Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అమ్మ 6

$
0
0

‘‘మీరు రూమ్‌లోకి వెళ్ళొచ్చు. మీ అమ్మాయిని 5వ నంబరులోకి షిప్ట్ చేశాం’’ అని నర్స్ చెప్పేసరికి తడబడుతూ లేచి రూమ్ నెంబరు చూసుకుంటూ తలుపు నెట్టింది వసంత.
‘‘జీవన! తన కూతురు! తనూ ఇలాగే అరచీ ఏడ్చి పేగులు తెంచి శరీరాన్ని చీల్చి ఇచ్చిన జన్మ, ఇప్పుడు అచ్చం తనలాగా తనూ తన బిడ్డకు జన్మనిచ్చి అలసి సొలసి పడుకుంది.
ప్రకృతి చక్ర పరిభ్రమణంలో తల్లే కూతురు కూతురే తల్లి, ఇలా ఈ చక్రాన్ని నడిపేది తల్లీ కూతుళ్లే. ఇందులో పురుష ప్రమేయం లేదు. స్ర్తినే మొదటిసారి కూతురు, మరోసారి తల్లి తర్వాత మరో కూతురు మళ్లీ ఆ కూతురే తల్లి.
ఇందులో కొడుకు ప్రసక్తి లేదు. ప్రకృతి అంటే ‘ఉత్పత్తి’ (ప్రొడక్టివిటి) జన్మనిచ్చేది. అందుకే స్ర్తియే ప్రకృతి, ప్రకృతే స్ర్తి తన కూతుర్ని తల్లిని చేసిన, మరో కూతుర్ని చూడాలనిపించింది వసంతకు.
చప్పుడు కాకుండా తలుపు వేసి ఉయ్యాల దగ్గరకు నడచింది.
చిగురాకుల పొత్తిళ్లలో పసిమొగ్గ ఒత్తిగిలినట్లు కనులు మూసుకొని పెదవులు ముడుచుకుని ఉంది పాప.
మెల్లగా చెయ్యి చాచి పాపను అందుకోబోయింది వసంత.
చప్పుడుకు కళ్లుతెరిచి, మెల్లగా బెడ్‌మీద చేతులు ఆన్చి లేవడానికి ప్రయత్నించింది జీవన. ఎంత మాత్రం వీలుకాలేదు. ఆన్చిన చేయి జారి నడుం కదిలి కలుక్కుమంది. ‘‘అమ్మా’’ అంది అప్రయత్నంగా.
ఉలికిపడింది వసంత.
తన కూతుర్ని అమ్మను చేసిన బిడ్డకంటే తనను అమ్మను చేసిన బిడ్డ పిలుపే ముందుగా గుండెను తాకిందేమో. ఉయ్యాల దగ్గర నిలుచున్న వసంత ఒక్క ఉదుటున జీవన దగ్గరకు వచ్చేసి ‘‘అయ్యో అప్పుడే లేవడానికి ప్రయత్నిస్తున్నావేంటి? పడుకో! పడుకోవాలి. సరిగా పడుకో’’ అంటూ దిండు సరిచేసి ఎత్తిన భుజాలను దిండుమీద ఆన్చింది.
‘‘అమ్మా’’ అని పిలిచి ఉయ్యాలవైపు చూపు తిప్పింది జీవన.
‘‘ఏంట్రా’’ అడిగింది వసంత.
‘‘పాపా? బాబా?’’ ఎంతో మరుపు కళ్ళల్లో...
‘‘ఎవరయితేనే’’ వసంత అంది ఆ గొంతులో ముక్తసరి.
‘‘ఒక్కసారి చూడాలని..’’ అంది జీవన.
‘‘ఎందుకు?’’ వసంత అడిగింది.
‘‘ఇన్నాళ్ళు నా కడుపులో ఉన్న ఆ రూపం ఎలా ఉందోనని’’ అంది జీవన.
‘‘ఎలా ఉంటేనేం? మనం పెంచుకోవాలనుకోవడం లేదుగా’’ అంది కినుకగా వసంత.
‘‘ఒక్కసారి చూసేసి ఇచ్చేస్తానమ్మా’’ జీవన గొంతులో ఏడుపు జీర తీగలా సాగింది.
‘‘చూశాక ఇచ్చేయలేవు జీవనా’’ అర్థం చేసుకొమ్మన్నట్లు విలవిలలాడింది వసంత గుండె.
‘‘ఇవ్వగలనమ్మా మనసు రాయి చేసుకుంటాను. ప్లీజ్’’
‘‘అప్పుడు చేసుకునే రాయి ఇప్పుడు చేసుకో, మనసు ఓసారి స్రవించాక గడ్డకట్టడం కష్టం’’ అంది వసంత జీవన బెడ్‌షీట్ సరిచేస్తూ....
ఎలాగయినా జీవన ఆలోచన కొనసాగకూడదనేది వసంత ప్రయత్నం.
‘‘ఇంత కఠినం ఎలా అయ్యావమ్మా నువ్వు’’ జీవన నమ్మలేనట్లుగా అంది.
‘‘నా కూతురి భవిష్యత్తు కోసం’’ స్థిరంగా చెప్పింది.
‘‘నేనూ నా బిడ్డ భవిష్యత్తు కోసం కఠినం అవుతానమ్మా’’ అంది జీవన మొండిగా.
‘‘బాలింతవు, ఇప్పుడు టెన్షన్స్ పెట్టుకోకూడదు. డెలివరీ అయ్యాక ఎవరనేది కూడా తెలుసుకోకుండా మిషనరీ వాళ్ళకు ఇచ్చేయాలనీ ముందే అనుకున్నాం మరి నువ్వు ఒకసారి చూడాలంటున్నావు. చూశాక నీ మనసుకో రూపం ముద్రించబడి దానికోసం నిన్ను పిచ్చిదాన్ని చేస్తుంది. పుట్టగానే బిడ్డ చనిపోయిందనుకో’’అంది వసంత జీవన తల నిమురుతూ..
‘‘కానీ... ఒక్కసారి...ప్లీజ్.. అమ్మా.. ప్లీజ్’’ అంది జీవన తను అడగాల్సింది అడక్కముందే గొంతు పూడుకుపోయింది.
డాక్టర్స్ టీమ్ వచ్చింది చెకప్‌కు వసంత పక్కకు జరిగింది.
‘‘ఏమ్మా స్టిచెస్ పెయిన్‌గా ఉన్నాయా?’’ డాక్టర్ స్టెత్ తీస్తూ అడిగింది.
‘‘లేదు.. ఆహా కొంచెం ఉంది’’ కన్‌ఫ్యూజింగ్‌గా చెప్పింది.
‘‘ఏదీ ఇంతకూ నీ కూతురేది? ఫీడింగ్ ఇస్తున్నావా?’’ అని అడిగింది.
‘‘కూతురా?... అంటే పాప పుట్టిందా తనకు’’ తెలిసిపోయిందో నిజం. తను ఇన్నాళ్ళు కణం కణం కూర్చిన జీవం ఓ పాప.
‘‘ఉయ్యాల్లో.. ఉయ్యాల్లో ఉంది’’ గబగబా చెప్పేసింది.
నువ్వు చెప్పకపోయినా నాకు తెలిసిపోయింది అన్నట్లుగా వసంత వేపు చూసింది. వసంత మొహం అసహనంగా ఉంది.
‘‘సిస్టర్ బేబీని తెండి’’ ఫీడింగ్ వచ్చిందో లేదో చూద్దాం’’ అని సిస్టర్‌కు ఆర్డర్ వేసి ‘‘ఏదమ్మా బ్రెస్ట్ చూపించు’’ అంది జీవనను.
జీవనకు సిగ్గు ముంచుకొచ్చింది. రూమ్‌లో ఉన్నవాళ్ళ వైపు ఇబ్బందిగా చూసింది.
‘‘ఓకె మీరు కాస్త బయట వెయిట్ చేస్తారా!’’ వాళ్ళను రిక్వెస్ట్ చేసింది డాక్టర్. వాళ్ళందరూ బయటికెళ్ళి తలుపు దగ్గరకేశారు.
నర్స్ బిడ్డను తెచ్చి డాక్టర్ చేతికిచ్చింది. డాక్టరు కాలూ చెయ్యి కదిలించింది. కనురెప్పలు ఎత్తి చూసింది, తొడమీద మెల్లగా తట్టింది.
పాప కేర్ కేర్‌మని ఏడవగానే జీవన గుండెల్లో ఏదో వత్తిడి ప్రవహించి బ్రెస్ట్ బరువయ్యింది. ఏదో ఉధృతం నిపుల్స్ పగిలిపోతాయనిపించింది.
‘‘బేబి ఓకేనమ్మా బావుంది. కానీ ఫీడింగ్ సరిగా ఉందా?’’ అని చూసింది.
‘‘మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఏదీ బేబీకి ఇవ్వు’’ అంది బేబిని సిస్టర్‌కు అందిస్తూ.
సిస్టర్ బేబీ చిన్ని నోరు తీసుకొచ్చి జీవన బ్రెస్ట్‌కానిచ్చింది.
ఇంతవరకూ ఏ స్పర్శా ఎరగని ప్రాంతమది. స్నానం చేసేప్పుడు పొరపాట్న చెయ్యి తగిలితే ఉలిక్కిపడి వదిలేసి సిగ్గుపడిపోయి మళ్లీ చెయ్యి తగలకుండా చూసుకున్న అవయవం అది.

-ఇంకాఉంది

‘‘మీరు రూమ్‌లోకి వెళ్ళొచ్చు.
english title: 
a
author: 
శ్రీ లత

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>