న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటార్ కార్పొరేషన్ గత ఏడాది జనవరి కంటె ఈ జనవరిలో 7.21 శాతం వృద్ధిని సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. నెలవారీ అమ్మకాలలో జనవరి నెల అమ్మకాలు గరిష్ఠంగా కంపెనీ పేర్కొంది. గత సంవత్సరం జనవరిలో కంపెనీ 5,20,272 యూనిట్లను విక్రయించగా ఈ ఏడాది జనవరిలో 5,57,797 యూనిట్లను అమ్మినట్లు కంపెనీ తెలియచేసింది. 2012 మేలో కంపెనీ 5,56,644 యూనిట్లు గరిష్ఠంగా విక్రయించగా ఈ జనవరిలో అంతకంటె ఎక్కువ అమ్మినట్లు కంపెనీ వెల్లడించింది.
‘కలలను సాకారం’ చేసుకునే తరుణమిదే
* ఇన్ఫోసిస్ గౌరవ చైర్మన్ నారాయణమూర్తి
బెంగళూరు, ఫిబ్రవరి 3: మనదేశం ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ తరుణంలో కన్న కలలను సాకారం చేసుకోడానికి ఇదే మంచి తరుణమని ఇన్ఫోసిస్ గౌరవ చైర్మన్ ఎన్.ఆర్.నారాయణమూర్తి ఆదివారం అభిప్రాయపడ్డారు. కలలను సాకారం చేసుకోడానికి మనదేశం కార్యాచరణను సిద్ధం చేసుకోవాల్సిన సమయం ఇదేనని ఆయన అన్నారు.
‘గత 400 ఏళ్లలో తొలిసారిగా మనదేశం ప్రపంచదృష్టిని ఆకర్షిస్తోంది. కనుక మనం జాగృతమై కన్న కలలను నిజం చేసుకోడానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోడానికి ఇదే సరైన సమయం’ అని ఆయన అన్నారు. బెంగళూరు రాజకీయ కార్యాచరణ కమిటీ (బిపిఎసి) ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడారు. బెంగళూరును సర్వోన్నతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పౌరులు ఈ బిపిఎసిని ఏర్పాటు చేశారు. వివిధ అంశాలలో బెంగళూరు పాలనా విధానం బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడంతో దిగజారిపోతోందని మరో పారిశ్రామికవేత్త బయోకాన్ చైర్మన్, ఎండి కిరణ్ మజుందార్ షా ఆవేదన వ్యక్తం చేశారు.‘పాలనాలోపాలు సవరించేందుకు ప్రతిఒక్కరం బాధ్యత తీసుకుని నిర్దేశిత లక్ష్యంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను’ అని ఆమె అన్నారు.
ప్రజలను చైతన్య పరిచి బిపిఎసి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఓటర్లను చేర్పించాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ మాజీ డైరక్టర్ టివి మోహన్‌దాస్ పాయ్ చెప్పారు. బిపిఎసి అజెండాతో ఏకీభవించే అభ్యర్థులను సమర్ధించాలని ఈ సందర్భంగా కోరారు.