విజయవాడ, జనవరి 29: రాష్ట్రంలో పాదయాత్ర సాగిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నగరంలోకి ఎప్పుడు అడుగిడతారో తెలియదుగానీ పార్టీశ్రేణులు సమధికోత్సాహంతో పోటాపోటీగా చంద్రబాబు విభిన్న ముఖ చిత్రాలతో కూడిన బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు పార్టీ పతాకాలతో నగరాన్ని ఎల్లో సిటీగా మార్చేసారు. నగర ప్రధాన వీధులేకాదు మారుమూల ప్రాంతాల్లో సైతం ఏ వీధి చూసినా భారీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. తమ్ముళ్లు పోటాపోటీగా బహుళంతస్తుల భవనాలపై సైతం వీటిని ఏర్పాటు చేశారు. రోడ్లపై గోతులు తవ్వి మరీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అసలు గతంలో ముందెన్నడూలేని విధంగా అదీ ఏ పార్టీ కూడా ఇంతటి భారీ ఎత్తున ప్రచారం చేపట్టలేదు. త్వరలో నగరపాలక సంస్థ, శాసనసభ, లోక్‌సభ సాధారణ ఎన్నికలు జరుగనుండటంతో అగ్రనేతల నుంచి స్థానిక కార్యకర్తలు వరకు తమ ఆర్థిక స్థితికి తగ్గట్లు ప్రచారం చేపట్టారు. ఈ తీరు మొత్తంపై పాలకపక్ష కాంగ్రెస్ నేతలకు కంటగింపుగానే మారుతుంటే వైఎస్సార్ సిపి నేతలు తాము తీసిపోయామా అంటూ జగన్ ముఖ చిత్రాలతో వీధుల్లో బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాల పట్ట్భద్రుల శాసనమండలి ఎన్నికలకు సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు అయింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున తెలుగుదేశం పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు తొలగించాలంటూ అధికారపక్ష కాంగ్రెస్ నేతలు కలెక్టర్, ఎన్నికల ప్రధాన అధికారిపై ఒత్తిళ్ళు తెస్తున్నారు. దీనిపై ఏమి చేయాలనే దానిపై అధికారయంత్రాంగం మల్లగుల్లాలు పడుతున్నది. వాటిని తొలగిస్తే తెలుగుదేశం నుంచి వ్యతిరేకత రాగలదనే భయం కూడా వారిని వెంటాడుతున్నది. మరో వైపు ఈ బ్యానర్లు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కాల్గిస్తున్నాయనే విమర్శలు సైతం చెలరేగుతున్నాయి. వాస్తవానికి చంద్రబాబు యాత్ర ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగాల్సి ఉంది. అనారోగ్య కారణంగా బాబు పరిటాలలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అసలు బాబు నగరానికి ఎప్పుడు చేరతారు, ఆ బ్యానర్లను ఎంతకాలం కొనసాగించాలనే దానిపై పార్టీశ్రేణుల్లోనే చర్చ జరుగుతున్నది.
ప్రజలపై వేల కోట్ల రూపాయల భారమా..
* సిపిఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసన
పాయకాపురం, జనవరి 29: ప్రజలపై విద్యుత్ సర్‌ఛార్జీల పేరిట వేల కోట్ల రూపాయల భారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోపుతోందని సిపిఎం నగర కార్యదర్శి చిగురుపాటి బాబురావు విమర్శించారు. మరోసారి సర్దుబాటు చార్జీలను ప్రజలపై వేసే ప్రయత్నాలను మానుకోవాలని, 1059 కోట్ల రూపాయల భారం రద్దు చేయాలని కోరుతూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో బిసెంట్‌రోడ్డులోని అన్సారీ పార్కు వద్ద మంగళవారం వినూత్న నిరసన కార్యక్రమం జరిగింది. ఇప్పటి విద్యుత్ సర్‌ఛార్జీలతో ప్రజలు బాధలుపడుతుంటే మరోసారి సర్‌ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడం సిగ్గు చేటని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ విద్యుత్ బిల్లుకంటే అదనంగా 100 నుండి 500శాతం వరకు సర్‌ఛార్జీలు ఉండటంతో ప్రజలు భయపడుతున్నారని అన్నారు. మరోసారి 1059 కోట్లు సర్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం, విద్యుత్ కంపెనీలు సిద్దపడుతున్నాయని అన్నారు. ఇవి ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు కొనసాగుతాయని, ఏప్రిల్ నెలలో మరో సర్దుబాటు ఛార్జీల పేరుతో 12వేల కోట్ల రూపాయల భారం మోపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని మరోసారి మోసం చేసిందనీ, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఛార్జీలు పెంచడం జరగదని వాగ్ధానం చేసిందని, కాని అందుకు భిన్నంగా ఈ సంవత్సరం కరెంట్ ఛార్జీలు పెంచడమే కాకుండా సర్‌ఛార్జీల పేరుతో ఎప్పుడుపడితే అప్పుడు ప్రజలపై ఇప్పటికి 33వేల కోట్ల రూపాయల భారం ఈ ప్రభుత్వం మోపిందన్నారు. ఈ విధంగా ప్రజలపై వేలకోట్ల రూపాయల భారం మోపడం దారుణమన్నారు. మరో పక్క ల్యాంకో వంటి ప్రైవేట్ కంపెనీలు ల్యాంకో వంటి ప్రైవేటు కంపెనీలు లాభాలు గడిస్తున్నాయని, ప్రైవేట్ కంపెనీల లాభాల కోసం విద్యుత్ సంస్థలను ప్రభుత్వమే బలి చేస్తుందన్నారు. సర్‌ఛార్జీల వసూలు వలన సామాన్య ప్రజల జీవనం అస్థవ్యస్థం అవుతుందన్నారు. విద్యుత్ సర్ ఛార్జీల వసూలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకతాటి మీదికి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.వెంకటేశ్వరరావు, నగర కమిటీ సభ్యులు పి.సాంబిరెడ్డి, బి.నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ కె.శ్రీదేవి, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఆర్.రాజేష్, షాప్ ఎంప్లాయిస్ నాయకులు ఎం.సొబ్బయ్య, శ్రీహరి, వాసు, హాకర్స్ నాయకులు మురళీ, ఆటోవర్కర్స్ యూనియన్ నాయకులు బి.రూబెన్ తదితరులు పాల్గొన్నారు.