తోట్లవల్లూరు, జనవరి 29: మండలంలోని రొయ్యూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి ఈ నెల 31న జరగనున్న ఎన్నికల్లో రాజకీయ పార్టీలు రసవత్తర పోరుకు సిద్ధమయ్యాయి. దీంతో మంగళవారం సాయంత్రం నుంచి నాయకుల హడావుడి మొదలైంది. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి మోర్ల రామచంద్రరావు స్వగ్రామమైన రొయ్యూరులో సహకార ఎన్నికలను కాంగ్రెస్ నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉమ్మడిగా ఇండిపెండెంట్ పేరుతో ఒకే ప్యానల్‌ని రంగంలోకి దించటం ఆసక్తికరంగా మారింది. పిఎసిఎస్‌లో ఎక్కువ సంఖ్యలో బీసీల ఓట్లు ఉండటంతో కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఆర్థికంగా బలవంతుడైన గౌడ సామాజిక వర్గం నుంచి లుక్కా వెంకటనారాయణను బరిలోకి దింపాయి. సహకార సంఘంలో కేవలం 263 ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇందులో గౌడ సామాజిక వర్గం రైతుల ఓట్లు సుమారు 180కి పైగా ఉన్నట్టు కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు చెపుతున్నారు. ఈ ఓట్లను దృష్టిలో పెట్టుకుని వెంకటనారాయణను అధ్యక్షుడిని చేస్తామంటూ ఆ రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీకి నిలిపాయి. తెలుగుదేశం నుంచి బహిష్కృతుడైన జిల్లా టిడిపి బిసి సెల్ మాజీ కార్యదర్శి లుక్కా వెంకట శ్రీనివాసరావు సైతం వెంకటనారాయణ గెలుపు కోసం పని చేస్తున్నారు. మోర్ల రామచంద్రరావు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అన్ని వర్గాలను కలుపుకుని పనిచేస్తున్నారు. 12వ వార్డులో పోటీలో వున్న తన భార్య గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ తరపున రైతు కడియాల వెంకట సుబ్బారావు, మండల టిడిపి ప్రధాన కార్యదర్శి లుక్కా రేణుకారావు తదితరుల ప్యానెల్ పోటీ చేస్తోంది. కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపి ఉమ్మడిగా పోటీ చేస్తుండటంతో టిడిపి నాయకులు సైతం వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తున్నారు. ఆ రెండు పార్టీలు అనైతిక పొత్తులకు దిగారని ప్రచారం చేస్తున్నారు.
31న 144 సెక్షన్
ఈ నెల 31న సహకార ఎన్నికలు జరగనున్న మండలంలోని రొయ్యూ రు, భద్రిరాజుపాలెం గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 144 సెక్షన్ విధిస్తున్నట్టు తహశీల్దార్ ఎం బాబూరావు మంగళవారం తెలిపారు. 31న ఉదయం 7నుంచి రాత్రి 7గంటల వరకు ఆ రెండు గ్రామాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. కనుక ప్రజలు సహకరించాలని కోరారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
మచిలీపట్నం , జనవరి 29: శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అందరూ పోలీసులకు సహకరించాలని బందరు రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి పల్లంరాజు అన్నారు. బందరు మండల పరిధిలో ఈ నెల 31న జరగనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ ఎన్నికల్లో పోటీ పడుతున్న వివిధ పార్టీల అభ్యర్థుల సమావేశాన్ని మంగళవారం ఆయన బందరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించారు. మండల పరిధిలోని 11 సంఘాల్లో ఆరు ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన ఐదు సంఘాలకు ఈ నెల 31న ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గొడవలకు పాల్పడే వ్యక్తులపై చట్టబద్ధంగా కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు భావిస్తే డెప్యూటీ ఎన్నికల అధికారి కాళికాదేవికి ఫిర్యాదు చేయవచ్చన్నారు. సమావేశంలో రూరల్ ఎస్‌ఐ జివివి సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ సిఐ వీరయ్యగౌడ్, అభ్యర్థులు పాల్గొన్నారు.
సొసైటీ ఎన్నికలకు భారీ బందోబస్తు
అవనిగడ్డ, జనవరి 29: స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయం పరిధిలోని దాదాపు పది సొసైటీలకు సంబంధించి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సిఐ రమణమూర్తి తెలిపారు. 50మంది పిసిలు, 71మంది హోంగార్డులను ఎన్నికల బందోబస్తుకోసం నియమించినట్లు ఆయన తెలిపారు. పోలీస్ సిబ్బందిని మంగళవారం సాయంత్రం సమావేశపర్చి ఎన్నికల నిర్వహణ, బందోబస్తు విషయంలో పోలీసులు వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు.
కోరుకొల్లు సొసైటీ ఎన్నికలు వాయిదా
కలిదిండి, జనవరి 29: మండలంలోని కోరుకొల్లు సహకార సంఘం ఎన్నికలను ప్రభుత్వ ఆదేశాల మేరకు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి ఎల్ శ్రీనివాసరావు నాయకులు, రైతుల సమక్షంలో మంగళవారం ప్రకటించారు. గ్రామానికి చెందిన చలమలశెట్టి శ్రీనివాసరావు ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఎన్నికలు వాయిదా వేస్తున్నామని ఆయన తెలిపారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని వివరించారు.
సందేశాత్మక చిత్రాలకే ప్రాధాన్యం
పెనుగంచిప్రోలు, జనవరి 29: యువతకు ఆదర్శంగా ఉండే చిత్రాలకే దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రముఖ సినీ దర్శకుడు కృష్ణ వంశీ అన్నారు. మండల కేంద్రంలో వేంచేసి ఉన్న ధర్మపురి లక్ష్మీనర్శింహస్వామి వారి ఆలయాన్ని, శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయాన్ని మంగళవారం ఆయన దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి ప్రసాదాలు అందించారు. అనంతరం ముండ్లపాడు గ్రామంలో వైఎస్‌ఆర్‌సిపి మండల కన్వీనర్ గూడపాటి శ్రీనివాసరావు ఇంట్లో ఆగిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ త్వరలో ప్రముఖ హీరో నాని, హీరోయిన్ సమంతలతో ఒక సందేశాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. వైఎస్‌ఆర్ సిపి నాయకులు గూడపాటి రవికుమార్, బండ్లమూడి రామారావు, గూడపాటి చెన్నకేశవరావు పాల్గొన్నారు.