కాన్‌బెరా, ఫిబ్రవరి 6: వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను మొదటి మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందిన ఆస్ట్రేలియా 3-0 తేడాతో కైవసం చేసుకుంది. దీనితో చివరి రెండు మ్యాచ్‌లు నామమాత్రంగా మారనున్నాయి. బుధవారం ఇక్కడ జరిగిన మూడో వనే్డలో ఓపెనర్ షేన్ వాట్సన్ సెంచరీతో కదం తొక్కడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 329 పరుగులు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 47.3 ఓవర్లలో 290 పరుగులకే కుప్పకూలింది. మొదటి రెండు వనే్డల్లో విజయభేరి మోగించిన ఆస్ట్రేలియా మూడో వనే్డను 39 పరుగుల తేడాతో గెల్చుకొని, సిరీస్‌ను సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు వాట్సన్, ఫిన్చ్ చక్కటి ఆరంభాన్నిచ్చారు. మొదటి వికెట్‌కు 89 పరుగులు జోడించిన తర్వాత విండీస్ కెప్టెన్ డారెన్ సమీ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ థామస్‌కు చిక్కిన ఫిన్చ్ 38 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అవుటయ్యాడు. ఫిల్ హ్యూజెస్‌తో కలిసి రెండో వికెట్‌కు 112 పరుగులు జోడించిన వాట్సన్ 111 బంతులు ఎదుర్కొని, 12 ఫోర్లు, రెండు సిక్సర్లతో 122 పరుగులు చేసి, రోచ్ బౌలింగ్‌లో పొలార్డ్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. మైఖేల్ క్లార్క్ (15) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. అయితే, ఫిల్ హ్యూజెస్ (86), జార్జి బెయిలీ (44) రాణించడంతో ఆస్ట్రేలియా 300 పరుగుల మైలురాయిని దాటగలిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) వేలంలో అత్యధిక ధర పలికిక మాక్స్‌వెల్ కేవలం నాలుగు పరుగులు చేసి వెనుదిరిగాడు. ఫాల్క్‌నర్ (2) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. ఆసీస్ నిర్ణీత ఓవర్లు పూర్తి చేసే సమయానికి మాథ్యూ వేడ్ (4), మిచెల్ జాన్సన్ (8) క్రీజ్‌లో ఉన్నరు. విండీస్ బౌలర్లలో సమీ, సునీల్ నారైన్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ తరఫున పావెల్ (47), ‘బ్రేవో సోదరులు’ డారెన్ (86), డ్వెయిన్ (51) మెరుగైన స్కోర్లు సాధించారు. చివరిలో ఆండ్రీ రసెల్ 43 పరుగులు చేసి జట్టును ఆదుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన విండీస్ 47.3 ఓవర్లలో 290 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో ఫాల్క్‌నర్‌కు నాలుగు వికెట్లు లభించాయి. మైఖేల్ క్లార్క్ రెండు వికెట్లు పడగొట్టడం విశేషం.
సంక్షిప్తంగా స్కోర్లు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 7 వికెట్లకు 329 (వాట్సన్ 122, హ్యూజెస్ 86, బెయిలీ 44, సమీ 2/49, సునీల్ నారైన్ 2/55).
వెస్టిండీస్ ఇన్నింగ్స్: 47.3 ఓవర్లలో ఆలౌట్ 290 (పావెల్ 47, డారెన్ బ్రేవో 86, డ్వెయిన్ బ్రేవో 51, రసెల్ 43, ఫాల్క్‌నర్ 4/48, క్లార్క్ 2/62).
రొటేషన్ విధానం వద్దు
సిఎకు వార్న్ హితవు
మెల్బోర్న్, ఫిబ్రవరి 6: ఆటగాళ్లను రొటేషన్ విధానంలో ఎంపిక చేసే పక్రియను మానుకోవాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అధికారులకు మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ హితవు పలికాడు. ఈ విధానం వల్ల చాలా మంది ప్రతిభావంతులకు సరైన అవకాశాలు లభించడం లేదని విమర్శించాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆటగాడిని కూడా రొటేషన్ పేరుతో జట్టు నుంచి తొలగించి, కొత్త వారికి స్థానం కల్పించడంతో సమతూకం దెబ్బతింటున్నదని ధ్వజమెత్తాడు. ఇటీవల కాలంలో ఆసీస్ జట్టు గొప్పగా రాణించలేకపోవడానికి ఇదే ప్రధాన కారణమని అన్నాడు. తక్షణమే రొటేషన్ విధానాన్ని రద్దు చేయాలని సిఎను కోరాడు.
‘స్పెషల్’ అథ్లెట్ల హవా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: దక్షిణ కొరియాలోని పైయాంగ్ చాంగ్‌లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్ ప్రపంచ వింటర్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రతిభ కనబరిచారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 13 స్వర్ణాలు, 17 రజతాలతో సహా మొత్తం 46 పతకాలు కైవసం చేసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా 122 దేశాల నుంచి 2,200 మంది మానసిక వికలాంగ అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 2009లో జరిగిన పోటీలతో పోలిస్తే భారత్ ఈసారి రెట్టింపు పతకాలను సాధించడం విశేషం.