కంచికచర్ల, జనవరి 29: కృష్ణా జిల్లా అల్లుడు చంద్రబాబుకు ఎట్టకేలకు నాలుగు రోజుల పాటు విడిది చేసే అవకాశం లభించింది. నిమ్మకూరుకు చెందిన ప్రముఖ సినీనటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబు 1978లో వివాహం చేసుకున్నారు. నాటినుండి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం, పలు పదవుల్లో ఉండటం, తదితర కారణాల వల్ల అత్తవారి ఇల్లు అయిన కృష్ణా జిల్లాలో మూడురోజుల పాటు నిద్రచేసే అవకాశం ఆయనకు లభించలేదు. ‘వస్తున్నా... మీకోసం’ పాదయాత్ర సందర్భంగా ఈ నెల 25న రాత్రి కంచికచర్ల ఒసి క్లబ్‌లో విశ్రాంతి తీసుకున్నారు. 26న కంచికచర్ల నుండి పరిటాల వరకూ కొద్దిదూరం పాదయాత్ర చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఒత్తిడి మేరకు 26న రాత్రి నుండి మంగళవారం వరకూ పరిటాల సమీపంలోని గ్రీన్‌వే బ్రిక్స్ కంపెనీ ఆవరణలో మకాం చేసి ఉన్నారు. ఆయనతో పాటు ఈ నెల 26 నుండి భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ కూడా ఇక్కడే ఉన్నారు. దీంతో 33సంవత్సరాల వివాహ జీవితం తరువాత ఏకబిగిన అత్తగారి జిల్లా కృష్ణాలో మంగళవారానికి నాలుగు రోజులు రాత్రి సమయంలో బస చేసే అవకాశం ఆయనకు లభించింది. మరో రెండు రోజులు చంద్రబాబు ఇక్కడే ఉండనున్నారు. దీంతో అత్తవారింట ఆరురోజులు నిద్ర చేసే అవకాశం అనారోగ్య కారణాల వల్ల ఆయనకు లభించినట్టయంది!
చంద్రబాబుకు నేతల పరామర్శ
కంచికచర్ల, జనవరి 29: కంచికచర్ల మండలం పరిటాల వద్ద విడిది చేసి ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని పలు జిల్లాల నాయకులు మంగళవారం పరామర్శించారు. ఈ నెల 25నుండి చంద్రబాబు అనారోగ్య కారణాల వల్ల బస్సులోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నెల 31వరకూ ఇక్కడే విశ్రాంతి తీసుకోనున్నారు. మూడు రోజులుగా చంద్రబాబును చూసేందుకు ఎవ్వరినీ అనుమతించకపోవడంతో నాయకులు ఎవ్వరూ ఈ వైపు తొంగి చూడలేదు. మీడియాలో దీనిపై వార్తలు వెలువడటంతో మంగళవారం ఉద యం నుండి పలువురు నాయకులు పరిటాలకు చేరుకున్నారు. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, గన్నవరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, చోటామోటా నాయకులు విజయవాడ అర్బన్ నుండి గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీ తదితరులు వచ్చి చంద్రబాబును కలిసి పరామర్శించారు. విజయవాడకు చెందిన బుద్దా వెంకన్న తన కుమార్తె వివాహానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు సతీసమేతంగా మంగళవారం సాయంత్రం ఇక్కడకు వచ్చా రు. మంగళవారం ఉదయం చంద్రబాబు విడిదిలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబు ఆరోగ్యం ప్రస్తు తం నిలకడగా ఉందన్నారు. ఐదు రోజులుగా విశ్రాంతి తీసుకోవడంతో అటుఇటు బస్సులోనే నడుస్తూ వ్యాయామం చేస్తున్నారన్నారు. ముందు అనుకున్న ప్రకారమే ఈ నెల 31 సాయంత్రం చంద్రబాబు పాదయాత్ర పునఃప్రారంభం అవుతుందని ఆయన వివరించారు.