సహకార ఎన్నికల సంగ్రామం రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఆయా పార్టీల నేతలు పల్లెల్లో మకాం వేసి తమ అభ్యర్థుల గెలుపుకోసం వ్యూహాలు పన్నుతున్నారు. జిల్లాలోని 996 టిసిలకు 1733 నామినేషన్లు దాఖలు కాగా, నేటి నామినేషన్ల ఉప సంహరణ కోసం రాజకీయ ఒత్తిళ్ళు, బేరసారాలు జోరందుకున్నాయి.
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, జనవరి 29: రానున్న సాధారణ ఎన్నికలకు సెమిఫైనల్స్‌గా భావిస్తున్న సహకార సంఘాల ఎన్నికలు రాజకీయ పార్టీల్లో సవాళ్లను రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్దపడుతున్న ఆయా పార్టీల నేతలు పల్లెల్లో పట్టు పెంచుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రాదేశిక నియోజకవర్గాలు, సొసైటీ డైరెక్టర్ల పదవుల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దించేందుకు పోటాపోటీగా నామినేషన్లు వేయించారు. ఈ నెల 31న తొలి విడతగా జరిగే 38 సంఘాలకు, రెండవ విడత ఫిబ్రవరి 4న 39 సంఘాలకు జరిగే ఎన్నికల్లో సత్తా చాటుకొనేందుకు కాంగ్రెస్, టిఆర్‌ఎస్, టిడిపి, వైకాపాలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సంఘాల్లో రైతుల మద్దత కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నామినేషన్ల ఘట్టం పూర్తి కావడంతో బుధవారం జరిగే ఉప సంహరణపైనే ఆసక్తి నెలకొని వుంది. ఇప్పటికే మొత్తం జిల్లాలో 996 ప్రాదేశిక నియోజకవర్గాలకు 1733 నామినేషన్లు దాఖలు కాగా, 3 సహకార సంఘాలు, 75 ప్రాదేశిక నియోజకవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. కొందరు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేయడంతో ఓట్ల చీలికపై ప్రభావం చూపి తమ అభ్యర్థులు ఓటమికి దారి తీస్తాయన్న భయంతో నేతలు ఆయా గ్రామాల్లో అభ్యర్థులను పోటీ నుండి తప్పించేందుకు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. బేరసారాలతో మరి కొందరిని ఉప సంహరణకు ఒత్తిడి పెంచుతున్నారు. నామినేషన్ల ఉప సంహరణ గడువు బుధవారం విధించడంతో జిల్లాలో నేతల ఒత్తిళ్లతో భారీగానే అభ్యర్థులు పోటీ నుండి తప్పుకొనే అవకాశాలు అధికంగా వున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగు రామన్న టిఆర్‌ఎస్ తరపున తెలంగాణ నినాదంతో అభ్యర్థులను గెలిపించుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయగా, డిసిసి అధ్యక్షుడు సి రాంచంద్రారెడ్డి కాంగ్రెస్ తరపున, టిడిపి ఇంచార్జి పాయల శంకర్ తన మద్దతు దారులను గెలిపించుకొనేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. రెండవ విడతగా ఆదిలాబాద్ డివిజన్‌లో 17 సహకార సంఘాలకు 215 టిసిలకు జరిగే ఎన్నికల్లో సత్తా చాటుకొనేలా రాజకీయ నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. జిల్లాలోని ఆదిలాబాద్, రెబ్బెన, మంచిర్యాల, నిర్మల్‌లోని రైతు సేవా సహకార సంఘం, ఖానాపూర్ సహకార సంఘం ఎన్నికలు జిల్లా నేతల వ్యక్తిగత ప్రతిష్టకు సవాలుగా మారుతున్నాయి. నిర్మల్‌లో అతి పెద్ద రైతు సేవా సహకార సంఘంగా గుర్తింపు వున్న ఈ సంఘాన్ని హస్తగతం చేసుకొనేందుకు ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేయగా, ఆ నియోజకవర్గంలో పట్టున్న మాజీ ఎంపి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పోటాపోటీగా వ్యూహం రూపొందిస్తూ సత్తా చాటుకొనేందుకు తహతహలాడుతున్నారు. టిడిపి తరపున ఇన్‌చార్జి బాబర్ సైతం సర్వశక్తులొడ్డుతున్నారు. ఎపిపిఎస్‌సి కమిటీ సభ్యుడు పి రవీందర్‌రావు సైతం ఖానాపూర్‌లో సొసైటీని చేజిక్కించుకొనేందుకు తెర చాటు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తూర్పు జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులను ఏలాగైనా గెలిపించుకొని డిసిసిబి, డిసిఎంఎస్, డైరెక్టర్ల పదవుల్లో తన ఆధిపత్యాన్ని చాటుకొనేందుకు ఎమ్మెల్సీ కె ప్రేంసాగర్‌రావు సవాలుగా తీసుకోవడం గమనార్హం. అయితే కాగజ్‌నగర్ నియోజకవర్గంలో, నిర్మల్ నియోజకవర్గంలో మెజార్టీ స్థానాల్లో ఆధిపత్యం చాటుకొని పార్టీకి జీవం పోసేందుకు కోనేరు కోణప్ప, ఇంద్రకరణ్‌రెడ్డి ఎవరికి వారు పల్లెల్లో పాగా వేస్తూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సహకార ఎన్నికల రాజకీయం వేడెక్కుతున్న తరుణంలో జిల్లాలోని తలమడుగు మండలం ఝరి, తానూర్ మండలం బోసి గ్రామాల రైతులు మాత్రం తెలంగాణ ప్రకటించకుండానే ఎన్నికలు నిర్వహించడంపై అసంతృప్తివ్యక్తం చేస్తూ ఎవరిని నామినేషన్లు వేయనీయకుండా తమ పంతం నెగ్గించుకోవడం గమనార్హం.
* కాంగ్రెస్, టిడిపి, టిఆర్‌ఎస్ పోటాపోటీ * నిర్మల్, సిర్పూర్-టిపై వైకాపా దృష్టి * నేటి ‘ఉప సంహరణ’పై పెరిగిన రాజకీయ ఒత్తిళ్లు
english title:
s
Date:
Wednesday, January 30, 2013