నిర్మల్, జనవరి 29 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన అడ్డంకి అని ఆజాద్, షిండే వ్యాఖ్యలతో తేలిపోయిందని తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి వి.సత్యనారాయణగౌడ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్డీ ఓ కార్యాలయం ముందు గల జాతీయ రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో యూపీ ఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఫ్లెక్సీని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 28న అన్ని పార్టీలను పిలిపించిన కేంద్రం నెలలోపు స్పష్టమైన వైఖరిని తెలియజేస్తామని ప్రకటించి తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసిందన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే గ్రామాల్లో తిరగనీయమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ‘కాంగ్రెస్‌కు ఖతం కరో.. తెలంగాణ హాసిల్ కరో..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యూపీ ఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఫ్లెక్సీని దహనం చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న సీ ఐ బీ ఎల్ ఎన్ స్వామి, ఎస్సై శాంతారాంలు సంఘటనా స్థలానికి చేరుకొని నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా జే ఏసీ నాయకులు సోనియాగాంధీ ఫ్లెక్సీని దహనం చేశారు. అనంతరం పోలీసులు టీ ఆర్ ఎస్ నాయకులు, జే ఏసీ నాయకులను అరెస్టుచేసి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో టీ ఆర్ ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కె.శ్రీహరిరావు, నాయకులు యు.సభాష్‌రావు, పొడెల్లి గణేష్, అప్పాల గణేష్, శివాజి, పూదరి అరవింద్, తోట నర్సయ్య, టీవీవీ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, జే ఏసీ జిల్లా కన్వీనర్ కొట్టె శేఖర్, బీజేపీ నాయకులు పాకాల రాంచందర్, ఎస్పీ రవి, టీ ఆర్ ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
టి-మంత్రులు, ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలి
* బిజెవైఎం ఆధ్వర్యంలో టి-మంత్రులు, ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీల దగ్ధం
మంచిర్యాల, జనవరి 29: ప్రత్యేక తెలంగాణ కోసం నాలుగున్నర కోట్ల మంది ప్రజలు ఆకాంక్షిస్తూ ఉద్యమాలు కొనసాగిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, మంత్రులు పదవుల కోసం పాకులాడుతున్నారని, వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మమేకం కావాలని బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు తులా ఆంజనేయులు అన్నారు. మంగళవారం బిజెవైఎం ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో టిమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లెక్సీలను దగ్దం చేశారు. 28న తెలంగాణపై ప్రకటన చేస్తామని కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అఖిలపక్ష సమావేశంలో చెప్పడం జరిగిందని, ఇచ్చిన మాటను నిలుపుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మంత్రులు కొనసాగడం తెలంగాణ ప్రజలను అగౌరవపర్చినట్లేనని అన్నారు. వెంటనే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, మంత్రులు, పార్టీ నాయకులు రాజీనామా చేసి ప్రజా ఉద్యమాల్లో మమేకం కావాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారని, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లో చలనం లేదని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ కోసం టిమంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి అధిష్టానంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. 2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ మెనిఫెస్టోలో అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తామని పేర్కొని ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక తెలంగాణను నీరుగార్చే విధంగా చర్యలు తీసుకోవడం ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు తెలంగాణపై రోజుకో విధంగా వ్యాఖ్యనించడం సరికాదన్నారు. తెలంగాణపై కేంద్రం స్పష్టమైన వైఖరి వెల్లడించి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే చేపట్టాలన్నారు. తెలంగాణను ప్రకటించకుంటే కాంగ్రెస్‌కు రానున్న రోజుల్లో ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికే ఆ పార్టీ నాయకులు గ్రామాల్లో స్వచ్చంధంగా పర్యటించని పరిస్థితిని ఆ పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న వైఖరే ఇందుకు నిదర్శనమని అన్నారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు కళ్లు తెరిచి పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ కోసం ఐక్య ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. 28న మరోసారి తెలంగాణపై యుపి ఎ సర్కార్ మోసం చేసిందని, తెలంగాణలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు తెలంగాణపై ప్రకటన చేయించడంలో పూర్తిగా విఫలమయ్యారని, ఇందుకు నిరసనగా వారి ప్లెక్సీలను దగ్దం చేయడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు సీమాంధ్రులు ఎన్ని కుట్రలు వేసినా ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా వ్యవహరించే పాలక ప్రభుత్వాలు మట్టి కరువక తప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి, బిజెవై ఎం నాయకులు ప్రకాశ్‌శర్మ, పూసాల వెంకన్న, రవీందర్, మధు, మల్లేష్, లక్ష్మన్, మహేష్‌పారి పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలి
* ఎంపి రాథోడ్ పిలుపు
జన్నారం, జనవరి 29: కాంగ్రెస్ పార్టీ 2004లో గద్దెనెక్కి ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆదిలాబాద్ ఎంపి రమేష్ రాథోడ్ అన్నారు. మంగళవారం టిడిపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఎంపి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను మోసగిస్తూ పబ్బం గడుపుకుంటున్నారని తెలంగాణ అంశం పట్ల గత టిడిపి హయాంలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల సానుకూలంగా తెలుగుదేశం పార్టీ లేఖ అందించినప్పటికీ ప్రస్తుతం టిడిపి పార్టీ తెలంగాణ అంశం పట్ల స్పష్టమైన వైఖరి ప్రకటించడం లేదని తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. తమ పార్టీ పట్ల కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీలు కక్షసాధింపులు, ప్రచారాలు చేయడం సరైంది కాదన్నారు. టిడిపి తెలంగాణకు అనుకూలంగా వుందని, ప్రస్తుతం జరగబోయే వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో జిల్లాలోని చైర్మన్లుగా తమ టిడిపి అభ్యర్థులను గెలిపించుకోనున్నట్లు ఎంపీ ధీమావ్యక్తం చేశారు. అదే విధంగా మండలంలోని పొన్కల్, చింతగూడ సహకార సంఘం చైర్మన్ పదవులు తమ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకోనున్నట్లు ఎంపీ ధీమావ్యక్తం చేశారు. ఈ విలేఖర్ల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు కొంతం శంకరయ్య, జిల్లా, మండల నాయకులు తోకల సురేష్, జక్కుల సురేష్, శ్రీనివాసరావు, తాళ్లపల్లి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
జెఎసి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మల దగ్ధం
ఉట్నూరు, జనవరి 29: తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేయకుండా పదవులకు ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ మంత్రుల దిష్టిబొమ్మలను జెఎసి నేతలు మంగళవారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నేతలు కందుకూరి రమేష్, మర్సకోల తిరుపతి, కాటం రవీందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నెల రోజుల్లో తెలంగాణ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మాటమార్చడం, తెలంగాణ మంత్రులు సైతం ఈ విషయంలో మరుమాట్లాడకుండా విమర్శలు గుప్పించడం సరికాదన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని, మంత్రులు సైతం కృషి చేయాలని అన్నారు. పదవులు పట్టుకొని వేలాడే వారికి తెలంగాణవాదులు బుద్ది చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు కొండేరి రమేష్, సోఫియాన్, భరత్, లక్ష్మీపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అభ్యర్థుల గెలుపు గురించి ఎంపి రమేష్ ఆరా
ఇంద్రవెల్లి, జనవరి 29: సహకార సంఘాల ఎన్నికలు జరుగుతున్న కారణంగా పార్టీపరంగా ఎన్నికలు జరగక పోయినా, ఈ ఎన్నికల్లో టిడిపి పార్టీ తరపున ఎన్నికల పోటీలో నిలిచిన అభ్యర్థుల గెలుపు గురించి స్థానిక ఎంపీ రాథోడ్ రమేష్ మంగళవారం ఆరాతీశారు. ఇంద్రవెల్లి సహకార సంఘంలో 13 స్థానాలకు పోటీలు జరుగుతుండగా, వాటిలో 8 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో గెలుస్తున్నట్లు టిడిపి పార్టీ మండల నాయకులు బామ్నే భారత్, జిల్లా సహకార బ్యాంక్ మాజీ డైరెక్టర్ బామ్నే నాందేవ్‌లు పేర్కొనగా, 13 స్థానాలు గెలిచే విధంగా ఈ ఎన్నికల ప్రచారం చేయాలని ఎంపీ ఆదేశించారు. ఈ ఎన్నికల్లో తన వంతు ప్రచారం కోసం మద్దతు ఇస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. ఏది ఏమైనా 2014లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఈ సహకార ఎన్నికలు రాజకీయ నాయకులకు భవిష్యత్తు పునాదిగా భావించాల్సి వస్తుంది.
భీంనగర్‌లో వివాహిత ఆత్మహత్య
ఉట్నూరు, జనవరి 29: స్థానిక మండలం కొమరంభీంనగర్‌కు చెందిన గెడం రాజేశ్వరి (28) అనే వివాహిత ఆమె ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ సత్యనారాయణ వివరాల ప్రకారం భర్త నరేష్ రాజేశ్వరిని రెండవ భార్యగా చేసుకొన్నట్లు, గత 4 రోజుల క్రితం మొదటి భార్య శశిరేఖ రాజేశ్వరితో గొడవ పెట్టుకోవడం గాకుండా ఇంట్లోని వస్తువులు తీసుకువెళ్లిందని ఎస్‌ఐ తెలిపారు. భర్త సైతం ఆమెతో గొడవకు దిగడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుందన్నారు. ఈ విషయంలో భర్త నరేష్ మొదటి భార్య శశిరేఖలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు.
కాందేవుని ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
నార్నూరు, జనవరి 29: నార్నూరు మండలంలోని కాందేవుని ఆలయంలో మంగళవారం ఆసిఫాబాద్ శాసన సభ్యులు ఆత్రం సక్కు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సహకార ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోరుతూ ప్రత్యేకంగా సక్కు మొక్కులు మొక్కుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో విలేఖర్లతో మాట్లాడుతూ నిరుపేద, మధ్య తరగతి వర్గాలను ఆదుకొనేది ఒక్క కాంగ్రెస్ పార్టీ అని సక్కు అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కేవలం తమ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని, కొంత గడువు కోరినట్లు, త్వరలోనే రాష్ట్రం ప్రకటిస్తుందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. సహకార సంఘ ఎన్నికల్లో డైరెక్టర్ స్థానాలు అధికంగా తమ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, సీనియర్ నాయకులు షేక్ దస్తగిరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాదవ్ తానాజీ, నాయకులు ఎత్మారాం, నాగోరావు, మడావి మాన్కు, మాజీ జడ్పీటిసి హేమలత బిర్జులాల్, మడావి ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు.
మావోయిస్టులకు సహకరిస్తున్న
ఐదుగురు సానుభూతిపరుల అరెస్ట్
* మందు గుండు సామాగ్రి, తూటాల స్వాధీనం
బెల్లంపల్లి, జనవరి 29: మావోయిస్టులకు అశ్రయం ఇస్తూ సానుభూతిపరులుగా వ్యవహరిస్తూ మందుగుండు సామాగ్రీ చేరవేస్తున్న ఐదుగురు మావోయిస్టు సానుభూతి పరులను మంగళవారం రాష్ట్ర సరిహద్దుల్లోని ప్రాణహిత అటవీ ప్రాంతంలో అరెస్ట్ చేసినట్లు బెల్లంపల్లి అదనపు ఎస్పీ వి.్భస్కర్‌రావు తెలిపారు. మంగళవారం స్థానిక ఎఆర్ హెడ్‌క్వార్టర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూర్, దహెగాం మండలాలు ప్రాణహిత పరిసర ప్రాంతంలో కాగజ్‌నగర్ పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా వారిని అరెస్ట్ చేసి విచారించగా వారి వద్ద 44 8ఎంఎం పిస్టల్ తూటాలు, 22 డిటోనేటర్లు, 7 జిలిటిన్‌స్టిక్స్ లభించినట్లు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో దహెగాం, వేమనపల్లి మండలం లోహ, రాజారం గ్రామాలకు చెందిన ఎలుమాల వెంకటి, మాడే శంకర్, , తలండి గణపతి , రమేష్‌రెడ్డి, రోశిరెడ్డి ఉన్నారన్నారు.వీరిలో కొందరు గతంలో మావోయిస్టులకు సహకరిస్తూ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు అయి ఉన్నవారు ఉన్నారన్నారు. వీరిని గతంలో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి చంద్రన్నకు దహెగాం మండలంలో సహకరిస్తున్న సమాచారంతో మందలించి వదిలి వేసినా ప్రవర్తన మార్చుకోకుండా జిల్లా కార్యదర్శి భాస్కర్ అలియాస్ మైలారం అడెల్లుకు సహకరిస్తూ ఉద్యమ వ్యాప్తికి సహకరిస్తున్నారన్నారు. అరెస్ట్ అయిన ఐదుగురిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపర్చనున్నట్లు అదనపు ఎస్పీభాస్కర్‌రావు తెలిపారు. ఈ సమావేశంలో కాగజ్‌నగర్ డిఎస్పీ షేక్ సలీమా, సిఐ రవి, ఎస్.ఐ రమణమూర్తి, రమేష్ ఉన్నారు.
‘
పకడ్బందీగా సహకార ఎన్నికలను నిర్వహించాలి
* ఆర్డీఓ గజ్జన్న
నిర్మల్‌అర్బన్, జనవరి 29 : ఈ నెల 31, వచ్చే నెల 4వ తేదీన జరిగే సహకార ఎన్నికల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పకడ్బందీగా ఎన్నికలను నిర్వహించాలని నిర్మల్ ఆర్డీ ఓ గజ్జన్న తెలిపారు. మంగళవారం నిర్మల్‌లోని ఆర్డీ ఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్నికల సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రాజకీయాలకతీతంగా ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా నీతి నిజాయితీతో ఎన్నికలు సజావుగా జరిగేట్లుగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సిబ్బందికి నిర్దేశించిన జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికల సిబ్బంది నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌లోని సహకార ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.