విజయవాడ , జనవరి 29: ఈ ఏడాది పదోతరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలు రూపొందించుకుని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ ఎం జ్యోతి విద్యాశాఖాధికారులకు సూచించారు. విద్యాశాఖలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రగతిపై మంగళవారం జిల్లా కలెక్టర్ విద్యాశాఖాధికారులు, రాజీవ్ విద్యామిషన్ అధికారులతో విద్యాశాఖ ద్వారా చేపడుతున్న పలు కార్యక్రమాలపై క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల్లో గత ఏడాది కంటే ఉత్తమ ఫలితాలు సాధించాలని, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఎంఇఓలు, డిప్యూటీ డిఇఓలు రానున్న రెండు నెలలు ప్రతిరోజూ పాఠశాలలను సందర్శించాలని, మండల ప్రత్యేక అధికారులు కూడా వారానికి ఒకసారి విధిగా పాఠశాలలను సందర్శించి ఎక్కువ సమయం విద్యార్థులతో గడపాలన్నారు. మంచి ఫలతాలు రాకుంటే ఉపాధ్యాయులతోపాటు ఎంఇఓలు, డిప్యూటీ డిఇఓ, డిఇఓలను బాధ్యులను చేసి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. విద్యార్ధులకు ఇప్పటికే సిలబస్ పూర్తి చేయడం జరిగిందని, సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు అదనంగా పాఠ్యాంశ తరగతులు నిర్వహించి మంచి ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా విద్యాశాఖాధికారి టి దేవానందరెడ్డి కలెక్టర్‌కు వివరించారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు సెల్‌ఫోన్ మాట్లాడితే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
నేటి నుండి ఉద్యోగులకు ఎన్‌జిఓ హోంలో
ప్రత్యేక ఆధార్ కార్డుల కేంద్రం
ఇంద్రకీలాద్రి, జనవరి 29: ఎన్‌జిఓ హోంలో ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ‘ఆధార్‌కార్డుల కేంద్రం’ ఏర్పాటు చేసినట్లు ఎన్‌జిఓ అసోసియేషన్ కార్యదర్శి మహ్మద్ ఇక్మాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్ కార్డుల కోసం ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారని ఈ విషయాన్ని గమనించి కృష్ణా జిల్లా కలెక్టర్‌కు దృష్టికి తీసుకెళ్లటంతో ఆయన వెంటనే స్పందించి ఉద్యోగుల కోసం గాంధీనగర్‌లో ఉన్న ఎన్‌జిఓ హోంలో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ ఏర్పాటు చేసినందుకు అసోసియేషన్ నాయకులు కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేంద్రం నేటి నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటలనుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుందని కార్యదర్శి తెలిపారు. ఉద్యోగులు వారి వారి నివాస ధ్రువీకరణ, వ్యిక్తిగత గుర్తింపుకార్డులను తీసుకొని వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఎన్‌జిఓలకు విజ్ఞప్తి చేశారు.