ముంబయి, ఫిబ్రవరి 6: దేశంలో బంగారం ధరలు పెరిగిపోకుండా, డిమాండ్‌ను కొంత మేర నియంత్రించే దిశగా ఆర్‌బిఐ సలహా కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేసింది. 5 లక్షల రూపాయల పైబడి బంగారం, నగలు కొనుగోళ్లు జరిపే వారి నుంచి పాన్ కార్డు కాపీని సేకరించడం, బంగారం రుణాలపై ఆంక్షలు విధించడం, బంగారం రుణాలను ఇచ్చే ఎన్‌బిఎఫ్‌సి (బ్యాంకిగేతర సంస్థలు)లపై కూడా కొన్ని ఆంక్షలు , కొంత మొత్తం దాటిన తర్వాత చెక్ ద్వారా కొనుగోళ్లు జరిపేటట్లు ప్రోత్సహించడం, బంగారం పెట్టుబడులను నిరుత్సాహపరిచి, ఇతర పొదుపు పథకాల పట్ట ఇనె్వస్టర్లు ఆకర్షితులయ్యేలా చర్యలు చేపట్టడం వంటి సూచనలను కమిటీ చేసింది. అంతేకాక బంగారం కొనుగోళ్లకు బ్యాంకులు, ఇతర సంస్థలు ఇచ్చే రుణాలను నిషేధించడం, 20 ఏళ్ల క్రితం వలె బులియన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించాలని కమిటీ సూచించింది. బంగారం దిగుమతులను నియంత్రించే దిశగా, తద్వారా కరెంట్ అక్కౌట్ లోటును భర్తీ చేసేందుకు వీలుగా ఆర్‌బిఐ ఈ ప్రతిపాదనలు సూచించింది. అంతేకాక గోల్డ్ బ్యాంక్‌లను ఏర్పాటును ప్రోత్సహించి వీటి ద్వారా బంగారం దిగుమతులు, ఎగుమతులు, వాణిజ్యం, రుణాలు ఇవ్వడం, డెరివేటివ్స్ వ్యవహారాలను నిర్వహించడం వంటివి చేయవచ్చునని కమిటీ సూచించింది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్‌కు
కొత్త ఎండి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 6: స్వర్ణ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారత దేశంలో తమ సంస్థకు కొత్త మేనేజింగ్ డైరక్టర్‌ను నియమించింది. ముంబయి ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న సోమసుందరంను ఎండిగా నియమించినట్లు బుధవారం ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన లక్షీవిలాస్ బ్యాంక్‌లో పని చేసి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్‌లో చేరారని ఆ కంపెనీ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి సంబంధించి అన్ని అంశాల్లో నేతృత్వం వహిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్‌లో చేరడం తనకెంతో ఆనందంగా ఉందని సోమసుందరం ఆ ప్రకటనలో వెల్లడించారు.
‘సహారా’ ఆస్తులను సెబీ స్వాధీనం చేసుకోవచ్చు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: పెట్టుబడిదారులకు 24వేల కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వాలని కోర్టు ఆర్డరును ఉల్లంఘించినందున సహారా గ్రూప్‌నకు చెందిన రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, హౌసింగ్ ఇనె్వస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆస్తులను, బ్యాంక్ అక్కౌంట్లను సెబీ స్వాధీనం చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. 2012 ఆగస్టు 32న కోర్టు ఆదేశించిన విధంగా సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ (ఎస్‌ఐఆర్‌ఇసి), సహారా హౌసింగ్ ఇనె్వస్ట్‌మెంట్ కార్పొరేషన్ (ఎస్‌హెచ్‌ఐసి) ఆస్తులను అటాచ్ చేయడం, బ్యాంక్ లెక్కలను స్తంభింపచేయడం వంటి చర్యలను తీసుకోనందుకు సుప్రీంకోర్టు సెబీని మందలించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన నేరానికి కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోరాదో నాలుగు వారాలలో తెలియచేయాల్సిందిగా సహారా గ్రూప్‌నకు కోర్టు నోటీసు జారీ చేసింది.