ఆదిలాబాద్, జనవరి 28: జిల్లాలోని పోలీసుస్టేషన్ల రూపురేఖలు మార్చి ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు స్నేహభావంతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. సోమవారం జిల్లా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఫిర్యాదుల విభాగంలో పలువురి నుండి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. బోథ్ మండలం పొచ్చర గ్రామానికి చెందిన ఎ చంద్రమ్మ ఎస్పీకి ఫిర్యాదు సమర్పిస్తూ గత మూడు నెలల నుండి తన ఏకైక కొడుకు గంగారెడ్డి అన్నం పెట్టడం లేదని తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఇందుకు స్పందించిన ఎస్పీ బోథ్ సిఐ రాంగోపాల్‌రావుతో మాట్లాడి వెంటనే చంద్రమ్మ కొడుకును పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించి తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఆదేశించారు. అలాగే నార్నూరుకు చెందిన మెస్రం భారతి 1990 సంవత్సరంలో తన భర్త మెస్రం దత్తును అంకోలి గ్రామంలో పోలీసు ఇన్‌ఫార్మర్‌గా భావించి నక్సలైట్లు హత్య చేశారని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా, ఈ విషయంలో పూర్తి విచారణ చేసి కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్‌ఐబి అధికారులకు ఎస్పీ సూచించారు. ఇద్దర్ ఎఆర్ ఎస్‌ఐలు, ఇద్దరు కానిస్టేబుళ్ళు రైల్వేశాఖలో డిప్యూటేషన్ పూర్తి చేసినందుకు వారికి బెల్లంపల్లి, ఆదిలాబాద్ పోస్టింగ్ కల్పించారు. కాగా కానిస్టేబుళ్ళకు బాసర, రామకృష్ణకు బదిలీ చేశారు. అనంతరం ఎస్పీ త్రిపాఠి మాట్లాడుతూ స్టేషన్‌కు వచ్చిన వ్యక్తి నుండి ఫిర్యాదు స్వీకరించిన వెంటనే అతనికి రశీదు ఇవ్వాలని, కేసు పరిశీలనకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని అన్నారు. జిల్లాలో నమోదు అయిన కేసులను ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్‌లో సూచనలు ఇస్తున్నామని నూతన పోలిసింగ్‌ను మెరుగైన రీతిలో తీర్చిదిద్దేందుకు పోలీసు కళాబృందంతో చైతన్య సదస్సులు, టోల్‌ఫ్రీ నెంబర్లు పటిష్టం చేసి 24 గంటల పాటు సేవలను అందుబాటులో వుంచడం జరుగుతుందన్నారు. మహిళలకు 1091 హెల్ప్‌లైన్ లాంటి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదికారులు చంద్రశేఖర్ అవధాని, రవీందర్, ఎంఎ కరీం, టిడి నందన్, ఫిర్యాదుదారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలోని పోలీసుస్టేషన్ల రూపురేఖలు మార్చి ప్రజలకు పూర్తి స్థాయిలో
english title:
sp tripathi
Date:
Tuesday, January 29, 2013