నిర్మల్ , జనవరి 28 : గత నెల 28న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిచన కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే నెల రోజుల్లోపు తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేస్తామని చెప్పి ఇప్పుడు దాటవేయడం సమంజసంకాదని, మాటతప్పిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రాంతంలో గుణపాఠం తప్పదని బిజెపి జిల్లా అధ్యక్షుడు రావుల రాంనాథ్ హెచ్చరించారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చేది తెచ్చేది తామేనంటూ మొదటి నుంచి చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవ్వకుంటే ఇంటిబాట తప్పదన్నారు. తెలంగాణ అంశాన్ని పక్కదోవ పట్టిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరపతలపెట్టిన సమరదీక్షకు తమను వెళ్ళకుండా పోలీసులు కట్టడి చేశారని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. రాబోయే రోజుల్లో జెఎసితో కలిసి తెలంగాణ కోసం ఉద్యమిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు పాకాల రాంచందర్, ఒడిసెల శ్రీనివాస్, ఎ.రాజేందర్, మెడిసెమ్మె రాజు, ఎన్.నరేందర్, సామ రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
ట్రిపుల్ ఐటి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
బాసర, జనవరి 28 : రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని బాసర ట్రిపుల్ ఐటి యూనివర్సిటీలో సోమవారం విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు యూనివర్సిటీ ఓఎస్‌డీ, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంక్రాంతి సెలవులకని తన స్వంత గ్రామమైన మెదక్ జిల్లా మునిపెల్లి మండలం ఎదులాపురం వెళ్ళి ఆదివారం సాయంత్రం యూనివర్సిటీకి చేరుకున్న ప్రభుదాస్ అనే విద్యార్థి తన వసతి గృహంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఆత్మహత్య చేసుకుంటున్న విషయాన్ని ఫోన్ ద్వారా స్నేహితులకు తెలపడంతో యూనివర్సిటీలోని స్నేహితులు అధికారులకు సమాచారం అందించి యూనివర్సిటీలోని ఆసుపత్రిలో వైద్య సేవలను అందించారు. మెరుగైన వైద్యం కోసం విద్యార్థినిని నిజామాబాద్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బాసర ఎస్.ఐ జి.సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హోంగార్డు వైఫల్యం వల్లే...
సెలవుల అనంతరం యూనివర్సిటీకి తిరిగి వచ్చే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీచేయాల్సిన సెక్యూరిటీ సిబ్బంది అవేమి పట్టించుకోకపోవడంతోనే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు యూనివర్సిటీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాను కనిపెడితే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని పలువురు పేర్కొంటున్నారు.
మరో విద్యార్థి అదృశ్యం...
బాసర ట్రిపుల్ ఐటి యూనివర్సిటీలో పీ యూసీ రెండవ సంవత్సరం విద్యనభ్యసించే నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కారెగాం గ్రామానికి చెందిన ఎం.లక్ష్మన్ అనే విద్యార్థి సంక్రాంతి సెలవులకని యూనివర్సిటీ నుండి బయలుదేరాడు. పండుగ ముగిసినప్పటికీ ఇంటికి చేరుకోకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు యూనివర్సిటీకి వచ్చి వాకబు చేశారు. యూనివర్సిటీ అధికారులు లక్ష్మన్ 12వ తేదీనే ఇంటికి బయలుదేరినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయని చెప్పడంతో వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రైతు సంక్షేమం కోసమే పాదయాత్రలు
* గిట్టుబాటు ధర లభించే వరకు ఉద్యమాలు
* నిర్మల్‌కు చేరిన రైతు చైతన్య యాత్ర
నిర్మల్, జనవరి 28: దేశానికి అన్నం పెట్టే అన్నదాత నేటి పాలకుల వైఖరి వల్ల అన్నమో రామచంద్రా అనే పరిస్థితిని కల్పిస్తున్నారని కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అంజిరెడ్డి అన్నారు. సోమవారం రైతుల సమస్యలపై చేపట్టిన రైతు చైతన్య(కిసాన్‌సంఘ్) పాదయాత్ర నిర్మల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానికులు పాదయాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మార్కెట్ కమిటీలో రైతులనుద్దేశించి మాట్లాడుతూ రైతులను అన్ని రంగాల్లో చైతన్యం చేసేందుకే తాను ఈ పాదయాత్రలను చేపట్టామన్నారు. రాజకీయాలకతీతంగా రైతులంతా సంఘటితమై సమస్యలను పరిష్కరించుకునేందుకు పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అన్ని రకాల పంటలపై పెట్టుబడులు పెరిగిపోయినప్పటికీ కనీస మద్దతు ధరలు లభించకపోవడం వల్ల ప్రతీ సంవత్సరం నష్టాలను చవిచూడక తప్పడంలేదన్నారు. అప్పుల బాధలు భరించలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కంటి తుడుపు చర్యలతో పాలకులు కాలం వెళ్ళదీస్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా పాలకులు పనిచేస్తున్నారని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను పూర్తిగా ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు. వ్యవసాయ రంగానికి కోత లేకుండా నిరంతరంగా విద్యుత్‌ను అందించాలని డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలు నిండిన ప్రతీ రైతుకు రూ.2వేల జీవన భృతిని ఇవ్వాలని అన్నారు. మార్చి 29 వరకు జరిగే పాదయాత్రలో ఊరూరా రైతులను చైతన్యం చేస్తామని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. పాదయాత్రల బృందంలో రాష్ట్ర గో సంరక్షణ ప్రముఖ్ డాక్టర్ కె.నారాయణరెడ్డి, మనోహర్‌రెడ్డి ఉన్నారు.