జన్నారం, జనవరి 28: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై 3 సంవత్సరాలుగా తెలంగాణ జిల్లాలోని నాలుగున్నర కోట్ల మంది ప్రజలు నిరుద్యోగులు ఎదురు చూస్తున్నప్పటికీ, కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు పట్ల నిర్లక్ష్యం చేస్తుందని ఎఐఎస్‌ఎఫ్ ఖానాపూర్ నియోజకవర్గం ఇంచార్జి మామిడి తిరుపతి, ఎబివిపి లక్సెట్టిపేట్ బాగ్ కన్వీనర్ కొండపెల్లి మహేష్‌లు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో పై నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను వంచనకు గురి చేస్తుందన్నారు. సుమారు వెయ్యి మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినప్పటికీ కూడా ప్రభుత్వానికి ఏలాంటి పట్టింపులేదన్నారు. గత 3 సంవత్సరాల నుండి ఏదో ఒక సాకుచూపుతూ తెలంగాణ అంశాన్ని నీరుగార్చే విధంగా చేస్తుందన్నారు. తెలంగాణ జిల్లాలోని ప్రజలందరు ఏకతాటిగా వుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజల్లో గ్రామాలకు అనుమతించరాదన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు సీమాంధ్ర నాయకుల చేతిలో కీలు బొమ్మలు అయ్యారన్నారు. తెలంగాణ పట్ల సోనియాగాంధీ కూడా ఇంత వివక్ష చూపించడం సరైంది కాదన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని వంచిస్తుందన్నారు. ఇలాంటి చౌకబారు ప్రకటనలు చేయకుండా ఏకంగా తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తేనే రానున్న 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మనుగడ వుంటుందని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతుందని జోస్యం చెప్పారు.
ఇసుక అక్రమ రవాణా నిలిపి వేయాలి : టిడిపి
జన్నారం, జనవరి 28: మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఇసుక రవాణా చేస్తున్నారని, అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేయాలని టిడిపి మండల పార్టీ నాయకుడు జాడి వెంకట్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో కొందరు అక్రమంగా ఇసుక కుప్పలను డంప్‌లుగా చేసి ట్రాక్టర్ల ద్వారా అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మాత్రం ఇందిరమ్మ లబ్దిదారులకే ఇసుకను విక్రయించాలని అధికారులను ఆదేశించినా, ఇసుక అక్రమ రవాణా మాత్రం విచ్చల విడిగా సాగుతోందని ఆన్నారు. స్థానిక రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది సైతం అక్రమంగా ఇసుక తరలిపోతున్నా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా అధికారులు స్పందించి తమ తీరుమార్చుకొని అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, వాహనాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసుస్టేషన్‌లో జెఎసి నేతల ఫిర్యాదు
ఉట్నూరు, జనవరి 28: ప్రత్యేక రాష్ట్రం నెల రోజుల్లో ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన కేంద్ర హోంమంత్రి షిండేపై చర్యలు తీసుకోవాలని జెఎసి నేతలు సోమవారం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జెఎసి నేతలు సింగార భరత్, మర్సకోల తిరుపతి, రమేష్, రాంచందర్, సోఫియాన్ తదితరులు ఎస్‌ఐ సత్యనారాయణకు ఫిర్యాదు చేయగా రశీదు అందించి ఉన్నత అధికారులకు తెలియజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ 28న తేల్చి చెబుతామని ప్రకటించి ఆ తరువాత ఎప్పుడు ఇస్తామో తెలియదంటూ తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఇటువంటి వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించి ఆ తరువాత మాటమార్చడం బాధ్యతాయుతమైన పదవుల్లో వారికి తగదన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు పోరాడుతామన్నారు.