కటక్, ఫిబ్రవరి 3: మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో మొదటి మ్యాచ్‌ని ఓడిపోయిన పాకిస్తాన్ ఆదివారం ఇక్కడి బారాబతి స్టేడియంలో జరిగిన మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లోనూ పరాజయాన్ని ఎదుర్కొంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు 41.2 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. బిస్మా మరూఫ్ (20), అస్మావియా ఇక్బాల్ 21, కినితా జలీల్ (14) మాత్రమే పాక్ తరఫున రెండంకెల స్కోరు సాధించగలిగారు. మిగతా బ్యాట్స్‌విమెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో పాక్ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయింది. కివీస్ బౌలర్లు అత్యంత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాక్‌ను దారుణంగా దెబ్బతీశారు. రాచెల్ కాండీ 10 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చడం విశేషం. ఆమె ధాటికి పాక్ బ్యాట్స్‌విమెన్ నుంచి ఏ దశలోనూ సరైన సమాధానం లేకపోయింది. నికొలా బ్రౌనే 12 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టింది. పాకిస్తాన్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన న్యూజిలాండ్, ఆతర్వాత విజయ లక్ష్యాన్ని 29.4 ఓవర్లలో, కేవలం మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. కెప్టెన్ సుజీ బేట్స్ కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడి అజేయంగా 65 పరుగులు సాధించి కివీస్‌కు సునాయాస విజయాన్ని అందించింది. లూసీ డూలన్ (11), అమీ సాటెర్త్‌వెయిట్ (7), సారా మెక్‌గ్లాషన్ (0) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరినప్పటికీ ఆమె ఏకాగ్రతను కోల్పోలేదు. కాటీ పెర్కిన్స్ (నాటౌట్ 25) సాయంతో ఆమె జట్టును విజయపథంలో నడిపించింది. పాక్ బౌలర్లలో కెప్టెన్ సనా మీర్ 26 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టింది. సుమయా సిద్దిఖీ ఒక వికెట్ సాధించింది. అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టిన కివీస్ బౌలర్ కాండీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సంక్షిప్తంగా స్కోర్లు
పాకిస్తాన్ ఇన్నింగ్స్: 41.2 ఓవర్లలో ఆలౌట్ 104 (బిస్మా మరూఫ్ 20, అస్మావియా 21, కనితా జలీల్ 14, కాండీ 5/19, బ్రౌనే 2/12).
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 29.4 ఓవర్లలో 3 వికెట్లకు 108 (సుజీ బేట్స్ నాటౌట్ 65, పెర్కిన్స్ నాటౌట్ 25, సనా మీర్ 2/26).
ఆసియా/ఓషియానియా డేవిస్ కప్ గ్రూప్-1
ముగిసిన భారత్ పోరు
కొరియా ఖాతాలో చివరి రెండు మ్యాచ్‌లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: లియాండర్ పేస్‌ను మినహాయిస్తే, టాప్ స్టార్లు ఎవరూ లేకుండానే డేవిస్ కప్ ఆసియా/ఓషియానియా గ్రూప్-1 పోటీల్లో దక్షిణ కొరియాను ఢీకొన్న భారత్ పోరాటం ముగిసింది. ఆదివారం నాటి చివరి రెండు మ్యాచ్‌లనూ కైవసం చేసుకున్న కొరియా ఈ పోటీలను 4-1 తేడాతో గెల్చుకుంది. మొదటి రోజున రెండు మ్యాచ్‌లలో ఓడిన భారత్‌కు శనివారం నాటి డబుల్స్ మ్యాచ్‌లో పూరవ్ రాజాతో కలిసి ఆడిన పేస్ అండగా నిలిచిన విషయం తెలిసిందే. పేస్, రాజా జోడీ డబుల్స్ మ్యాచ్‌ని గెలవడంతో, ఈ పోరులో భారత్ ఆశలు సజీవంగా నిలిచాయి. అయితే, ఆదివారం నాటి రెండు రివర్స్ సింగిల్స్‌లోనూ భారత్ ఓటమిపాలైంది. సక్-యంగ్ జియాన్‌ను ఢీకొన్న రంజీత్ చివరి వరకూ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. అతను 4-6, 4-6, 2-6 తేడాతో ఓటమిపాలయ్యాడు. కాగా, మరో మ్యాచ్‌లో జి సంగ్ నామ్ 6-2, 6-4 ఆధిక్యంతో మాలిక్‌పై గెలుపొందాడు. రంజీత్ ఓటిన వెంటనే ఈ పోటీని కొరియా 3-1 ఆధిక్యంతో తన ఖాతాలోకి చేర్చుకుంది. చివరి మ్యాచ్‌ని కూడా గెల్చుకోవడంతో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. కాగా, భారత్‌కు స్వదేశంలో ఏడేళ్ల తర్వాత ఇది తొలి ఓటమి. 2005లో జరిగిన డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీల్లో స్వీడన్‌ను ఢీకొని 1-3 తేడాతో భారత్ పరాజయాన్ని ఎదుర్కొంది.