాగాడు. అపుడు లక్ష్మణుడు అన్నకు శైత్యోపచారాలు సల్పుతుండగా రామచంద్రుడు ఆ వృక్షాన్ని పరికించి వేడుకతో ఈ రీతి వచించాడు.
‘‘లక్ష్మణా! వనవాసం తుదకు వచ్చినది .’అంటూ రాముడు మాట్లాడబోయాడు.
-ఇంకాఉంది