ఆదిలాబాద్, జనవరి 29: సంపూర్ణ ఆరోగ్యంతోనే సమాజాభివృద్ది చెందుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ అశోక్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ మండలంలోని యాపల్‌గూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన నట్టల నిర్మూలన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, మనం ఆరోగ్యంగా వున్నప్పడే అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతామన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్య సూత్రాలు తప్పకుండా పాటించాలన్నారు. కలుషిత వాతావరణం, కలుషిత ఆహారం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. జిల్లాలో అనేక మంది అనేమియా అనే వ్యాధి సోకి రక్తహీనతతో బాధపడుతున్నందున వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నట్టల నిర్మూలన కార్యక్రమం చేపట్టిందన్నారు. పోషకాహార లోపం వల్ల చిన్న పిల్లలు, స్ర్తిలు నట్టలతో బాధపడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం నట్టల నిర్మూలన మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తుందని కలెక్టర్ తెలిపారు. నట్టలను పారద్రోలుదాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదాలతో ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని అన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు నట్టల నిర్మూలన మాత్రలు తప్పకుండా వాడాలన్నారు. వాతావరణం కలుషితం కాకుండా వుండాలంటే ప్రతి ఇంటిలో మరుగుదొడ్లను వినియోగించుకోవాలన్నారు. ఆహారం తినే ముందు చేతులు పరిశుభ్రంగా కడుక్కొనే విధానాన్ని ప్రదర్శన చేసి చూపించారు. జిల్లాలో 0-5 సంవత్సరాల లోపు పిల్లలు 3.56 లక్షలు, 5-19 సంవత్సరాల వారు 8.99 లక్షలు, 19 సంవత్సరాల నుండి పైబడిన వారు 14.83 లక్షలు, మొత్తం 27.37 లక్షలు వున్నారని అన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు నట్టల నిర్మూలన మాత్రలు వేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. పోషకాహార లోపం వల్ల ఆహారం ఆజీర్ణమై నట్టలు పెరిగి రకరకాల జబ్బులు వస్తున్నాయని, వేడి పదార్థాలు భుజించి ప్రతి ఒక్కరు ఆరోగ్య సూత్రాలు పాటించి సంపూర్ణ ఆరోగ్యవంతులైనప్పుడే మెరుగైన విద్యాబుద్దులు అలవడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఓ డాక్టర్ మాణిక్యరావు, ఎస్‌ఎస్‌ఎ పిఓ వెంకటయ్య, డిఇఓ అక్రముల్లాఖాన్, డిఆర్‌డిఎ ఎపిడి పద్మభూషణ్‌రాజు, ఎంఇఓ జయశీల, హెచ్‌ఎం కౌసల్య, టి గంగన్న, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
* నట్టల నివారణ కార్యక్రమంలో కలెక్టర్ అశోక్
english title:
s
Date:
Wednesday, January 30, 2013