సత్యము యొక్క మహిమ మహా అద్భుతమైనది. సత్యానికి సాటియైనది ఎక్కడను ఏదియు లేదు. సత్యమువలన సకలము సిద్ధించును.
సత్యమునకు కట్టుబడి రాజ్యాన్ని భార్యాబిడ్డలను కోల్పోయాడు హరిశ్చంద్రుడు. ఆయన ఈనాడు సత్యహరిశ్చంద్రునిగా అందరి ప్రశంసలు అందుకొంటున్నాడు. నాడు నేడు అన్న తేడా లేక ఎప్పుడూ ఎంతో గొప్ప విలువను కలిగి ఉండేది సత్యమే అన్నది అక్షరసత్యం. సత్యమహిమను గురించి శ్రీ బుద్ధ భగవానులుగారు తమ శిష్యులకు చెప్పిన కథను ఇలా ఉంది. ‘‘సత్యము తప్పనివాని మాట అగ్నికూడా జవదాటలేడనేందుకు ఉదాహరణ ఈ కథ’’ అంటూ ఆయన ఈ కథ చెప్పాడు.
‘‘పూర్వం ఒకానొక అడవిలో ఒక పెద్ద బూరుగ చెట్టు వుండేది. ఆ చెట్టుపై అనేక పక్షులు గూళ్లు కట్టుకుని నివసించుచున్నవి. అందు ఒక గూటిలో వెలిచెపిట్ట పెంటితో కాపురం చేయుచున్నది. దాని కడుపున నాకప్పుడొక పిల్ల బోధిసత్త్వుని అంశవలన పుట్టినది. దాని తల్లిదండ్రులు దానికి మెత్తగా నుండుటకై గడ్డి వేసి పరుండబెట్టిరి. దానికెన్నో తోబుట్టువులున్నవి. దానికి ఇంకను రెక్కలు రాలేదు. బోధిసత్త్వుని అంశవల్ల పుట్టిన పిల్ల దాని జన్మాంతర సంస్కారమువలన అహింసమీదికే పోసాగింది. తన తల్లిదండ్రులు తన కాహారముగా మాంసం తెచ్చి పెట్టగా ఆ పిల్ల తినేదికాదు. అందుచే అవి మర్రిపళ్ళు, చిగుళ్ళు మొదలైనవి తెచ్చి ఇచ్చెడివి. తక్కిన పిల్లలన్నియు మాంసాహారమును తినుటచే తొందరగా రెక్కలు పెరిగి పుష్టిగా పెరుగుచున్నవి. అది మాత్రము ఎన్నాళ్లయినను బలుపు లేక బక్కచిక్కియే వుండెడిది.
ఇంతలో వేసవి కాలం వచ్చినది. ఎండలు మండిపోవుచున్నవి. ఆ యెండలకు పచ్చగడ్డి భగ్గుమని మండుచున్నది. చెట్లు ఒకదానికొకటి రాపాడుకొనుటవలన నిప్పు పుట్టినది. అదే దావాగ్ని. అడవి నిప్పు అన్నమాట. అడవి మృగములు అటు ఇటు ఎటుపడితే అటు పరుగెత్తుచున్నవి. అయినను పాపం అవన్నీ దావాగ్నికి ఆహుతి యగుచున్నవి. నలుమూలల నిప్పంటుకున్నప్పుడు ఏమైనా ఏమి చేయగలవు? ఆ మంటలకు గాలి తోడైనది.
ఇదంతా గమనించిన పక్షులన్నియు రెక్కలు వచ్చి ఎగురగల్గినవన్నియు ఎగిరిపోయినవి. వేటి ప్రాణరక్షణనవి చేసుకొన్నవి. ఇక మిగిలినదొక పిట్టయే. అది పాపము ఎగురలేదుకదా, నిప్పు మంటలు నాలుకలవలె చాపుచూ దగ్గర దగ్గరకు వచ్చుచుండెను. దానికేమి చేయుటకును తోచలేదు. ఇక అగ్నిహోత్రునే ప్రార్థించుట ఉత్తమమనుకొన్నది.
‘‘ఓ అగ్నిహోత్రుడా మహానుభావా! నీవు సర్వభక్షకుడవు. అయినను దయామయుడవు. నా తల్లిదండ్రులుకూడా నన్నొదిలిపోయిరి. నాకు ఎగురుటకు రెక్కలు రాలేదు. నేను చిన్నప్పటినుండి దేని మాంసం తినకుందునేని, నాకహింసయే పరమవ్రతమగునేని ఓ అగ్నిదేవా! నా మాట ప్రకారము నీవు వెనుకకు తగ్గుము. నాకోరిక మన్నించి నన్ను రక్షింపుము’’ అని సత్యవాక్యముతో ప్రార్థించెను. దాని సత్యవాక్య మహిమచే అగ్నిహోత్రుడు ప్రీతుడై తన జ్వాలలను సంహరించుకొనెను. ఆ రీతిగా దావాగ్నికూడా మంత్రపు కట్టు కట్టినట్లాగిపోయినది. అది సత్యవాక్కు మహిమ. మాటలు రాని పక్షి పిల్ల ‘సత్యమహిమ’ వల్ల మంటలనుండి తనను తాను రక్షించుకొన్నది. ఇదియే సత్యమహిమ అంటే.
...................
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను
సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు
తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.
..........................
మంచిమాట
english title:
manchimata
Date:
Wednesday, February 6, 2013