‘‘సుగ్రీవా! ఆ తాళ వృక్షాలను నాకు శీఘ్రమే చూపవలసింది’’ అని అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు శ్రీరాముడిని శీఘ్రంగా తోడ్కొని పోయి ఆ తాడులను చూపించాడు. శ్రీరాముడు అసదృశమూ, అశని సంకాశమూ అయిన నిశితాస్త్రాన్ని సంధించి ఆకర్ణాతం తివిచి ఒక్కసారిగా రావణుడి కంఠనాళాలు అనే త్రాళ్లు తెగత్రెంచిన రీతిని ఆ సప్త తాళ వృక్షాలను తెగకొట్టాడు. వక్రాలై వున్న ఆ తాడిచెట్లు గాడిపారి అవనిపై త్రెళ్లిపడినాయి. శ్రీరాముడు ప్రయోగించిన శరం చెంతనున్న గిరిని దాటి, దారుణిలోదూరి, పాతాళలోకం చేరి, వేగాతివేగంగా మరలివచ్చి రాముడి తూణీరంలో తనయథాస్థానంలో నిలిచింది.
అంత ఆకాశవీధిలో ఎగిరిపోతున్న ఒక విమానం నుంచి అతులిత రవం ఒకటి ఈ గతి వినవచ్చింది.
‘‘ఓ పరమేశ్వరా! రామా! నేను మహేంద్రుడి కొలువులో వుంటాను. నా పేరు కరుణావతి. దూర్వాసోమునిని తెలియక నిందించిన కారణంగా ఆ మహర్షి కుపితుడై శపించాడు. నాకు శాప విమోచనం అయి ఈ తాళ తరువుల రూపం తొలగిపోయింది. నీకు కృతజ్ఞతలు తెల్పుకొంటూ అమరేంద్రపురికి అరుగుతున్నాను’’ అని పలికి స్వర్గలోకానికి వెళ్లిపోయింది.
అప్పుడు శ్రీరాముడు ప్రయోగించిన శరం తిరిగి వచ్చి అమ్ముల పొదిలో ప్రవేశించడం చూసి సుగ్రీవుడు నివ్వెరపోయాడు. సప్తపాతాలలోను కల మూలాలు(వేరులు) సప్తాశ్వమండలాలను ఆచ్ఛాదించు పత్రాలయిన సప్త తాళాలను ఒకే ఒక అస్త్రంతో శ్రీరాముడు కూలగొట్టాడు. నా సంశయం తీరింది. వాలి రాఘవుడి చేతిలో మృతి చెందుతాడు. ఒక కపిరాజ్యం ఏమిటి? ముల్లోకాలనే ఏలగలను? అని తనలో తాను తలపోశాడు. కపితీరులు ఆనందించారు.
పిమ్మట సుగ్రీవుడు ఇనవంశ తిలకుణ్ణి పొడగాంచాడు. ఇనవంశ దినమణికి రవితనయుడు సుగ్రీవుడు కరాలు జోడించాడు. ‘‘దేవా! రామా! నీభౌతిక రూపం చూసి నీ అంతశ్శక్తి భావింపలేకపోయాను. పశుబుద్ధిని అయాను. నేను ఇనజుడిని. నీవు ఇనవంశజాతుడివి అని సమబుద్ధితో చూశాను. అపరాధిని అయాను. ఈ లోకాలకు నువ్వే పాలకుడివి. నన్ను పాలించు. బంటుగా ఏలు. నా శత్రువైన వాలిని తెగటార్చు. నా శోకాన్ని తొలగించు’’ అని వాపోయాడు.
అప్పుడు రామచంద్రుడు సుగ్రీవుడిని దయ దృష్టితో వీక్షించాడు. మన్నించాడు. సుగ్రీవుడితో ‘‘వెంటనే నీవు పోయి వాలితో పోరాడుతూ వుండు. ఒక కోలతో అవలీలగా వాలిని చంపి కపిరాజ్య పదవికి నిన్ను పట్టం కడతాను. వెరవకు’’ అని వచించాడు. అప్పుడు సుగ్రీవుడు ఉప్పంగిపోయాడు. నలుడు, నీలుడు, హనుమంతుడు, మహాబలశాలి తారుడు- నలుగురూ తనతో నడచి ఏతెంచ యుద్ధ సన్నద్ధుడై వెడలాడు. వారి వెనుక రామలక్ష్మణులు చనుదెంచి కిష్కింధా నగరానికి ఆవల కల వనంలోదాగి వుండి సుగ్రీవుడిని ప్రోత్సహించి పంపారు.
వాలి సుగ్రీవుల పోరు
సుగ్రీవుడు కిష్కింధా నగరం వాకిట నిలచాడు. ఉదగ్రుడై ఆర్చి పేర్చాడు. తనతో పోరాడ తడయక రా అని వాలిని పిలిచాడు. గజ బృంహితాన్ని విని అలిగే సింహం మాదిరి ఆగ్రహించి, శివచరణారవింద పూజార నిరతుడు, రావణుడిని కంఠాల్ని పట్టి సముద్రంలో ముంచి, మించిన వాలి వచ్చి సుగ్రీవుడితో తలపడ్డాడు.
అవక్ర విక్రములు ఆ వాలి సుగ్రీవులు పూర్వ పశ్చిమ సముద్రాలు పోరాడే క్రియ పోరాడారు. ఇర్వురూ సమాన జవాటోపం కలవారు. సమకోపులు, సమప్రతాపులు. ఏకరూపులు. ఆ ఇర్వురూ అనోన్యం ఇలానువులు, జంఘాలు, వృక్షాలు, జఘనాలు చిత్ర విచిత్రంగా చీల్చి చెండాడాలని ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. శ్రీరాముడు వింట శరం సంధించి ప్రయోగించ యత్నించి ఆకస్మికంగా ఆగిపోయాడు. ఆ ఇర్వురినీ పరిశీలించాడు.
-ఇంకాఉంది