తిరుపతి, జనవరి 27: చిన్న రాష్ట్రాల ఏర్పాటు అభివృద్ధికి అనర్థదాయకాలని, సమైక్యతతోనే అభివృద్ధి సాధ్యమని శాప్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ రాజారెడ్డి, సమైక్యాంధ్ర వాకర్స్ అసోసియేషన్ గౌరవ చైర్మన్ పిసి రాయల్ అన్నారు. ఆదివారం సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటి శ్రీగోవిందరాజస్వామి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్ధానిక ఎస్‌జిఎస్ కళాశాల మైదానం నుండి సమైక్యాంధ్ర వాక్‌ను ప్రారంభించారు. ఎస్‌జిఎస్ కాలేజి నుండి ఎయిర్‌బైపాస్‌రోడ్డు, శంకరంబాడి విగ్రహం, ఆర్‌టిసి బస్టాండ్ ఎదుట వున్న తెలుగుతల్లి విగ్రహం వరకూ ఈ వాక్ సాగింది. ఈ సందర్భంగా సమైక్యాంధ్రకు అనుకూలంగా, విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభలో వాకర్స్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆంజనేయులు, పేరూరు సుధాకర్‌రెడ్డిలు మాట్లాడుతూ చిన్నరాష్ట్రాలతో ఎప్పుడు అభివృద్ధి సాధ్యం కాదని తేల్చి చెప్పారు. కొంత మంది స్వార్థపరులు చేస్తున్న కుట్రలో భాగమే విభజన అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం కుటిలయత్నాలు నిర్ణయాలు తీసుకుంటూ దేశాభివృద్ధి తిరోగమన పథంలో నడుస్తున్నదన్నారు. రాజారెడ్డి మాట్లాడుతూ ప్రశాంతంగా వున్న వాతావరణాన్ని అఖిలపక్షం, చర్చల పేరుతో మరో సారి చర్చలకు పిలిచి తేనే తుట్టెను కదిపిన పాపం కేంద్రందేనన్నారు. రాష్ట్రంలో పరిస్థితుల గురించి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సవివరంగా తెలియజేసిందన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కన్వీనర్ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ప్రభుత్వ ఉద్యోగులే నడిపిస్తున్నారని, సీమాంధ్రలో కూడా ఉద్యోగులు ముందుకు రావాలన్నారు. జిల్లా అధ్యక్షుడు కెవి ప్రసాద్, ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ పునాదుల్లేని ఉద్యమం తెలంగాణ అని, అది ఎన్నటికి విజయాలను అందుకోలేదని ఎద్దేవా చేశారు. కేసిఆర్ స్వార్థప్రయోజనాలకోసం విద్యార్థులను బలిదానాలకు గురి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ బి వెంకటలక్ష్మి, గురవయ్య, గోపీయాదవ్, ఎంఆర్ భారతి, సుబ్రమణ్యంరెడ్డి, పద్మనాభం, వేణు, ఉమా, లక్ష్మి, చిన్నపాణి, చంద్రకళ, భారతి, యశోద, తేజ్ ప్రకాష్, శ్రీనువాసులు తదితరులు పాల్గొన్నారు.
చిన్న రాష్ట్రాల ఏర్పాటు
english title:
c
Date:
Monday, January 28, 2013