విజయవాడ, జనవరి 29: కృష్ణాడెల్టాకు వచ్చే ఖరీఫ్ సీజన్‌లో సకాలంలో సాగునీరందించటానికి వీలుగా వచ్చే జూన్ మాసాంతంలోపుగా పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయించగలమంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సోమవారం రాత్రి తనను కలిసిన అఖిలపక్ష రైతాంగ నేతలకు హామీ ఇచ్చారు. రైతాంగ నేతలు మాజీ ఎంపి డాక్టర్ యలమంచిలి శివాజీ, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, బందరు పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణ, రైతు నేతలు కొల్లి నాగేశ్వరరావు, ఎర్నేని నాగేంద్రనాథ్, మాజీ మంత్రి సీతాదేవి తదితరులు సిఎంతో డెల్టా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. గత కొనే్నళ్లుగా జూన్ మాసంలో ఏనాడు కూడా డెల్టాకు సకాలంలో సాగునీరందక ఖరీఫ్ సీజన్‌లో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నదంటూ వివరించారు. దీనికి తోడు సాగర్ జలాశయాల నుంచి నీటి విడుదలపై తెలంగాణా వాదుల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్నదన్నారు. డెల్టా రైతాంగం కష్టాలను గట్టెక్కించే లక్ష్యంతో 2004 అక్టోబర్ 15న చేపట్టిన పులిచింతల ప్రాజెక్టు ఏనాడో పూర్తి కావాల్సి ఉంటే ఇప్పటికీ గడువు ఏడుసార్లు పొడిగించబడిందని శివాజీ వివరించారు. దీనిపై సిఎం స్పందిస్తు ఇక ప్రతి 15 రోజులకోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పులిచింతల పనులను సమీక్షిస్తానని, ఆలస్యం జరిగితే కాంట్రాక్టర్‌లపై జరిమానా విధిస్తామని ఎలాంటి పరిస్థితుల్లోనూ జూన్ 30 లోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఆటో కార్మికుల జీవనాన్ని ఛిద్రం చేస్తున్న ప్రభుత్వం: సిపిఐ
పాయకాపురం, జనవరి 29: సిఎన్‌జి, డీజిల్ ధరలను పెంచడం ద్వారా ఆటో కార్మికుల పై పెనుభారం మోపి కార్మికుల జీవనాన్ని ప్రభుత్వం చిద్రం చేస్తుందని సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ విమర్శించారు. చలసానినగర్‌లోని సిద్దం కృష్ణారెడ్డ్భివన్‌లో మంగళవారం జరిగిన ఎఐటియుసి అనుబంధ విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ కనకదుర్గమ్మవారి వారధి ఆటో రిక్షా డ్రైవర్స్ సంక్షేమ సంఘం 16వ మహాసభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న శంకర్ మాట్లాడుతూ ఒకపక్క నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటి సామాన్యులకు ఒంటిపూట భోజనం కూడా లేకుండా చేస్తుంటే, మరోపక్క ప్రభుత్వం రకరకాల పన్నులు, ఛార్జీలను పెంచి మరింత భారం మోపుతుందని దుయ్యబట్టారు. డీజిల్ ధరల పెంపు వల్ల మరోసారి ఆర్టీసి బస్‌ఛార్జీలు పెరగనున్నాయని తెలిపారు. సాధారణ కార్మికులు, నిరుద్యోగులు జీవనోపాధికి ఆటోరిక్షాలను ఎన్నుకుని జీవనభృతి పొందుతున్నారని, సిఎన్‌జి గ్యాస్, డీజిల్ ధరలను పెంచడం ద్వారా ఆటోరంగం పై ఆధారపడిన కార్మికుల జీవనం మరింత దుర్భరంగా మారుతుందన్నారు. పెంచిన ధరలను తక్షణం తగ్గించడంతో పాటు ఆటోకార్మికుల శ్రేయస్సు కోసం సంక్షేమబోర్డుని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ శాసన సభ్యులు షేక్‌నాసర్‌వలి మాట్లాడుతూ ఆటోరంగం పై ఆధారపడి బతుకుతున్న వేలాదిమంది కార్మికుల పై మోయలేని విధంగా పెనుభారాలు మోపి వారి జీవనాధారాన్ని కాలరాయడం ప్రభుత్వానికి తగదని పేర్కొంటూ పెంచిన సిఎన్‌జి, డీజిల్ ధరలను తక్షణం తగ్గించాలని నగరంలో సిఎన్‌జి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచి కార్మికులకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు సంగులపేరయ్య, కార్మిక నాయకులు పుప్పలకోటేశ్వరరావు, బొక్కా ప్రభాకర్, డ్రైవర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు గోపి, కార్యదర్శి పెన్నాశ్రీను, ఉపాధ్యక్షులు రాంబాబు, సహాయ కార్యదర్శి బాషా తదితరులు ప్రసంగించారు.
ఆటో డ్రైవర్లందరికీ వ్యక్తిగత ప్రమాద బీమా
పారిశ్రామికవేత్త కోగంటి వితరణ
విజయవాడ, జనవరి 29: ఒక దురదృష్టకరమైన సంఘటన ఒక మనిషిలో మానవత్వాన్ని పరిమళింప చేస్తోంది. అదే సంఘటన ఆ మనిషిలో సరికొత్త ఆలోచనకు అంకురార్పణ చేసిందని చెప్పవచ్చు. ఆటోనడిపే పేద డ్రైవర్ ప్రమాదంలో మరణించిన విషాదాంతం ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యంను కలచివేసింది. ఆటోడ్రైవర్ మరణంతో ఓ నిరు పేద కుటుంబం వీధిన పడటంతో స్పందించిన కోగంటి ఈ నిర్ణయం తీసుకున్నారు. మనిషిగా జన్మించిన తాను తోటి వారికి తనవంతు కర్తవ్యంగా ఏదో ఒక సహాయం చేయాలనే సంకల్పంతో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆటో డ్రైవర్లందరికీ వ్యక్తిగత ప్రమాద బీమాను తన సొంత ఖర్చుతో తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ద్వారా గత నెల రోజుల్లో ఇప్పటికీ వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యాలను కల్పించారు. దీని వలన ఏదైన ప్రమాదంలో ఆటోడ్రైవర్ మరణిస్తే లక్ష రూపాయలు వరకు బీమా, గాయపడితే ఐదు వేలు, గాయపడి మంచంలో ఉంటే 108 వారాల పాటు నెలకు రూ. 2500లు చొప్పున నగదు అందుతాయి. అసలు ఇంతకీ సత్యంలో ఏర్పడిన స్పందనకు కారణమేమంటే.. 2012 డిసెంబర్ 31న వాంబేకాలనీకీ చెందిన ఆటోడ్రైవర్‌కు సింగనగర్ వద్ద బైక్ ఢీకొనడంతో ఆటోలో గ్యాస్‌లీకై మంటలు ఏర్పడి తీవ్రగాయాలకులోనయ్యాడు. గాయపడిన ఆటోడ్రైవర్ మృత్యువుతో పోరాడుతూ జనవరి ఒకటో తేదీన ప్రాణాలు వదలాడు. ఈ విషాద ఘనటతో చలించిన కోగంటి సత్యం వీరికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. కోగంటి ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో కూడా తనవంతు తోడ్పాడునందిస్తున్నారు.
సామాజిక కార్యక్రమాల్లోనూ బ్యాంకులు పాల్గొనాలి
ఇబ్రహీంపట్నం, జనవరి 29: బ్యాంకులు వ్యాపార లావాదేవీలతోపాటు వచ్చిన ఆదాయంలో కొంత సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేయాలని మైలవరం శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. ఇబ్రహీంపట్నం గాంధీబొమ్మ సెంటర్‌లో మంగళవారం 4 లక్షల మేరకు చిల్లర నాణేల కౌంటర్ ఆయన ప్రారంభించారు. ఆంధ్రాబ్యాంకు మేనేజర్ సుధాకరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకులు డిపాజిట్లు సేకరిస్తూ, ప్రభుత్వ పథకాల ద్వారా రుణాలు ఇచ్చి ఈ ప్రాంత ప్రజలకు సేవలు చేయాలని కోరారు. బ్యాంక్ నుండి వచ్చిన ఆదాయంలో కొంత సామాజిక సేవలకు ఉపయోగించాలని కోరారు. ఆంధ్రాబ్యాంక్ డి.జి.ఎమ్. గంగాధరరావు మాట్లాడుతూ ప్రజలు చిల్లర నాణేల కోసం పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఇబ్రహీంపట్నం బ్రాంచి నుంచి 4 లక్షల రూపాయల నాణేలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రీజనల్ బ్యాంకు ఆదేశాల మేరకు ఒక రూపాయి, రెండు రూపాయలు, పది రూపాయల నాణేలు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మల్లెల అనంత పద్మనాభరావు, జంపాల సీతారామయ్య, షేక్ హుసేన్, ఎన్.హరిప్రసాద్, చెన్నుబోయిన చిట్టిబాబు, జాస్తి శ్రీనివాసరావు, రామినేని రాజశేఖర్, నారాయణ, బ్యాంక్ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.