సకల శాస్త్రాలు, వేదాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు భారతీయ సంస్కృతి అన్నీ తోటి మానవునికి తోడ్పడమని బోధించాయి. అలాగే పూజలు, నోములు, వ్రతాలు, యజ్ఞయాగాదులు మొదలగునవి సర్వమానవ సౌఖ్యానికి, ధర్మార్థసిద్ధికొరకే ప్రతిపాదించబడినాయి. ఆ సమయాలో చేసిన దానమువలన ఆ కర్తకు ఇహ పర సుఖ సాధనకు, ఉత్తమ గతులకు మార్గమని అంతర్భాగంగా చెప్పబడింది.
దానాలు ఎన్నో రకాలు. గోదానం, భూదానం, అన్నదానం సువర్ణ, రజత, ఘృత, వస్త్ర, విద్యా, ఛత్ర ఇలా చాలా రకాలు ఉన్నాయి. కాని విద్యాదానంవలన చెప్పేవారికున్నది తరగదు సరికదా వారి విద్య పెరిగి మరింత వ్యాప్తి చెందుతుంది.
మన పురాణాలలో ఎంతోమంది దానాలు చేసిన వారు ఉన్నారు. దధీచిని ఇంద్రుడు కోరితే తన ఎముకలనే దానం చేశాడు. కర్ణుడు ఇంద్రుడు అడిగిన వెంటనే సహజ కవచ కుండలాలను దానం చేశాడు. శిభి చక్రవర్తి డేగకు తన శరీరానే్న దానం చేశాడు. బలి చక్రవర్తి వామనుడు కోరగా తన సర్వస్వమును దానం చేసాడు. జీమూత వాహనుడు జీవానే్న దానం చేశాడు. దీనివలన మహాత్ములకు దానమివ్వదగని వస్తువంటూ లేదని తెలుస్తోంది.
ఒకసారి కర్ణుడు అభ్యంగన స్నానం చేస్తున్నాడు. ఒకప్రక్క వెండిగినె్న మరో ప్రక్క బంగారపుగినె్న ఉన్నాయి. ఇంతలో ఓ బ్రాహ్మణ వేషధారి అక్కడకు వచ్చి దానం అడిగాడట. అప్పుడు ఎడం చేతి ప్రక్కగానున్న బంగారపు గినె్నను తీసి ఆయనకు దానం ఇవ్వబోయాడట.
ఆ సమయంలో అక్కడే ఉన్న కృష్ణుడు అది చూసి బావా అది ఎడం చేయి. ఎడం చేతితో దానం చెయ్యవచ్చు అని అడిగాడు. వెంటనే కర్ణుడు బావా! అయ్యో ఇది ఎడమ చేయి, దానం ఇవ్వకూడదు, కుడి చేత్తో ఇవ్వాలని అనుకుని చెయ్యి మార్చుకోబోయే లోపల నా మనస్సు కూడా ఒక వేళ మారవచ్చు. కొసకు దానం ఇవ్వకపోవచ్చు. కాబట్టి దానం ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చివేయాలి కాని చేయి గురించి ఆలోచించకూడదన్నాడు.
ఒకనాడు సముద్ర స్నానానికి ద్రౌపది వెళ్లిందట. అప్పటికే అక్కడ స్నానం చేస్తున్న సాధుపుంగవుడు కనిపించాడు. అతడు ఎంతకీ నీటిలో నుండి రాలేక అవస్థ పడుతున్నాడు.
నీటి అలల తాకిడికి అతని కౌపీనం కొట్టుకుపోయింది. ఆ కారణంగా ఆ సాధువు నీళ్లలోనుండి బయటకు రాలేకపోతున్నాడు. అతని పరిస్థితి గమనించి ఆమె పైట కొంగులో కొంత చింపి ఆ సాధువుకి విసిరింది. ఆనాడు ఆమె చేసిన దానం కౌరవసభలో ఆమె మానాన్ని కాపాడిందంటారు పెద్దలు.
దానం చేసేదికూడా న్యాయార్జితమైనదిగా ఉండాలి. ఆ దానాన్ని కూడా యోగ్యులైనవారికే దానం చేయడం ఉత్తమం. మనం న్యాయంగా సంపాదించిన ధనంలో విధిగా కొంత దానం చేయాలి. అవసరాలకు మించి దాచుకోవడం మహాపాపం అని వేదాంగాలు చెబుతున్నాయి. దానం చేయనివాడు మరు జన్మలో దరిద్రుడుగా పుడతాడని మహర్షులు చెప్పారు.
ధనాన్ని దాచడం అంటే దానం చేయడమేకాని దాన్ని నిధిరూపంలో భూగర్భంలో నైనా మరో దానిలో ఎక్కడ దాచి చివరకు అది తేనెటీగలుకూర్చిన తేనెలాగా భూమీ శులపాలు చేరుతుంది కాని అది సద్వినియోగం అవదు. అంతేకాదు ఇచ్చేదానం ఎపుడూ గర్వంతోగాని, ఫలాన్ని ఆశించిగాని, నా కన్నా ఎవ్వరూ చేయలేరనిగాని, గొప్ప కొరకుగాని చేయకూడదు. అలా చేసిన దానం నిష్ఫలం. మంచిబుద్ధితో చేసిన దానం అయితేనే సత్ఫలితాన్ని ఇస్తుంది. సద్గతికి త్రోవను చూపుతుంది. కనుక అందరూ ఎంతోకొంత దానం చేయాలనేది శాస్త్ర వచనం.
మంచిమాట
english title:
j
Date:
Thursday, January 24, 2013