హైదరాబాద్, జనవరి 30: రంగారెడ్డి జిల్లాలో అమృతహస్తం కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎ.వాణీప్రసాద్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని స్ఫూర్త్భివన్‌లో అమృతహస్తం, మార్పు కార్యక్రమాలపై వైద్య అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృతహస్తం కార్యక్రమంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని వైద్య అధికారులను ఆదేశించారు. మార్పు కార్యక్రమంలో భాగంగా పిహెచ్‌సిలలో అన్ని వౌళిక సదుపాయాలను కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పిహెచ్‌సిలలో మంచినీటి సదుపాయం కల్పించేందుకు సంప్‌లను, సింటెక్స్ ట్యాంకులను ఏర్పాటుచేసి మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోగులకు వేడినీరు అందించేందుకు వీలుగా అన్ని పిహెచ్‌సిలలో సోలార్ వాటర్ హీటర్లను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఆసుపత్రి అభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగించి అవసరమైన వౌళిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పిహెచ్‌సిలకు ప్రహరీగోడలు ఇతర చిన్న చిన్న మరమ్మత్తులు హౌసింగ్ శాఖ ఇంజనీర్ల సహకారంతో చేయించాలని సూచించారు. అన్ని పిహెచ్‌సిలకు రంగులు వేయడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణీ స్ర్తిలకు సంబంధించి ఎంసిటిఎస్‌లో రిజిష్టర్‌చేసి వారికి నెలవారి పరీక్షలు, చికిత్సలు, టీకాలు ఇతర పూర్తి వివరాలను ఫిబ్రవరి 5 వరకు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని ఫిబ్రవరి 6 నుండి ఇట్టి వివరాలను రోజువారీ ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంసిటియస్‌లో గర్భిణీలకు సంబందించిన పూర్తి వివరాలను పొందుపర్చేందుకు గాను డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఎస్‌పిహెచ్‌ఓలు నియమించుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు. డాటా ఎంట్రీపై ఎఎన్‌ఏలకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జననీ సురక్ష యోజన పథకం క్రింద గర్భిణీలందరికీ తప్పనిసరిగా ఆధార్ నెంబర్, బ్యాంకు ఖాతా ఉండేవిధంగా చూడాలని డాక్టర్లను ఆదేశించారు. మార్పు కార్యక్రమం క్రింద పిహెచ్‌సిలలో ఏర్పాటుచేసిన వౌళిక సదుపాయాలపై శంషాబాద్, నర్కొడ, మేడ్చెల్ వైద్యాధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కలెక్టర్ తిలకించి వారిని ప్రశంసించారు. రేపటితో పదవీ విరమణ చేయనున్న శంషాబాద్ క్లస్టర్ ఎస్‌పిహెచ్‌ఓ డాక్టర్ సువర్ణను కలెక్టర్ శాలువాతో సత్కరించారు. గత 25 సంవత్సరాలుగా అంకితభావంతో పనిచేసి గ్రామీణ ప్రాంతాలలో తాను అందించిన సేవలను కలెక్టర్ ఈ సందర్భంగా కొనియాడారు. ఈనెల 27న జరిగిన పల్స్‌పోలియో కార్యక్రమంలో జిల్లాలో 105 శాతం సాధించామని, దీనికి వైద్య అధికారులను కలెక్టర్ ప్రశంసించారు. ఈ సమావేశంలో డిఎంహెచ్‌ఓ వెంకటపతి, వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ హనుమంతరావు, అదనపు డిఎంహెచ్‌ఓ నజీరుద్దీన్, ఐసిడిఎస్ పిడి ఇందిర పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లాలో అమృతహస్తం కార్యక్రమాన్ని పటిష్టంగా
english title:
t
Date:
Thursday, January 31, 2013