పెర్త్, ఫిబ్రవరి 3: వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల వనే్డ ఇంటర్నేషనల్ క్రికెట్ సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ జార్జి బెయిలీ అజేయ సెంచరీతో రాణించడంతో, ఆసీస్ గెలుపు సులభతరమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 266 పరుగులు సాధించింది. టాస్ గెలిచి వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సమీ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 16 పరుగుల వద్ద తొలి వికెట్‌ను ఉస్మాన్ ఖాజా (3) రూపంలో కోల్పోయింది. ఫిన్చ్ (11), హ్యూజెస్ (21), కెప్టెన్ మైఖేల్ క్లార్క్ (16) తక్కువ స్కోర్లకే వికెట్లు పారేసుకున్నారు. అయితే, కెప్టెన్ బెయిలీ క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆసీస్‌కు గౌరవ ప్రదమైన స్కోరును అందించే ప్రయత్నం చేశాడు. ఫాల్క్‌నర్ 39 పరుగులతో అతనికి సహకరించాడు. 50 ఓవర్లు ముగిసే సమయానికి జాన్సన్ (నాటౌట్ 16)తో కలిసి క్రీజ్‌లో ఉన్న బెయిలీ 110 బంతులు ఎదుర్కొని, 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 125 పరుగులు సాధించాడు. విండీస్ బౌలర్లలో కెప్టెన్ సమీకి మూడు వికెట్లు లభించడం విశేషం. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ తరఫున పావెల్ (83), డ్వెయిన్ బ్రేవో (45) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ మూకుమ్మడిగా విఫలమయ్యారు. ఫలితంగా విండీస్ 38.1 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది.
పాక్‌కు దక్షిణాఫ్రికా సవాలు
జొహానె్నస్‌బర్గ్, ఫిబ్రవరి 3: పాకిస్తాన్ ముందు 480 పరుగుల లక్ష్యాన్ని ఉంచడం ద్వారా ఇక్కడ జరుగుతున్న మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా సవాలు విసిరింది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులు సాధించిన దక్షిణాఫ్రికా ఆతర్వాత పాక్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 49 పరుగులకే ఆలౌట్ చేసింది. 204 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించిన ఈ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు 275 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఎబి డివిలియర్స్ 103 పరుగులతో అజేయంగా నిలవగా, హషీం ఆమ్లా 74, కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 52 పరుగులతో రాణించారు. మ్యాచ్ మూడోరోజునే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన దక్షిణాఫ్రికా విసిరిన సవాలును స్వీకరించిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి, ఆదివారం ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లకు 183 పరుగులు చేసింది. విజయానికి ఈ జట్టు ఇంకా 297 పరుగులు చేయాల్సి ఉంది. ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయ.
రెజ్లింగ్‌లో భారత్‌కు మూడు పతకాలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: అమెరికాలో జరిగిన డేవ్ షుల్జ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్‌కు మూడు పతకాలు లభించాయి. వీటిలో రెండు రజతకాలుకాగా, మరొకటి కాంస్యం. మహిళల 59 కిలోల విభాగంలో గీతా ఫొగత్, పురుషుల 60 కిలోల ఫ్రీస్టయిల్‌లో భజరంగ్ రజత పతకాలు కైవసం చేసుకున్నారు. సందీప్ తోమర్‌కు కాంస్య పతకం దక్కింది.