చెన్నై, ఫిబ్రవరి 3: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఆరో ఎడిషన్ కోసం నిర్వహించిన వేలంలో ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ పంట పండించుకున్నాడు. చెన్నైలో ఆదివారం జరిగిన ఈ వేలంలో మాక్స్‌వెల్‌ను ముంబయి ఇండియన్స్ 5.3 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఈ సీజన్‌కు మాత్రమే వర్తించే వేలానికి 108 మంది క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. ఆసీస్ స్టార్ ఆటగాళ్లు మైకేల్ క్లార్క్, రికీ పాంటింగ్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడతాయనుకుంటే, అందుకు విరుద్ధంగా మాక్స్‌వెల్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. మాక్స్‌వెల్‌ను సొంతం చేసుకోవాలని హైదరాబాద్ సన్‌రైజర్స్ చివరి వరకూ ప్రయత్నించింది. అతను గతేడాది అఫ్గానిస్తాన్‌తో జరిగిన వనే్డలో అరంగేట్రం చేశాడు. ఇంతవరకూ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని ఆసీస్ పేసర్ కేన్ విలియ్సన్ ప్రారంభ ధర 50 లక్షలు కాగా, పుణే వారియర్స్ అతనిని 3.7 కోట్లకు సొంతం చేసుకుంది. క్లార్క్, పాంటింగ్‌కు ప్రారంభ ధరైన 2.1 కోట్లు మాత్రమే లభించాయి. ఫామ్‌లో లేనప్పటికీ శ్రీలంక స్పిన్నర్ అజంత మెండిస్, ఆసీస్ పేసర్ డిర్క్ నేన్స్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. మెండిస్‌ను 3.8 కోట్లకు పుణే వారియర్స్, నేన్స్‌ను 3.1 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకున్నాయి. వేలంలో ఆల్‌రౌండర్లకు భారీ మొత్తం వెచ్చించడానికి ఫ్రాంచైజీలు వెనకాడలేదు. శ్రీలంక ఆల్‌రౌండర్ తిసెరా పెరీరాను 3.5 కోట్లకు, వెస్టిండీస్ కెప్టెన్ డారెన్ సమీను 2.2 కోట్లకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ట్ఫోర్ మోరిస్ ప్రారంభ ధర 10 లక్షల రూపాయలు కాగా, 3.3 కోట్లకు సూపర్‌కింగ్స్ దక్కించుకుంది. అతని కోసం ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కడదాకా ప్రయత్నించాయి. శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ సుచిత్ర సేననాయకే కోసం ముంబయి ఇండియన్స్, సూపర్ కింగ్స్ తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే, కోల్‌కతా నైట్‌రైడర్స్ అతనిని 3.3 కోట్లకు కొనుగోలు చేసింది. సఫారీ ఆల్‌రౌండర్ జొహాన్ బోథాను 2.3 కోట్లకు ఢిల్లీ డేర్‌డెవిల్స్ దక్కించుకుంది. ఆసీస్ పేసర్లు నాథన్ కౌల్టర్ నైల్‌ను 2.4 కోట్లకు, జేమ్స్ ఫాల్కనర్‌ను 2.1 కోట్లకు, విండీస్ పేసర్ ఫిడేల్ ఎడ్వర్డ్స్‌ను 1.1 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. ఇక భారత ఆటగాళ్ల విషయానికి వస్తే రంజీలలో అద్భుతంగా రాణించిన ముంబయి ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్‌కు శ్రమకు తగ్గ ఫలితం లభించింది. అతనిని 3.5 కోట్లకు వారియర్స్ కొనుగోలు చేసింది. పేసర్లు జయ్‌దేవ్ ఉనాద్కట్‌ను 2.7 కోట్లకు, ఆర్‌పి సింగ్‌ను 2.1 కోట్లకు, పంకజ్ సింగ్‌ను 75 లక్షలకు రాయల్ చాలెంజర్స్ దక్కించుకుంది. పేసర్లు మన్‌ప్రీత్ గోనిను 2.6 కోట్లకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, సుదీప్ త్యాగిని 50 లక్షలకు సన్‌రైజర్స్ సొంతం చేసుకున్నాయి. కాగా, వెర్నొన్ ఫిలాండర్, హెర్షెలె గిబ్స్, డారెన్ బ్రావో, రవి బొపారా, జేమ్స్ హోప్స్, మాథ్యూ వేడ్, టిమ్ పైన్, డౌగ్ బొలింగర్, రంగన హెరాత్ వంటి ప్రముఖ ఆటగాళ్ల కోసం ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబరచకపోవడం గమనార్హం.
ఐపిఎల్ వేలంలో రూ.5.3 కోట్లు పలికిన ఆసీస్ ఆల్‌రౌండర్
english title:
m
Date:
Monday, February 4, 2013