Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఏసిబికి చిక్కిన సిఐ, హెడ్‌కానిస్టేబుల్

$
0
0

చేవెళ్ల, జనవరి 30: దొంగతనం కేసు విషయంలో ఇరువురికి రాజీ కుదిర్చి బాధితుని నుంచి రూ.20వేలు డిమాండ్ చేసిన చేవెళ్ల సిఐ బుర్రె శ్రీనివాస్ యాదవ్, ఐటి పార్టీ హెడ్ కానిస్టేబుల్ నాగేందర్‌ను ఏసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. హైదరాబాద్ రేంజ్ ఏసిబి డిఎస్పీ ఎన్.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. చేవేళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని కందవాడ గ్రామానికి చెందిన అవుసుల సునిల్‌చారి గతనెల 30న ఊరెళ్లగా, ఇంట్లోని రూ.45వేల నగదు, ఐదు తులాల బంగారం కన్పించకపోవడంతో ఎల్లారెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాడు. సిఐ శ్రీనివాస్ అనుమానితుడు ఎల్లారెడ్డిని పిలిచి దొంగతనానికి పాల్పడిన నగదు, బంగారు ఆభరణాలను రికవరీ చేశాడు. కేసు పెట్టకుండా సునీల్‌చారి, ఎల్లారెడ్డి మధ్య రాజీ ఒప్పందం చేశాడు. రికవరీ చేసిన వాటిలో మూడు తులాల బంగారం సునీల్‌చారికి సిఐ ఇచ్చాడు. మిగిలిన రెండు తులాల బంగారం, రూ.45 వేలు ఇవ్వడానికి రూ.20వేలు లంచం ఇవ్వాలని బాధితున్ని సిఐ డిమాండ్ చేశారు. అడిగిన మొత్తం ఇవ్వలేనని, రూ.10వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. సిఐ వేధింపులు భరించలేక బాధితుడు ఈనెల 28న ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు. రూ.10వేలు బాధితుడు సునీల్‌చారి తీసుకొని సిఐకి ఫోన్ చేశాడు. ఐడి పార్టీ కానిస్టేబుల్ నాగేందర్‌కు ఇవ్వాలని సిఐ సూచించాడు. బుధవారం డబ్బులు ఇస్తుండగా ఏసిబి అధికారులు హెడ్ కానిస్టేబుల్ నాగేందర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తర్వాత ఇద్దరినీ కోర్టులో హాజరుపర్చారు.

కాంగ్రెస్సే తెలంగాణకు ప్రథమ శత్రువు
నాచారం, తార్నాక, జనవరి 30: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుందని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్మెన్, ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఓయులో హైదరాబాద్‌తోకూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని రెండు వారాలుగా ఎంఎస్‌ఎఫ్ విద్యార్థులు చేస్తున్న నిరాహారదీక్షకు బుధవారం దిలీప్‌కుమార్ సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ 1969 ఉద్యమంలో అణిచివేసి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను కనుమరుగు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, నేడు మలిదశ ఉద్యమంలో దాదాపు వెయ్యిమంది విద్యార్థులు యువకులు అసువులు బాసినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి, యుపిఎ ప్రభుత్వానికి ఎంతమాత్రం కనువిప్పు కలుగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పదవులు తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఆవేదన అర్థం కావడం లేదని అన్నారు. ఉద్యమనాయకుడికి ఉండాల్సిన లక్షణం అందరినీ కలుపుకుని పోయి, అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశలో ప్రయత్నాలు కొనసాగాలి కాని, ఎవరినిపడితే వారిని దూషించడం సరికాదని అన్నారు. వంగపల్లి శ్రీనివాస్, సుధాకర్ పాల్గొన్నారు.
కాగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థులపై అక్రమకేసులు బనాయిస్తూ అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ విద్యార్థిసంఘం ఆధ్వర్యంలో ఓయు ఆర్ట్స్‌కళాశాల వద్ద సిఎం దిష్టిబొమ్మతో నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యార్థి సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌పై పోలీసులు అక్రమకేసులు బనాయించి అరెస్టు చేసి జైలుకు పంపించారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్రక్క కేసులు ఎత్తివేస్తున్నామని ప్రకటిస్తూనే మరోవైపు విద్యార్థి సంఘాల నేతలను అక్రమంగా అరెస్టులు చేస్తూ కొత్తకేసులు బనాయించడం సిగ్గుచేటన్నారు.

మహాత్ముని అడుగుజాడల్లో నడవాలి

కుత్బుల్లాపూర్, జనవరి 30: మహాత్మాగాంధీ కన్నకలలు, ఆయన ఆశయసాధనకు యువత ఉద్యమించాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కెఎం ప్రతాప్ పిలుపునిచ్చారు. బుధవారం మహాత్మాగాంధీ 65వ వర్థంతి సందర్భంగా షాపూర్‌నగర్‌లో యూత్ కాంగ్రెస్ నాయకుడు వరుణ్‌గౌడ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతాప్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. బాచ్‌పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి కొలను హనుమంత్‌రెడ్డి గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. సూరారం వైకాపా కార్యాలయంలో వైకాపా జిల్లా యూత్ కన్వీనర్ జి సురేశ్‌రెడ్డి గాంధీజీకి నివాళి అర్పించారు. చింతల్ గణేష్‌నగర్‌లో కార్పొరేటర్ వెంకటేశ్వర్‌రావు గాంధీజీకి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిసి సెల్ అధ్యక్షుడు నాగభూషణం, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కెపిహెచ్‌బి కాలనీలో..
కెపిహెచ్‌బి కాలనీ: గాంధీ విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ డి.వి.సామ్రాజ్యం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కట్టా నర్సింగారావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అచ్చయ్యపాల్గొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ హస్మతుల్లాఖాద్రి గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భరత్‌నగర్‌కాలనీలో పటోళ్ల నాగిరెడ్డి ఆధ్వర్యంలో, కూకట్‌పల్లి సర్కిల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ మోయిజ్ ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతి సందర్బంగా పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు.
ఖైరతాబాద్‌లో..
ఖైరతాబాద్: జాతిపిత మహాత్మాగాంది 64వ వర్ధంతి వేడుకలను బుధవారం బోళానగర్‌లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పి.విజయారెడ్డి ఈ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరై మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళిఅర్పించారు. అహింస, శాంతియుత మార్గాలే దేశాభివృద్ధికి తోడ్పడతాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీం, ఆజర్, బషీర్, రబ్బాని తదితరులు పాల్గొన్నారు.
కంటోనె్మంట్‌లో..
కంటోనె్మంట్: జాతి పిత మహాత్మగాంధీ త్యాగం దేశ ప్రజలు మరువలేనిదనీ కంటోనె్మంట్ బోర్డు సభ్యుడు జంపన ప్రతాప్ తెలిపారు. బుధవారం గాంధీ వర్థంతిని పురస్కరించుకుని గాంధీ కాలనీలోని విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కాలనీవాసులు నాయకులు కుమార్, కృష్ణ ఇతరులు పాల్గోన్నారు. బోయిన్‌పల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముప్పిడి మధుకర్ ఆధ్వర్యంలో గాంధీ వర్థంతి వేడుకలు నిర్వహించారు. టిఎన్. శ్రీనివాస్, ముఖేష్ యాదవ్, వెంకటేష్, నాగరాజు, అమీరుద్దీన్ పాల్గొన్నారు. బాపూజీనగర్‌లో బోర్డు సభ్యురాలు జంపన విద్యావతి బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. మచ్చబొల్లారం కార్పొరేటర్ రాజ్‌జితేంద్రనాథ్ బాపూజీ వర్థంతిని పురస్కరించుకుని అల్వాల్ ఈ సేవా సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. డోలి రమేష్, నందివర్థనం రాజు, అనిల్ కిషోర్ పాల్గొన్నారు. మహాత్మగాంధీ వర్థంతి సందర్భంగా నందికంటి శ్రీ్ధర్ విద్యార్థులకు పండ్లు పంచి పెట్టారు.
సరూర్‌నగర్‌లో..
సరూర్‌నగర్: భారతరత్న జాతిపిత మహాత్మగాంధీ వర్ధంతి సందర్భంగా కర్మన్‌ఘాట్ చౌరస్తా వద్దనున్న గాంధీ విగ్రహానికి స్థానిక కార్పొరేటర్ జి. సుష్మమధుసూధన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు జి.మధుసూధన్‌రెడ్డిలు బుధవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నైతిక విలువలతో దేశానికి పరాయి పాలన నుండి స్వాతంత్రం తీసుకువచ్చిన గొప్పనేత గాంధీజీ అన్నారు. సరూర్‌నగర్‌లో ఎల్‌బినగర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భవానీ ప్రవీణ్‌కుమార్ గాంధీ వర్ధంతి సభలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ మహేందర్ యాదవ్, పండ్లమార్కెట్ కమిటి చైర్మన్ డి. రాజశేఖర్‌రెడ్డి, జ్ఞానేశ్వర్‌యాదవ్ పాల్గొన్నారు.
వనస్థలిపురంలో..
వనస్థలిపురం: ఎల్‌బినగర్ డివిజన్‌లో గాంధీజీ వర్ధంతి సందర్భంగా మన్సురాబాద్‌లోని గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. వనస్థలిపురంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్మోహన్‌గౌడ్ జాతిపిత చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించగా, కాంప్లెక్స్‌లో వైఎస్సార్‌సిపి నేత పి.ప్రతాప్‌రెడ్డిగాంధీజీ చిత్రపటానికి నివాళి అర్పించారు.
బాలానగర్‌లో..
బాలానగర్: మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకొని ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని బాలానగర్ టిడిపి అధ్యక్షుడు అంబటి సునీల్‌కుమార్ గుప్తా అన్నారు. బుధవారం బాలానగర్ శోభనా కాలనీలోని చ్ని తరహా పరిశ్రమల కేంద్రంలో గాంధీజి వర్దంతిని సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కిరణ్, బాలాజీ, మహేష్, ఖాజా, రమణ, రవి పాల్గొన్నారు.
మల్కాజిగిరిలో..
మల్కాజిగిరి: మహాత్ముడు చూపిన మార్గమే అన్ని సమస్యలకు పరిష్కారమని మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ పేర్కొన్నారు. గాంధీ పార్కులోగల గాంధీజీ విగ్రహనికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహత్ముడు బలంగా నమ్మి ఆచరించిన శాంతి, అహింసా మార్గమే అన్ని సమస్యలకు పరిష్కారమనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్ మరియమ్మచాకో, వెంకటేష్ యాదవ్, రాంచందర్, పూర్ణచందర్‌రావు, సత్యనారాయణ పాల్గొన్నారు. గాంధీజీ చూపిన ఆహింసా మార్గానే్న ప్రతి ఒక్కరు ఆచరించాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ మల్కాజిగిరి ఇన్‌చార్జి వికె మహేష్ పిలుపు నిచ్చారు. బుధవారం ఆపార్టీ ఆధ్వర్యంలో గాంధీ పార్కులోగల గాంధీజీ విగ్రహనికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు జిల్లాశంకర్, ఎన్.వీరేశం యాదవ్, ధనుంజయ్, అల్వాల్ కృష్ణ, వై.సుధాకర్ రెడ్డి, కె.గోపి పాల్గొన్నారు. గాంధీ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకోని గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ ఆర్.సుమలతారెడ్డి, ఓల్డ్‌మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ వై.ప్రేమ్‌కుమార్, టిడిపి రంగారెడ్డిజిల్లా అధికార ప్రతినిధి ఆర్.జితేందర్ రెడ్డిలు గాంధీజీ విగ్రహనికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మగాంధీ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకోని వైకాపా మల్కాజిగిరి ఇన్‌చార్జి, మున్సిపల్ మాజీ చైర్మన్ జి.సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో గాంధీ పార్కులోగల గాంధీజీ విగ్రహనికి పూల దండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పలువురు ఆపార్టీ నాయకులు పాల్గొన్నారు.
చాంద్రాయణగుట్టలో..
చాంద్రాయణగుట్ట: జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో ఆయన సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి పలువురు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతోపాటు జిల్లా కలెక్టర్ రిజ్వీ, జిహెచ్‌ఎంసి కమిషనర్ కృష్ణబాబు, జోనల్ కమిషనర్ డి.రోనాల్డ్‌రాజ్, డిప్యూటీ కమిషనర్ రమణి, పర్యాటక అభివృద్ధి కార్పోరేషన్ అధికారులు, హైదరాబాద్ ఆర్‌డివో హరీష్, గోల్కొండ తహసీల్దార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 65 వ వర్థంతి సందర్భంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.పి. క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఫత్తేదర్వాజలోని గాంధీ విగ్రహాలవరకు ర్యాలీగా తరలివెళ్లి ఘన నివాళులు అర్పించారు. అవినీతికి వ్యతిరేకంగా నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు. ఎన్.వెంకటేశ్, మహేష్‌గౌడ్, హరీష్, వెంకటరెడ్డి, రోహన్, ఎస్.నర్సింగ్‌రావు, పి.హరికృష్ణ, జి.కన్నయ్యలాల్ పాల్గొన్నారు.
నార్సింగిలో..
నార్సింగి: దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానీయుడు జాతిపిత మహాత్మగాంధీని నేటి యువత మరువరాదని నగర కాంగ్రెస్ నాయకుడు జి. ప్రహ్లాద్ యాదవ్ అన్నారు. గాంధీజీ 65వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఉదయం కార్వాన్- కుల్సుంపూరా ఉన్నత పాఠశాలలో జాతిపిత చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. పాఠశాల ఉపాధ్యాయులు సరస్వతీ, చంద్రశేఖర్, శిరోమణి, శారద విద్యార్ధులు పాల్గొన్నారు.
సైదాబాద్‌లో..
సైదాబాద్: జాతిపిత గాంధీజీ వర్దంతి సందర్భంగా సైదాబాద్ రెడ్డిబస్తీలోని గాంధీ విగ్రహానికి గ్రేటర్ టిడిపి ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎస్‌సి కమాండెంట్ అశోక్‌కుమార్, కొత్తకాపు రవీందర్‌రెడ్డి, కావేటి వెంకట శర్మ, నరేందర్‌గౌడ్, శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. గాంధీజీ ఆశయ సాధనకు కృషిచేయాలని యాకత్‌పుర నియోజకవర్గ వైకాపా ఇన్‌చార్జి మైల్‌కోల్ మహేందర్ యాదవ్ అన్నారు. సైదాబాద్ ప్రధాన రహదారిపై వైకాపా ఆధ్వర్యంలో గాంధీ వర్దంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజేందర్, దయానంద్, గోవర్దన్, పుల్లూరు రాజు పాల్గొన్నారు.
బేగంపేటలో..
బేగంపేట: స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి నేడు మనకు స్వాతంత్య్ర ఫలాలు అందించిన ఘనత మహాత్మాగాంధీకే దక్కిందని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం సికిందరాబాద్ ఎంజి రోడ్‌లోని గాంధీ విగ్రహం వద్ద గాంధీ వర్ధంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, బేగంపేట, రాంగోపాల్‌పేట, బల్కంపేట కార్పోరేటర్లు కిరణ్మయి, మహేశ్వరి, శేషుకుమారిలు, సనత్‌నగర్ నియోజకవర్గ దేశం నేత కూన వెంకటేశ్‌గౌడ్, స్థానిక నేతలు నాగులు, కృష్ణపూజారి, కాంగ్రెస్ నేతలు శ్రీహరి, కిశోర్‌కుమార్, దయానంద్, సద్గురు, తదితరులు గాంధీజీ విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తలసాని, కూన వెంకటేశ్‌గౌడ్‌లు మాట్లాడుతూ గాంధీజీ ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని వారి అడుగు జాడల్లో నడవాలని ఈ సందర్భంగా సూచించారు.
మేడ్చల్‌లో..
మేడ్చల్: జాతిపిత గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు మందుకు సాగాలని పలువురు వక్తలు సూచించారు. బుధవారం మహాత్మా గాంధీ వర్దంతి సందర్భంగా పట్టణంలోని గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు రాజేశ్వర్ గుప్తా, నాగరాజు, శ్రీను, చందు, ఉపేందర్ పాల్గొన్నారు.

ఉత్తమ జర్నలిస్టులకు ఇంద్రారెడ్డి అవార్డులు
ఘట్‌కేసర్, జనవరి 30: ఉత్తమ జర్నలిస్టులకు ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా ఇంద్రారెడ్డి జయంతి సందర్బంగా అవార్డులు ఇవ్వనున్నట్లు రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టుల డైరీని బుధవారం ఆమె నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. దివంగత ఇంద్రారెడ్డి జయంతి సందర్భంగా అక్టోబర్ నాలుగున ఉత్తమ జర్నలిస్టులకు ప్రథమ బహుమతి పదివేలు, ద్వితీయ బహుమతి అయిదువేలు, తృతీయ బహుమతి మూడువేల నగదు పురస్కారంతో సన్మానించనున్నట్లు తెలిపారు. జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ఎంపిక జరపాలని ఆమె కోరారు. జర్నలిస్టులు వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రజలకు మేలు జరిగేలా వ్యవహరించాలని కోరారు. తమ వృత్తిని సక్రమంగా నిర్వర్తించి అందరి మన్నలు పొందాలని తెలిపారు. గతంలో జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్ల స్థలాలు అందరికి అందుబాటులోకి రానందున ప్రత్యేక చర్యలు తీసుకుని అందరికీ అందేలా చూస్తానని ఆమె హమీ ఇచ్చారు.
ఎపియుడబ్ల్యుజే జిల్లా కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎపియుడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు బి.సోమసుందర్, ప్రధాన కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు ఎం.వెంకట్‌రెడ్డి, బాల్‌రాజు, జగన్‌మోహన్‌రెడ్డి, ఎ.రామారావు, సలీం పాషా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఏ.్భస్కర్‌రెడ్డి, దాడుల నివారణ కమిటి సభ్యుడు మల్కయ్య, మేడ్చల్ నియోజకవర్గం అధ్యక్షుడు లింగాల భూపాల్, ఉపాధ్యక్షుడు వి.జయపాల్‌రెడ్డి, ఉప్పల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, కె.శ్రీనివాస్, బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
నేడు సహకార ఎన్నికలు
ఘట్‌కేసర్, జనవరి 30: ఘట్‌కేసర్ రైతు సేవా సహకార సంఘం ఎన్నికల సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎన్నికల అధికారి ఎన్ శ్రీ్ధర్ తెలిపారు. ఎన్నికలకు బాలుర జడ్పి ఉన్నత పాఠశాలలో పదమూడు పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఎన్నికలలో మొత్తం పదమూడు అభ్యర్ధి స్థానాలకుగాను 42 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. మండలంలో మొత్తం 1952 ఓట్లు ఉన్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుందని, మధ్యాహ్నం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆయన తెలిపారు. బరిలో నిలిచిన అభ్యర్ధులు తమ గెలుపు కోసం అనుచరులతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
టిఆర్‌ఎస్, టిడిపి, కాంగ్రెస్ పార్టీలు బలపరిచిన అభ్యర్ధుల విజయం కోసం రైతులకు మద్యం, డబ్బులు పంచుతూ ప్రమాణాలు చేయించుకుంటున్నారు.
ఓటర్లను తమ తమ ఆదీనంలో పెట్టుకున్నారు. ఆయా పార్టీలకు చెందిన మండల, నియోజకవర్గం, జిల్లా నాయకులతో ప్రచారం ముమ్మరంగా సాగించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సిఐ శ్రీరామ్‌కుమార్ తెలిపారు.

దొంగతనం కేసు విషయంలో ఇరువురికి రాజీ కుదిర్చి
english title: 
acb

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>