ఏలూరు, జనవరి 30 : జిల్లాలో తొలిదశ ఎన్నికల నిర్వహణలో భాగంగా మొత్తం 39 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు గురువారం ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుండి కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం, సహకార శాఖ పూర్తి చేశాయి. జిల్లాలోని మూడు రెవిన్యూ డివిజన్ల పరిధిలోని 39 సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 118 సంఘాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా వీటిలో 75 సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 43 సంఘాల్లో పెనుగొండ సొసైటీ ఎన్నికలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంత పరిణామాల్లో కొవ్వూరు డివిజన్‌లోని పైడిపర్రు, ఏలూరు డివిజన్‌లోని భీమడోలు సొసైటీల ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించింది. తాజాగా బుధవారం సాయంత్రం ద్వారకాతిరుమల మండలం రామన్నగూడెం సొసైటీ ఎన్నికను నిలిపివేస్తూ ఉత్తర్వులు వెలువడటంతో 39 ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎన్నికలు జరిగే సంఘాలివే...
భీమవరం డివిజన్‌లోని ఉండి, కాళ్ల, ఎల్‌జి పాడు, పాలకోడేరు, ఏలూరు డివిజన్‌లోని గుణ్ణంపల్లి, పెదవేగి, జాలిపూడి, గోగుంట, విజయరాయి,జోగన్నపాలెం, సీతంపేట, ద్వారకాతిరుమల, ఏలూరు, పోతునూరు, గుండుగొలను, తాడేపల్లి, శనివారపుపేట, నల్లజర్ల, కొవ్వలి, నవాబుపాలెం, పోతవరం, తాడేపల్లిగూడెం, పెదకడిమి, తిరుమలంపాలెం, నారాయణపురం, ఆరుగొలను, జి కొత్తపల్లి, కొవ్వూరు డివిజన్‌లోని మాముడూరు, ఎస్ ఐ పర్రు, వెలగలేరు, మునమర్రు, సిద్ధాంతం, ఉనికిలి, వరిఘేడు, కానూరు, శ్రీపర్రు, మల్లేశ్వరం, కాల్దారి, మోర్త సహకార సంఘాల ఎన్నికలకు సహకార శాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ పెట్టెలు, పత్రాలను పోలీసు భద్రత మధ్య తరలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ బూత్‌ల వద్ద 144వ సెక్షన్ విధించారు. అలాగే తొమ్మిది సమస్యాత్మకప్రాంతాలను గుర్తించారు. పెదవేగి మండలంలోని విజయరాయి, పెదకడిమి, దెందులూరు మండలంలోని పోతునూరు, భీమడోలు మండలంలోని భీమడోలు, ద్వారకాతిరుమల మండలంలోని ద్వారకాతిరుమల, జి కొత్తపల్లి, తాడేపల్లిగూడెం మండలంలోని తాడేపల్లిగూడెం, నల్లజర్ల మండలంలోని నల్లజర్ల, ఉండి మండలంలోని ఉండి సహకార సంఘాలను సమస్యాత్మక సంఘాలుగా గుర్తించారు. ఈ పోలింగ్ బూత్‌ల వద్ద అదనంగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఓటరు వారి వద్ద వున్న ఓటరు గుర్తింపు కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వుంటుంది. ఎన్నికల నిర్వహణకు గాను మొత్తం 150 మంది ఎన్నికల అధికారులను జిల్లా కలెక్టర్ నియమించారు. మొదటి విడత ఎన్నికలకు గాను 349 బూత్‌లు ఏర్పాటు చేశారు. మొత్తం 55 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదే విధంగా 1416 మందిని ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్‌కు వినియోగిస్తున్నారు. సహకార ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లను చేసింది.
మరోవైపు బుధవారం ఉదయం నుంచి కొన్ని ప్రాంతాల్లో మద్యం, డబ్బు పంపిణీ మొదలైపోయింది. పోటీ తీవ్రస్థాయిలో వున్న సొసైటీల్లో ఓటుకు 500 నుంచి వెయ్యి రూపాయల వరకు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొని వుండటంతో ఆ రెండు పార్టీలు సహకార ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
ఉదయం 7 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ - 3 గంటల నుండి కౌంటింగ్
english title:
n
Date:
Thursday, January 31, 2013