ముంబయి, ఫిబ్రవరి 3: మనదేశ షిప్పింగ్ రంగం మరో రెండేళ్ల పాటు ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది అంతర్జాతీయంగా పూర్తి స్థాయిలో వాణిజ్యాన్ని చేయలేకపోడం, సామర్థ్యాన్ని పెంచుకోడంలో విఫలం చెందడం తదితర కారణాల వల్ల ఈ రంగం 2015 వరకు కోలుకోడం కష్టమని ‘ఇండియా రేటింగ్’ ఏజెన్సీ అభిప్రాయపడింది. అందువల్ల ఈ రంగానికి ఆ ఏజెన్సీ ‘ప్రతికూల మార్కులు’ వేసింది.
‘అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరైన స్థాయిలో నిర్వహించలేకపోడం, భారీ స్థాయిలో ఫ్లీట్ సామర్థ్యాన్ని పెంచుకోలేకపోయినందున రవాణా చార్జీలు పెద్దగా మార్పులు లేకపోడంతో భారీ ట్యాంకులు, కంటెనర్ల ద్వారా 2013 నాటికి పెద్దగా ఆదాయం సమకూరకపోవచ్చు’ అని ఇండియా రేటింగ్ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా ఆర్డర్లు ఆశించినంత లేకపోవడం, చమురు ధరలు విపరీతంగా పెరగడం తదితర కారణాల వల్ల షిప్పింగ్ కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్లు ఈ ఏడాది గణనీయంగా తగ్గాయి’ అని రేటింగ్ కంపెనీ తెలియచేసింది.
సరుకుల రవాణా విషయంలో దేశీయ కంపెనీలకు కొన్ని రూట్లలో అనుమతులు లేకపోడం వల్ల రవాణాలో ఇబ్బందులు ఎక్కువై వ్యాపార లావాదేవీల ద్వారా ఆశించిన ఆదాయం రాకపోడంతో కంపెనీలు రుణాలు తీర్చడంతో అనేక ఇక్కట్లు పడుతున్నాయి. తద్వారా కంపెనీలకు మళ్లీ రుణాలు దొరకడం కష్టం అవుతోంది. దీనికి తోడు అంతర్జాతీయ స్థాయిలో రూపాయి మారకం విలువలో ఒడిదుడుకుల వల్ల 2013 సంవత్సరంలో లాభాలను దెబ్బతీసే అవకాశం ఉందని రేటింగ్ కంపెనీ తెలియచేసింది.
కాగా ఆఫ్‌షోర్ చమురు నిల్వలపైన, డ్రిల్లింగ్ విభాగాలలోని షిప్పింగ్ కంపెనీల విషయం మాత్రం ముడి చమురు ధర బాగా ఉన్నందున పరిస్థితి ఆశాజనకంగా ఉంది. 2012 సంవత్సరంలో కూడా ఆఫ్‌షోర్ విభాగానికి చెందిన చమురు రిగ్‌లు, వీటికి అనుసంధానంగా పనిచేసే షిప్‌ల ధరలు బాగానే ఉన్నందున ఆర్థికంగా ఇవి దెబ్బతినలేదు. దీనికి తోడు ఆఫ్‌షోర్ చమురు తవ్వకం కార్యకలాపాలు, ఇతర డ్రిల్లింగ్ కార్యకలాపాలు పెరగడం ఒక విధంగా ఈ రంగంలోని షిప్పింగ్ కంపెనీల పాలిట వరంగా మారింది. చమురు ధరలు కూడా ఈ కంపెనీలు నష్టపోకుండా కొంత మేర కాపాడగలుగుతున్నాయని రేటింగ్ కంపెనీ పేర్కొంది.
*2015 వరకు కోలుకోవడం కష్టం * ప్రతికూల మార్కులు ఇచ్చిన ‘ఇండియా రేటింగ్’ ఏజెన్సీ
english title:
ship
Date:
Monday, February 4, 2013