* జిల్లా అంతటా తెలంగాణ నిరసనలు
* కోర్టుల విధుల బహిష్కరణ
* దిష్టిబొమ్మల దగ్ధం
ఆదిలాబాద్, జనవరి 28: తెలంగాణ అంశంపై కేంద్రం అనుసరిస్తున్న నాన్చుడు ధోరణిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా తెలంగాణవాదులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఈ నెల 28లోగా తెలంగాణ అంశాన్ని తీల్చేస్తానని గతంలో ప్రకటించిన కేంద్ర మంత్రి షిండే వైఖరిపై నిరసిస్తూ ఆజాద్ నాన్చుడు ప్రకటనను నిరసిస్తూ జిల్లా అంతటా తెలంగాణవాదులు ర్యాలీలు, ధర్నాలతో దిష్టిబొమ్మలు దహనం చేశారు. సీమాంధ్ర నేతల ఒత్తిడికి తలొగ్గి తెలంగాణ ప్రకటనపై జాప్యం చేస్తున్నారని ఆగ్రహిస్తూ సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్ డివిజన్‌లలో టిఆర్‌ఎస్, బిజెపి, న్యూడెమోక్రసి, జెఎసి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రాష్ట్ర రాజధానిలో జెఎసి నిర్వహిస్తున్న సమరదీక్షకు తరలి వెళ్తున్న 50 మంది తెలంగాణవాదులను ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఇక కాంగ్రెస్ నేతల రాజీనామా లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జెఎసి కన్వీనర్ మహేంద్రనాథ్, కారింగుల దామోదర్ స్పష్టం చేశారు. గల్లీ స్థాయి నుండి ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకువెళ్తామని కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పడం ఖాయమని ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. ఇదిలా వుంటే తెలంగాణ అంశానికి ఏలాంటి డెడ్ లైన్ లేదని మూడు ప్రాంతాల నేతలతో సంప్రదించిన పిమ్మటే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి ఆజాద్ ప్రకటించడాన్ని తప్పుబడుతూ నిర్మల్‌లో న్యూడెమోక్రసి కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి ఆజాద్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీకి కట్టుబడకుండా షిండే, ఆజాద్‌లు మోసం చేయడాన్ని నిరసిస్తూ సోమవారం ఉట్నూరు జెఎసి ఆధ్వర్యంలో పోలీసుస్టేషన్‌లో కేంద్ర మంత్రులపై చీటింగ్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఇక ఆదిలాబాద్‌లో తెలంగాణ జెఎసి, టిఆర్‌టియు, ఉద్యోగ జెఎసి, టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. తెలంగాణకు అడ్డుపడుతున్న సీమాంధ్ర నాయకులను తెలంగాణలో తిరగనివ్వ వద్దని, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వెంటనే పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి దిగాలని వారు డిమాండ్ చేశారు. ఇక టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్దం కావాలని కెసిఆర్ ఇచ్చిన పిలుపుమేరకు పార్టీ శ్రేణులు మంగళవారం నుండి జిల్లాలో తమ ఉద్యమానికి పదును పెట్టేందుకు సిద్దం అవుతున్నారు. ఎమ్మెల్యేలు అరవింద్‌రెడ్డి, కావేటి సమ్మయ్య, జోగు రామన్న, ఓదేలు ఉద్యమకార్యాచరణ, భవిష్యత్తు ఆందోళనలపై పార్టీ శ్రేణులతో చర్చించారు. కాగా సోనియాగాంధీ, ఆజాద్, షిండే అనుసరిస్తున్న వైఖరిపై నిరసిస్తూ బార్ అసోసియేషన్లు కోర్టు విధులు బహిష్కరించి ఎక్కడికక్కడే దిష్టిబొమ్మలు దహనం చేశాయి. ఆదిలాబాద్, లక్సెట్టిపేట్, మంచిర్యా, నిర్మల్ కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఇక రాష్ట్రం వచ్చేదాక న్యాయవాదులు ముందుండి పోరాడుతామని బార్ అసోసియేషన్లు నిర్ణయించుకున్నాయి. మంచిర్యాలలో బిజెపి ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఇచ్చిన హామీని విస్మరించిన కాంగ్రెస్ నేతలకు బుద్ది చెప్పాలని ప్రజలకు విన్నవించారు. హైదరాబాద్‌లోని సమరదీక్షకు వెళ్తున్న తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేశారు. రామకృష్ణాపూర్‌లో 15 మంది, బెల్లంపల్లిలో 6, నిర్మల్‌లో ముగ్గురు, ఆదిలాబాద్‌లో 8 మంది, నేరడిగొండలో దాదాపు 5గురు ఇలా జిల్లా మొత్తం మీద 50 మంది వరకు తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఓయు విద్యార్థి జెఎసి ఇచ్చిన మంగళవారం బంద్ పిలుపునేపధ్యంలో పోలీసులు జిల్లా అంతటా బందోబస్తు ముమ్మరం చేశారు.