ముంబయి, ఫిబ్రవరి 3: అమెరికా ఎగుమతులపై ఆధారపడిన దేశీయ ఫార్మా కంపెనీలు 2013 సంవత్సరంలో సుమారు 20 శాతం వృద్ధిని సాధించే అవకాశాలున్నట్లు 2013-్ఫర్మారంగ ధృక్పధం నివేదికలో ఇండియా రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ‘్ఫర్మారంగంలో అమెరికా ఎగుమతులపై ఆధారపడే కంపెనీలు 2013 సంవత్సరంలో 20 శాతం పైగా వృద్ధిని సాధిస్తాయని నమ్ముతున్నాం’ అని ఆ ఏజెన్సీ పేర్కొంది. ఎగుమతులకు అవకాశం ఉన్న అమెరికాకు రానున్న రెండేళ్లలో జనరిక్స్‌కు మంచి డిమాండ్ ఉంది. దీనికి తోడు హెల్త్‌కేర్ విధానాలలో వచ్చిన మార్పులు మన కంపెనీల ఎగుమతులను ప్రోత్సహించేవిధంగా ఉన్నాయని రేటింగ్ ఏజెన్సీ తెలియచేసింది. అభివృద్ధి చెందిన దేశాలలో కొన్ని మందులకు పేటెంట్ల కాలపరిమితి తీరిపోడం, హెల్త్‌కేర్‌పై నిధుల వెచ్చింపులపై ఉన్న పరిమితులు మనదేశ కంపెనీల జనరిక్స్ ఎగుమతులను ప్రోత్సహించే రీతిలో ఉన్నాయి.
అంతర్జాతీయంగా జనరిక్స్‌పై 2011లో 242 బిలియన్ అమెరికన్ డాలర్లు నిధులు వెచ్చించగా 2016 నాటికి ఇది 430 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఐఎంఎస్ హెల్త్ గణాంకాలు తెలియచేస్తున్నాయి. పరిశోధన అండ్ అభివృద్ధి(ఆర్ అండ్ డి)కి వెచ్చించే వ్యయం కూడా ఈ ఏడాది పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ అభిప్రాయ పడింది. దీనిని దృష్టిలో ఉంచుకునే మనదేశ ఫార్మా కంపెనీలు కాంప్లెక్స్ కెమిస్ట్రీ ఉత్పత్తులపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. ఆర్ అండ్ బికి కూడా ఖర్చుపెట్టేందుకు భారీ ఎత్తున నిధులను కంపెలు కేటాయిస్తున్నాయి. 2008లో దేశం నుండి 38,600 కోట్ల రూపాయల మేర ఎగుమతులు చేయగా 2012 నాటికి ఇవి పెరిగి 77,500 కోట్ల రూపాయల మేరకు చేరింది. ఈ నేపథ్యంలో దేశీయ ఫార్మా కంపెనీలు ఈ ఏడాది అనుకున్న దాని కంటె ఎగుమతుల లక్ష్యం అధికంగా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
వర్షాభావంతో తగ్గనున్న పంటల దిగుబడి
ముంబయి, ఫిబ్రవరి 3: ఖరీఫ్‌లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరంలో ఆహార, ఆహారేతర పంటల ఉత్పత్తి 2.8 శాతం క్షీణించనుందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎమ్‌ఐఇ) ఆదివారం వెల్లడించింది. ప్రధానంగా వరి, తృణధాన్యాలు, పప్పుగింజల ఉత్పతి తగ్గుతుందని ఆ సంస్థ తెలిపింది. 2012-13 సంవత్సరంలో ఆహారేతర పంటల ఉత్పత్తి 2.7 శాతం, ఆహార ధాన్యాల ఉత్పత్తి 2.9 శాతం క్షీణించనుందని నెలవారీగా విడుదల చేసే నివేదికలో పేర్కొంది. దీంతో మొత్తం ఉత్పత్తి 2.8 శాతం తగ్గనుందని సిఎమ్‌ఐఇ వివరించింది. నైరుతి రుతుపవనాల వల్ల ఆశించినంత వర్షాలు పడకపోవడంతో ఇటీవల ముగిసిన ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగు తగ్గిందని తెలిపింది. అయితే, ప్రస్తుత రబీ సీజన్‌లో గతేడాది కంటే 1.6 శాతం సాగు విస్తీర్ణం పెరిగిందని వెల్లడించింది. 286.4 లక్షల హెక్టార్లలో పంటలు వేశారని సిఎమ్‌ఐఇ తెలిపింది. గోదుమలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను 65 రూపాయలు పెంచి 1,350గా నిర్ణయించడంతో గోదుమ సాగు పెరిగిందని పేర్కొంది. ఈ సీజన్‌లో 98.3 మిలియన్ టన్నుల గోదుమల ఉత్పత్తి, వరి ధాన్యం ఉత్పత్తి 3.4 శాతం క్షీణించి 100.8 మిలియన్ టన్నులు ఉండొచ్చని వివరించింది. ఖరీఫ్, రబీ సీజన్లలో వరి సాగు తక్కువగా ఉండటమే ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గడానికి కారణమని తెలిపింది. కాగా, దేశంలో ఉత్పత్తయ్యే వరి ధాన్యంలో ఒక్క ఖరీఫ్ సీజన్‌లోనే 80 శాతం ఉత్పత్తి జరుగుతుంది. అయితే, ఖరీఫ్‌లో వరిసాగు విస్తీర్ణం 4 శాతం తగ్గింది. రబీలో వరి సాగు విస్తీర్ణం 25.7 శాతం తగ్గింది.